యువతే టార్గెట్‌గా దందా

marijuana business in nalgonda district - Sakshi

జోరుగా గంజాయి వ్యాపారం 

జాతీయ రహదారి మీదుగా రాజధానికి తరలింపు 

తాజాగా సూర్యాపేటలో పట్టుబడ్డ 100 కేజీల గంజాయి 

సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: యువతే లక్ష్యంగా సూర్యాపేట జిల్లాలో గంజాయి దందా సాగుతోంది. ధనార్జనే ధ్యేయంగా కొందరు అక్రమార్కులు ఈ వ్యాపారాన్ని ఎంచుకున్నారు. పోలీసుల కళ్లుగప్పి జాతీయ రహదారి వెంట గంజాయిని యథేచ్ఛగా రాష్ట్ర రాజధానికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా బుధవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేం ద్రంలోని కళాశాల హాస్టల్‌లో 100 కేజీలకు పైగా గంజాయి పట్టుబడడం చర్చనీయాంశ మైంది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు ఆ కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పట్టణంలోని గాయత్రి కళాశాల సమీపంలోనే ఈ కాలేజీ బాలుర హాస్టల్‌ ఉంది. రాత్రి 10.30 గంటల సమయంలో విద్యార్థులు చదువుకుంటుండగా హాస్టల్‌ వార్డెన్‌ తెజావత్‌ లింగయ్య 12 కార్టన్ల గంజాయిని ఓ ఆటోలో మరో ఇద్దరు వ్యక్తులతో కలసి తీసుకొచ్చి విద్యార్థుల మంచాల కింద దాచి పెట్టాడు. దీనిని గమనిం చిన విద్యార్థులు ఏమిటని వార్డెన్‌ను అడగ్గా పరీక్ష పేపర్లని చెప్పి బయటికి వెళ్లాడు. కొంత సేపటికి విద్యార్థులకు ఏదో కొత్తరకంగా వాసన రావడంతో అనుమానం వచ్చి కార్టన్లను తెరిచి చూశారు.  ఓ విద్యార్థి తనకు తెలిసిన విద్యార్థి సంఘం నాయకులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే విద్యార్థి సంఘం నాయకులు హాస్టల్‌కు చేరుకొని ఆ కార్టన్లను తెరిచి చూస్తే గంజాయి కనిపించింది. దీంతో వెంటనే వారు బయటకు తీసుకెళ్లి ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు హాస్టల్‌ చేరుకొని సుమారు 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి వ్యవహారం బయటకు పొక్కడంతో వార్డెన్‌ లింగయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. గురువారం పలు విద్యార్థి సంఘాల నేతలు కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కొందరు కళాశాల ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.
 
ఎంత డబ్బైనా వెచ్చించి.. 

సూర్యాపేట జిల్లాలోని కోదాడ, సూర్యాపేట, హుజూర్‌నగర్, తుంగతుర్తి పట్టణాల్లో ప్రధానంగా కళాశాలలు ఉన్న నేపథ్యంలో వ్యాపారులు రెచ్చిపోతున్నారు. కళాశాల సమీపానికి తమ మనుషులను పంపించి విద్యార్థులను పరిచయం చేసుకుని వారిని రోజుల వ్యవధిలోనే గంజాయికి బానిసలుగా మారుస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలను సాగిస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్నారు. వీరి ఉచ్చులో పడిన విద్యార్థులు, యువత ఎంత డబ్బైనా వెచ్చించి గంజాయిని కొనుగోలు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్‌ మనీని విద్యార్థులు దీనికే వినియోగించేలా వ్యాపారులు ప్రేరేపిస్తున్నారు. గతంలో మారుమూల ప్రాంతాల్లో గంజాయి తాగే వ్యక్తులు ఇప్పుడు జన సంచారం ఉన్న ప్రాం తాల్లోనే నేరుగా సిగరెట్లలో పెట్టుకొని కాలుస్తున్నారు. పోలీసులు పెద్దగా దృష్టి సారించకపోవడంతో గంజాయి దందా నిరాటంకంగా కొనసాగుతోందని విమర్శలు వస్తున్నాయి. మానసికంగా ఒత్తిళ్లతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులను కూడా వ్యాపారులు టార్గెట్‌ చేస్తున్నారు. డబ్బులు బాగా ఉన్న వ్యక్తులను ఈ మార్గంలోకి దించి వారిని పెట్టుబడిదారులుగా మార్చి లాభాలను చూపిస్తూ వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తున్నారు.  

హైదరాబాద్‌కు తరలింపు.. 
హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి మధ్యలో సూర్యాపేట జిల్లా కేంద్రం ఉం డడంతో గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది. రాత్రికిరాత్రి విజయవాడ నుంచి బయలుదేరి సూర్యాపేట మీదుగా హైదరాబాద్‌ తరలిస్తున్నట్లు సమాచారం. విజయవాడతో పాటు ఖమ్మం, విశాఖపట్నం, గుంటూరు, మహబూబాబాద్‌ ప్రాంతాల నుంచి సూర్యాపేట మీదుగా రాజధానికి అక్రమ రవాణా సాగుతున్నట్లు తెలుస్తోంది. 

రాత్రి సమయాల్లో ..
కొన్ని ముఠాలు రాత్రి సమయంలో వివిధ వాహనాల అడుగు భాగాన గంజాయిని దాచి రవాణా చేస్తున్నట్టు సమాచారం. కొన్ని చోట్ల స్థానికంగా ఉన్న గంజాయి విక్రయదారులు కార్లు, ట్రాలీ ఆటోలు ఉపయోగించి ఎవరికీ అనుమానం రాకుండా తమ అడ్డాలకు చేరవేస్తున్నట్టు తెలుస్తోంది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top