అక్రమంగా తరలిస్తూ.. అడ్డంగా దొరికారు

Marijuana transport car and one person arrest - Sakshi

గంజాయి తరలిస్తూ బైక్‌ను ఢీకొన్న కారు

200 కిలోల గంజాయి, కారు స్వాధీనం

పోలీసుల అదుపులో ఒకరు, పరారీలో మరో ఐదుగురు

బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు

తూర్పుగోదావరి, తుని రూరల్‌(తుని): అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న కారు మోటార్‌ సైకిల్‌ను ఢీకొని ప్రమాదానికి గురై పట్టుబడింది. సోమవారం గిరిజన ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు వంద ప్యాకెట్లలో సిద్ధం చేసిన రెండు వందల కిలోల గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో తేటగుంట నుంచి టి.తిమ్మాపురం వెళ్లేందుకు 16వ నంబర్‌ జాతీయ రహదారిని దాటుతూ గంజాయి తరలిస్తున్న కారు తుని నుంచి ఏవీ నగరం వెళుతున్న మోటార్‌ సైకిల్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో కారులో ఉన్న నలుగురు తప్పించుకునేందుకు పరుగులు తీశారు. హైవే జంక్షన్‌లో ఉన్న స్థానికులు కొంతమంది నిందితులను వెంబడించారు. ముగ్గురు తప్పించుకుపోగా విశాఖపట్నానికి చెందిన నిందితుడు చింతకాయల రవి పట్టుబడ్డాడు. అతడిని రూరల్‌ పోలీసులకు అప్పగించారు.

గాయపడిన ఇద్దరిని 108 అంబులెన్సులో తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని బి.కిషోర్‌ (ఏవీ నగరం), బి.కాశీబాబు(పారుపాక) గుర్తించారు. అక్రమంగా గంజాయి తరలింపులో కారులో నలుగురు, ముందు ఎస్కార్టుగా బైక్‌పై మరో ఇద్దరు వెళుతున్నట్టు తెలిసింది. కారులో ప్రయాణిస్తున్న ఒకరు పట్టుబడగా,మరో ముగ్గురు, బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు పరారయ్యారు. విషయం తెలియడంతో రూరల్‌ సీఐ జి.చెన్నకేశవరావు సంఘటన స్థలానికి చేరుకుని కారుతో సహా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్వాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. నిందితులు పాత ముద్దాయిలని, వారిని పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top