నేను చచ్చాకైనా న్యాయం చేయండి

Married Women Suicide Selfie Video Viral Karnataka - Sakshi

పోలీస్‌ స్టేషన్‌లో అవమానం

ఇంటి యజమాని బాధ్యుడని చెప్పి వివాహిత సెల్ఫీ ఆత్మహత్య

పోలీస్‌స్టేషన్‌ ముందు బాధిత కుటుంబం ధర్నా

కర్ణాటక, దొడ్డబళ్లాపురం : ఒక అవమానం ఆమెను మానసికంగా కృంగదీసింది...అందులోనూ న్యాయం చేయాల్సిన పోలీసుల ముందు దాడి జరగడం, తన కళ్ల ముందే, భర్తనూ కొట్టడంతో తీవ్ర మానసిక వేదనకు గురైంది...ప్రాణాలు అర్పించయినా నిందితులకు శిక్షపడాలని భావించి వివాహిత సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దేవనహళ్లి పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన మంజుల (35) ఆత్మహత్య చేసుకుంది. వివరాలు...

దేవనహళ్లి పట్టణ పరిధిలోని మంజునాథ్‌ నగర్‌లో సోమశేఖర్‌ అనే వ్యక్తి ఇంటిని మృతురాలు మంజుల కుటుంబం లీజుకు తీసుకున్నారు. అగ్రిమెంటు ప్రకారం ఇల్లు ఖాళీ చేయడానికి ఇంకా సమయం ఉంది. అయితే మంజుల కుటుంబం నీరు ఎక్కువగా వినియోగిస్తున్నారని ఇంటి ఓనర్‌ సోమశేఖర్‌ ఈయన భార్య గీతా, కూతురు బిందు నిత్యం గొడవపడేవారని సమాచారం. ఇల్లు ఖాళీ చేయాలంటూ వేధించేవారు. దీంతో విసిగిపోయిన మంజుల, భర్త సుబ్రమణి ఇద్దరూ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా స్టేషన్‌ ముందే ఇద్దరినీ సోమశేఖర్, గీత, బిందులు దాడిచేసి కొట్టినట్లు ఆరోపణ. ఇదంతా చూస్తూ పోలీసులు జోక్యం చేసుకోలేదనే అవమాన భారంతో సోమవారం రాత్రి మంజుల భర్తను ఇద్దరు ఆడపిల్లలను ఆస్పత్రికి పంపించి సెల్ఫీ వీడియో తీసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సెల్ఫీ వీడియోలో జరిగిన అవమానాన్ని వివరించిన మంజుల న్యాయం చేసేవారే లేరంటూ బాధపడింది. పోలీసులే అన్యాయాన్ని చూస్తూ కూడా చర్యలు తీసుకోలేదని తన మృతికి సోమశేఖర్, గీత, బిందు, పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పీఎస్‌ఐ గంగరుద్రయ్య. సిబ్బంది అంటూ పేర్కొంది. తాను చచ్చాక అయినా న్యాయం చేయండంటూ కోరింది. సుబ్రమణి, పిల్లలు ఇంటికి వచ్చాక మంజుల ఆత్మహత్య చేసుకున్న దృశ్యాన్ని చూసి బోరుమన్నారు. సమాచారం అందుకున్న బంధువులు అర్థరాత్రి వరకూ స్టేషన్‌ను ముట్టడించి ధర్నా చేపట్టారు. రాత్రి ధర్నా విరమించిన బంధువులు మళ్లీ మంగళవారం ఉదయం పట్టణ పోలీస్‌స్టేషన్‌ ముందు బైఠాయించి ఇంటి యజమాని కుటుంబం, పట్టణ పీఎస్సై గంగరుద్రయ్య, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. మధ్యాహ్నం వరకూ ఈ హైడ్రామా చోటుచేసుకోగా పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి వచ్చి కేసు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వగా ధర్నా విరమించారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top