
బాధిత మహిళతో డీఎస్పీ నాగసుబ్బన్న, చిత్రంలో మహిళను కాపాడిన దంపతులు
‘దారి’ తప్పిన ఆడపడుచుల ప్రవర్తన ఆ ఇల్లాలి మనసును గాయపరిచింది. భర్త, అత్తల అండతో ఆడపడుచులు రెచ్చిపోయారు. ఇది మంచి పద్ధతి కాదని చెబితే ‘నువ్వు కూడా మాలాగే ఉండు’ అంటూ అసహ్యంగా మాట్లాడారు. అత్తింటివారి వింత ప్రవర్తన తీరుతో మనస్తాపం చెందిన ఆమె ఇటువంటి జీవితం తనకు వద్దనుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోబోయింది. అదే సమయంలో అక్కడున్న ఓ దంపతులు గమనించి ఆమెను కాపాడారు. ఈ ఘటన అనంతపురం రైల్వేస్టేషన్‌కు సమీపంలోని పీటీసీ ఫ్లై ఓవర్ కింద శుక్రవారం జరిగింది.
అనంతపురం సెంట్రల్: గర్భిణి ఆత్మహత్యాయత్నం అనంతపురంలో కలకలం రేపింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కంబదూరు మండలం నూతిమడుగుకు చెందిన మహిళకు బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లికి చెందిన యువకుడితో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. వ్యవసాయంపై ఆధారపడి ఈ కుటుంబం జీవిస్తోంది. యువకుడికి ముగ్గురు తోబుట్టువులు. వీరు అనంతపురంలో నివాసముంటున్నారు. వివిధ కారణాల వలన వారు భర్తలకు దూరంగా ఉంటున్నారు. కొంతకాలంగా సదరు మహిళలు వ్యభిచార వృత్తిలో కొనసాగుతున్నారు.
పోలీసుల కంటపడకుండా..
అనంతపురంలో పోలీసుల బెడద నుంచి తప్పించుకోవడానికి ఆడపడుచులు కన్నేపల్లిలోని తమ్ముడు నివాసానికి విటులను తీసుకెళ్లేవారు. ఇది మంచిది కాదని, తమ ఇంటికి రావద్దని తమ్ముని భార్య హెచ్చరించింది. అయితే భర్త, అత్తల మద్దతు వల్ల ఇంట్లో ఆడపడుచులదే పెత్తనం సాగుతోంది. రోజురోజుకూ వారి చేష్టలు వికృతరూపం దాలుస్తుండటంతో భరించలేకపోయిన ఆమె తన భర్తతో వాగ్వాదానికి దిగింది. ఆయన మౌనం దాల్చగా.. అత్త మాత్రం ‘ఇష్టమైతే నువ్వు కూడా వారి మాదిరే నడుచుకో’ అంటూ సూచించింది. ఆ మాటతో ఆమె నిశ్చేష్టురాలైంది.
పాడు జీవితం తనకు వద్దని..
ఆమె తనకు ఆరోగ్యం బాగలేదని డాక్టర్ వద్ద చూపించుకుని వస్తానని ఇంట్లో చెప్పి అనంతపురం వచ్చేసింది. టవర్‌క్లాక్ వద్ద బస్సు దిగి ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద రైల్వే ట్రాక్‌పైకి చేరుకుంది. ఆడపడుచుల ప్రవర్తన, భర్త నిస్సహాయతను తలచుకుని, ఇలాంటి పాడు జీవితం తనకు వద్దని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.
అవ్వా.. నా కొడుకును బాగా చూసుకో..
ఇంతలో తన రెండు సంవత్సరాల కుమారుడు గుర్తుకు వచ్చాడు. అటువైపు వెళుతున్న ఓ వ్యక్తి వద్ద సెల్‌ఫోన్ ఇప్పించుకుని తన అవ్వకు ఫోన్ చేసింది. ‘అవ్వా.. నా కొడుకును బాగా చూసుకో’ అని చెప్పి ఫోన్‌పెట్టేసింది. ఈలోగా అనంతపురం రైల్వేస్టేషన్ వైపు నుంచి వేగంగా వస్తున్న గూడ్స్ రైలు కింద పడి చనివడానికి సిద్ధమైంది. రైలుకు ఎదురుగా వెళుతుండడంతో అటుగా వెళ్తున్న మూడోరోడ్డుకు చెందిన కిష్టప్ప, లక్ష్మిదేవి దంపతులు గమనించారు. తొలుత ట్రాక్ దాటుతోందని అనుకున్నారు. కానీ రైలు వస్తున్నా పక్కకు తప్పుకోకుండా వెళుతుండటంతో అనుమానం వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను పక్కకు లాగారు. అనంతరం కారణాలు తెలుసుకొని మహిళా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. సమస్యలను అడిగి తెలుసుకున్న డీఎస్పీ నాగసుబ్బన్న బాధిత మహిళను ఓఎస్డీ చౌడేశ్వరి వద్ద హాజరుపరిచారు. అలాంటి వారిని ఉపేక్షించవద్దని, తక్షణమే చర్యలను తీసుకోవాలని డీఎస్పీని ఆదేశించారు.