డబ్బు కోసం స్నేహితులే కడతేర్చారు

Man Killed By His Friends For Money In Nellore - Sakshi

యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు

సాక్షి, మనుబోలు (నెల్లూరు): మనుబోలు మండలం జట్ల కొండూరు సమీపంలో గతనెల 19వ తేదీన జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసం అతని స్నేహితులే హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు పాల్పడ్డ ముగ్గురు యువకులను అరెస్ట్‌ చేశారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గూడూరు డీఎస్పీ బీఎస్‌బీ హర్ష విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హత్య పూర్వాపరాలను వెల్లడించారు. హత్యకు గురైన వాకాడు మండలం కొండాపురం గ్రామానికి చెందిన మల్లి గురుప్రసాద్‌ రెండేళ్ల నుంచి అపాచీ కంపెనీలో పనిచేస్తూ సూళ్లూరుపేటలో రూమ్‌ తీసుకుని ఉంటున్నాడు. అతను అంతకుముందు కొంతకాలం గూడూరు నిమ్మ మార్కెట్‌లో హమాలీగా పనిచేశాడు. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న గూడూరుకు చెందిన మల్లి చెంచయ్య, ఉప్పలపాటి గురుప్రసాద్‌ స్నేహితులయ్యారు.

ఎలా వ్యాప్తి చెందిందో తెలియదుగాని అపాచీలో పనిచేస్తున్న గురుప్రసాద్‌కు రూ.కోటి దొరికినట్లుగా పుకారు వచ్చింది. ఈ విషయం పూర్వాశ్రమంలో తన స్నేహితులైన గూడూరుకు చెందిన చెంచయ్య, గురుప్రసాద్‌ చెవిన పడింది. దీంతో ఆ పుకారును నమ్మిన గురుప్రసాద్, చెంచయ్య వారి స్నేహితుడైన రౌడీ షీటర్‌ వేముల కనకారావు అలియాస్‌ రాజా సాయంతో గురుప్రసాద్‌కు దొరికిందనుకుంటున్న సొమ్మును కాజేసేందుకు పథకం వేశారు. ఈ క్రమంలో సూళ్లూరుపేటలో ఉంటున్న మల్లి గురుప్రసాద్‌ వద్దకు వెళ్లి అమ్మాయిల వద్దకు పోదాం అని అతడ్ని టాటా ఏస్‌ వాహనంలో ఎక్కించుకుని వరగలి క్రాస్‌రోడ్డు సమీపంలోని పోటుపాళెం రోడ్డు వద్దకు తీసుకెళ్లి దొరికిన రూ.కోటి సొమ్మును ఇవ్వాలంటూ జాకీ రాడ్‌తో కొట్టారు.

తనకు డబ్బు దొరకలేదని తనని వదిలేయాలని ఎంత వేడుకున్నా వినకుండా అక్కడ నుంచి తీసుకొచ్చి మనుబోలు మండలం జట్ల కొండూరుకు వెళ్లే రోడ్డు వద్ద మళ్లీ కొట్టారు. చొక్కా చించి మెడకు చుట్టి నీటి గుంతలో తలను ముంచి తొక్కడంతో పూపిరాడక మల్లి గురుప్రసాద్‌ మృతిచెందాడు. రౌడీ షీటర్‌ కనకారావు కాల్‌డేటా ఆధారంగా అతడ్ని శుక్రవారం గూడూరు రిలయన్స్‌ పెట్రోల్‌ బంకు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని స్నేహితులు ఉప్పలపాటి గురుప్రసాద్, చెంచయ్యను తిప్పవరప్పాడు క్రాస్‌రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన పోలీసులకు డీఎస్పీ నగదు రివార్డులు అందజేశారు. సమావేశంలో గూడూరు రూరల్‌ సీఐ రామకృష్ణారెడ్డి, మనుబోలు, చిల్లకూరు ఎస్సైలు సూర్యప్రకాష్‌రెడ్డి, హుస్సేన్‌బాషా, హెసీలు శ్రీనివాసులు, ఆది నారాయణ, మాధవరావు, అశోక్‌ పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top