సూర్యాపేటలో దారుణం.. తల్లి, చెల్లిని హత్య | Man kills His Mother And Sister In Suryapet District | Sakshi
Sakshi News home page

సూర్యాపేటలో దారుణం.. తల్లి, చెల్లిని హత్య

Feb 6 2020 8:53 AM | Updated on Feb 6 2020 10:27 AM

Man kills His Mother And Sister In Suryapet District - Sakshi

సాక్షి, సూర్యాపేట: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు ఆస్తి కోసం సవతి తల్లి, ఆమె కూతుర్ని రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. వివరావల్లోకి వెళితే.. సూర్యాపేట మండలం తాళ్ల కంపాడ్ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ కప్పల నాగయ్యకు ఇద్దరు భార్యలు. అచ్చమ్మ, అంజమ్మ ఇద్దరు సొంత అక్క చెల్లెల్లు. పెద్ద భార్య అచ్చమ్మకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమె చెల్లెలు అంజమ్మను నాగయ్య వివాహం చేసుకున్నాడు. పెద్ద భార్య అచ్చమ్మ కు ఒక కొడుకు, ఒక కూతురు కాగా చిన్న భార్య అంజమ్మకు ఒక కూతురు.

అయితే పదేళ్ల క్రితం అనారోగ్యంతో నాగయ్య మృతి చెందగా, నాగయ్య రేషన్ డీలర్‌షిప్‌ చిన్న భార్యకు వచ్చింది. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. నెల రోజుల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఇరువురికి సమానంగా ఆస్తి పంచాలని పెద్ద మనుషులు తీర్మానం చేశారు.

కాగా, నాగయ్య పెద్ద భార్య కొడుకు హరీష్‌ గురువారం అంజమ్మ ఇంటికి వచ్చి రోకలి బండతో ఆమె కూతురిని, ఆమెను దారుణంగా కొట్టి చంపాడు. అనంతరం నేరుగా పోలీసులు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement