
సాక్షి, పట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను చంపేస్తానంటూ బెదిరింపులు వచ్చాయి. పట్నా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నితీశ్‌ను త్వరలోనే హత్య చేస్తానని హెచ్చరిస్తూ ఏకంగా సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పట్నా జిల్లాలోని ఫతుహా అనే ప్రాంతానికి చెందిన ప్రమోద్ కుమార్ అలియాస్ పోయామా తన బాడీగార్డ్‌లతో కలిసి ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. నితీశ్‌ను త్వరలోనే చంపేస్తానంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు. క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది. అంతకుముందు ముఖ్యమంత్రి నితీశ్ కాన్వాయ్‌పై దాడి జరిగిన కొద్ది సేపటికే ఈ వీడియో బయటకు రావడంతో పోలీసులు శరవేగంగా స్పందించారు. ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు ఎందుకు అలా చేశాడని ప్రశ్నిస్తున్నారు.
సమీక్ష యాత్ర పేరుతో నితీశ్ గ్రామాల్లో పర్యటిస్తుండగా నందన్ అనే గ్రామంలో కొంతమంది వ్యక్తులు ఆయన కాన్వాయ్‌పై దాడి చేశారు. రాళ్లను విసిరి కొట్టారు. అయితే, నితీశ్ సురక్షితంగా బయటపడినప్పటికీ ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది మాత్రం గాయపడ్డారు. ఆ కాసేపటికే ఈ వీడియో బయటకు వచ్చింది. అరెస్టయిన ప్రమోద్‌కుమార్ ఇసుక వ్యాపారి అని తెలిసింది. గత కొద్ది రోజులుగా ఇసుక కొరత కారణంగా తన వ్యాపారం దెబ్బదిన్నదనే ఆగ్రహంతోనే అతడు నితీశ్‌ను చంపేస్తానని అన్నట్లు సమాచారం.