లంకె బిందెలు తీస్తానంటూ..లైంగిక దాడి | Man Raped The Women In The Name Of Treasure Hunt | Sakshi
Sakshi News home page

లంకె బిందెలు తీస్తానంటూ..లైంగిక దాడి

Jun 6 2018 11:00 AM | Updated on Jun 6 2018 11:00 AM

Man Raped The Women In The Name Of Treasure Hunt - Sakshi

లక్ష్మీనర్సయ్యను స్తంభానికి కట్టేసిన దృశ్యం 

సత్తుపల్లిరూరల్‌ : ‘మీ ఇంట్లో లంకెబిందెలు ఉన్నాయి.. కొన్ని వారాల పాటు పూజలు చేసి వాటిని బయటకు తీస్తా.. అప్పుడు  మీరు కోటీశ్వరులవుతారు..’  అంటూ మంత్రగాడు మాయమాటలు చెప్పి ఓ మహిళను లొంగదీసుకొని లైంగిక దాడికి పాల్పడిన ఘటన సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి బంగ్లాబజార్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.

బాధితులు మంగళవారం వివరాలను వెల్లడించారు. గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవించే గిరిజనులైన గుళ్ల రాంబాబు దంపతులు కొద్ది రోజుల క్రితం ఇంట్లో ఉప్పలమ్మను పెట్టుకున్నారు. ఇందుకోసం కల్లూరు మండలం యజ్ఞనారాయణపురం నుంచి పూజారి లక్ష్మీనర్సయ్యను పిలిపించారు. పూజల అనంతరం ‘మీ ఇంట్లో లంకెబిందెలు ఉన్నాయి.. వాటిని బయటకు తీయాలంటే కొన్ని పూజలు చేయాలి’ అని నమ్మబలికి వెళ్లిపోయాడు.  

ప్రత్యేక పూజ పేరుతో..  

మళ్లీ వారం తర్వాత వచ్చి పూజలు చేస్తానంటూ రూ.30 వేలు తీసుకున్నాడు. రాంబాబు దంపతులను  ఉప్పలమ్మ గుడి వెనుకకు(కర్టెన్‌ కట్టిన) వెళ్లాలని, తాను గుడి ముందు పూజ చేస్తానని చెప్పాడు. కాసేపటి తర్వాత ప్రత్యేక పూజ పేరుతో రాంబాబు భార్యను గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెపితే నీ భర్త, పిల్లలను చంపేస్తానని హెచ్చరించి వెళ్లిపోయాడు.

అతడు వెళ్లిన తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. కాగా, మూడు రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన గంపా వసంతరావు ఇంటికి పూజ చేసేందుకు లక్ష్మీనర్సయ్య వచ్చాడు. రాంబాబును కూడా అక్కడికి పిలిచి మళ్లీ పూజలు చేయాలని చెప్పాడు. దీంతో తన భార్య అంగీకరించటం లేదని, తమకు పూజలు వద్దని రాంబాబు అనడంతో.. ‘నేను వచ్చి నీ భార్యను ఒప్పిస్తా’ నంటూ మళ్లీ రాంబాబు ఇంటికి వచ్చాడు.

ఇప్పటి వరకు పూజలు చేశారు.. ఇలా మూడు నెలలు చేస్తే లంకెబిందెలు వస్తాయి ఆలోచించుకోండి అని  చెప్పి వెళ్లిపోయాడు. సోమవారం రాంబాబుకు ఫోన్‌ చేసి ఈ రోజు వస్తున్నానని, తప్పకుండా పూజ చేయాలని చెప్పాడు. రాంబాబు ఈ విషయాన్ని గ్రామ పెద్ద  దుంపా వెంకన్నకు చెప్పాడు. గ్రామస్తులంతా మంత్రగాడి రాక కోసం కాపలా కాస్తుండగా, రాత్రి 10 గంటలకు టీఎస్‌04 ఈఎల్‌8504 నంబర్‌ గల కారులో మరో ఇద్దరితో కలిసి వచ్చాడు.

పూజ చేసేప్పుడు కుటుంబ సభ్యులెవరూ రాకూడదంటూ రాంబాబు భార్యను గదిలోకి తీసుకెళ్లాడు. తన తర్వాత, మరో ఐదుగురు యువకులతో గడపాలని.. వారిని కూడా తీసుకొచ్చానని బలవంతం చేయటంతో బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. అప్పటికే అక్కడే వేచి ఉన్న గ్రామస్తులంతా గది వద్దకు రావటంతో లక్ష్మీనర్సయ్య పారిపోయేందుకు ప్రయత్నించాడు.

బాధితులు, గ్రామస్తులు కలిసి అతడిని విద్యుత్‌ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత సత్తుపల్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement