మరో యువతి మృతదేహం లభ్యం

Missing College Girl Found Dead In Bommalaramaram - Sakshi

సాక్షి, బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ఇటీవల వెలుగు చూసిన శ్రావణి హత్యకేసు ఉదంతం మరువకముందే మరో యువతి హత్య వెలుగు చూసింది. శ్రావణి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన బావిలోనే మరో యువతి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతురాలు నెల క్రితం నుంచి కనిపించకుండా పోయిన మనీషా అనే డిగ్రీ విద్యార్థినిగా గుర్తించారు. అస్థికలను బావిలోంచి తీయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి రెండు ఫైరింజన్లను తరలించారు. రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్ భగవత్ కూడా హాజీపూర్ చేరుకున్నారు.

నాలుగు రోజుల వ్యవధిలోనే ఇద్దరు అమ్మాయిల మృతదేహాలు బావిలో బయటపడటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. శ్రావణిని హతమార్చిన వారే మనీషాను కూడా చంపేసివుంటారని అనుమానిస్తున్నారు. కేఎల్‌ఆర్‌ డిగ్రీ కాలేజీలో బీకామ్‌ చదువుతున్న మనీషా ప్రియుడితో పారిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు పరువు పోతుందన్న భయంతో మిన్నకుండిపోయారు. చుట్టాలింటికి వెళ్లిందని గ్రామస్తులతో చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. అయితే ఆమె మృతదేహం బయటపడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

నాలుగేళ్ల క్రితం ఆరో తరగతి విద్యార్థిని కల్పన అనే అమ్మాయి కూడా అదృశ్యమైందని హాజీపూర్‌ గ్రామస్తులు వెల్లడించారు. ఈ నేరాలన్ని ఒకరి పనేనా, కాదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణి హత్య కేసులో హాజీపూర్‌కు చెందిన పాత నేరస్తుడు శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. వీరు ఇచ్చిన సమాచారంతోనే మనీషా హత్య వెలుగు చూసినట్టు తెలుస్తోంది. కల్పనను కూడా వీరే హత్య చేసివుంటారని ఆమె కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. హాజీపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులను మొహరించారు. (శ్రావణిని చంపిందెవరు?)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top