ఆ వికృత చేష్టలు భరించలేనివి

Meyar Harassing Girls - Sakshi

నిజామాబాద్‌ క్రైం (నిజామాబాద్‌ అర్బన్‌):  లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ వికృత చేష్టలు అంతాఇంతా కాదని శాంకరీ నర్సింగ్‌ కళాశాల విద్యార్థినులు వాపోయారు. ప్రజా సంఘాలతో కలిసి శుక్రవారం సీపీ కార్తికేయకు ఫిర్యాదు చేసిన అనంతరం బాధిత విద్యార్థినులు మాట్లాడారు. సంజయ్‌ కళాశాలకు ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఉండేవాడని, కళాశాలలో ప్రత్యేక గదికి తీసుకెళ్లి తమతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడన్నారు.

వారం కిత్రం ఓ విద్యార్థిని అస్వస్థతకు గురై కిందపడిపోగా ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లడానికి వస్తే సంజయ్‌ పంపించలేదన్నారు. తామే చూసుకుంటామని తల్లిదండ్రులను వెనక్కి పంపించినట్లు తెలిపారు. ఆ తర్వాత విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడి నుండి తన ఇంటికి తీసుకెళ్లి గదిలో బంధించాడని తెలిపారు. తమతో డార్లింగ్‌ అంటూ సంభోదించేవాడని, చాలా మందితో  ఇదే విధంగా ప్రవర్తించటంతో వారు కళాశాలకు రావటం మానేశారని చెప్పారు.

భయపడి సర్టిఫికెట్లు కూడ తీసుకెళ్లలేదన్నారు. ఇదిలా ఉండగా సంజయ్‌పై నిర్భయతో పాటు మరో నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సంజయ్‌ను అరెస్టు చేసేందుకు జిల్లా కేంద్రంలోని ఆయన నివాసానికి వెళ్లగా అక్కడ లేక పోవటంతో పోలీసులు వెనుదిరిగారు. తాను విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడలేదని, ఇది ప్రత్యర్థులు చేస్తున్న రాజకీయ కుట్రగా ఉదయం మీడియా సమావేశంలో పేర్కొన్న సంజయ్‌ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆయన కోసం గాలింపు ప్రారంభించారు. నర్సింగ్‌ కళాశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీడీఎస్‌యూ, పీఓడబ్ల్యూ, పీవైఎల్, ఏఐకేఎంఎస్‌ సంఘాల నాయకులు, బాధిత విద్యార్థినులు పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయను కలిసి ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థినులు గురువారం హైదరాబాద్‌లో ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డిని కలిసి  ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఈ మేరకు సీపీ కార్తికేయకు పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పరుశురాం, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం సిద్ధలక్ష్మీ, సతీష్, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభద్ర, ఉపాధ్యక్షులు సుమ, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి అనురాధ, పీవైఎల్‌ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు వరదయ్య, బాలయ్య, ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షులు బి గంగారెడ్డి, బాధిత విద్యార్థినులతో కలిసి సీపీ కార్తికేయకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి అనురాధ మాట్లాడుతూ నర్సింగ్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న 13 మంది విద్యార్థినులలో 11 మందిపై సంజయ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. విద్యార్థినులు డిసెంబర్‌లో అడ్మిషన్లు తీసుకున్నారని, అడ్మిషన్‌ తీసుకున్న రెండు నెలల తర్వాత కళాశాల లీజ్‌ నిర్వాహకుడిని సంజయ్‌ తొలగించాడని తెలిపారు. అనంతరం కళాశాలకు రావటం మొదలుపెట్టి విద్యార్థినుల పట్ల వికృత చేష్టలు, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిపారు.

సంజయ్‌పై చర్యలు తీసుకుని, కళాశాలను సీజ్‌ చేయాలని, విద్యార్థినులు విద్యా నష్టపోకుండా వారిని మరో కళాశాలలో చేర్పించాలన్నారు. బాధిత విద్యార్థినుల కుటుంబాలకు పోలీస్‌శాఖ పరంగా భద్రత కల్పించాలని కోరాగా  సీపీ భరోసానిచ్చారని తెలిపారు. సంజయ్‌పై నాల్గోటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో నిర్భయ చట్టం 354 354(ఎ), నిర్బంధం 342, బెదిరింపుల కింద 506, అభ్యంతకరంగా చేతులతో తాకటం 509 సెక్షన్లు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top