వచ్చాడు.. చంపాడు.. పారిపోయాడు | Man Escaped Dubai After Killed Wife In Hyderabad | Sakshi
Sakshi News home page

వచ్చాడు.. చంపాడు.. పారిపోయాడు

May 26 2018 10:08 AM | Updated on Sep 4 2018 5:44 PM

Man Escape Dubai After Kulled Wife In Hyderabad - Sakshi

చెత్తకుండీలో మృతదేహం , నిందితుడు హైదర్‌ , జబనాజ్‌ (ఫైల్‌)

సాక్షి, సిటీబ్యూరో: దుబాయ్‌ నుంచి వచ్చాడు... పుట్టింట్లో ఉన్న భార్యను తీసుకొచ్చాడు... ఏమైందో ఏమో గానీ దారుణంగా చంపేశాడు... మృతదేహాన్ని పార్శిల్‌ చేసి పడేశాడు... శవాన్ని తరలించడానికి వాడిన ఆటోలోనే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి దుబాయ్‌కి పరారయ్యాడు... భార్యను చంపి డబీర్‌పుర రైల్వే ట్రాక్‌ సమీపంలో పడేసిన అక్బర్‌ అలీ ఖాన్‌ అలియాస్‌ హైదర్‌ వ్యవహారమిది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశామని, నిందితుడిని తిరిగి రప్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ తెలిపారు. కింగ్‌కోఠిలోని పరదాగేట్‌కు చెందిన జబనాజ్‌కు డబీర్‌పురకు చెందిన హైదర్‌తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. అనేక వివాదాల నేపథ్యంలో ఐదేళ్ల క్రితం  జబనాజ్‌ పుట్టింటికి చేరింది. అత్తారింటి వారిపై నారాయణగూడ, సీసీఎస్‌లలో ఫిర్యాదులు సైతం చేసింది. రెండేళ్ల క్రితం ఉద్యోగ నిమిత్తం దుబాయ్‌ వెళ్లిన హైదర్‌ అప్పుడప్పుడు నగరానికి వస్తుండేవాడు. అలా వచ్చినప్పుడల్లా తన భార్యను తీసుకుని డబీర్‌పురలోని తన ఇంట్లో ఉన్న దివాన్‌ఖానాకు (లివింగ్‌ రూమ్‌) వచ్చి ఉండేవాడు. ఇది ఇంటికి కాస్తా దూరంగా ఉండటంతో ఎవరు వచ్చారు? ఎప్పుడు వచ్చారు? అనేది కుటుంబీకులకు తెలిసే అవకాశం లేదు.

ఎప్పటిలాగే రంజాన్‌ నేపథ్యంలో గత బుధవారం దుబాయ్‌ నుంచి వచ్చిన హైదర్‌ శనివారం మధ్యాహ్నం పరదాగేట్‌ లో ఉన్న అత్తారింటికి వెళ్లాడు. మధ్యాహ్నం 2 గం టల ప్రాంతంలో తన భార్యను తీసుకుని బైక్‌పై డబీర్‌పురలోని ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ అదే రోజు సాయంత్రం జబనాజ్‌ను ఇంట్లోనే హత్య చేశాడు. మృతదేహాన్ని వస్త్రాలు, కవర్లు, ప్లాస్టర్‌ వినియోగించి పార్శిల్‌ చేశాడు. తనకు పరిచయస్తుడైన ఆటోడ్రైవర్‌ను ఫోన్‌ చేసి పిలిపించుకున్నాడు. సదరు పార్శిల్‌లో పాత వస్త్రాలు ఉన్నట్లు చెప్పిన హైదర్‌ వాటిని ఆటోలోకి చేర్చాడు. బైక్‌పై తాను ముందు వెళ్తూ ఆటోను డబీర్‌పుర రైల్వేట్రాక్‌ సమీపంలో ఉన్న చెత్తకుప్పలో  పార్శిల్‌ను పడేశాడు. మళ్లీ అదే ఆటో ను తన ఇంటికి తీసుకువెళ్లిన హైదర్‌ బైక్‌ను ఇంట్లో ఉంచి ఆటోలో ఎక్కి విమానాశ్రయానికి వెళ్లాడు. రాత్రి 9.15 గంటలకు దుబాయ్‌ వెళ్లే విమానానికి ముందే టిక్కెట్‌ బుక్‌ చేసుకున్న హైదర్‌ అది ఎక్కి ఉడాయించాడు.

అల్లుడితో వెళ్లిన కుమార్తె ఆచూకీ లేకపోవడం, ఆమె సెల్‌ఫోన్‌ సైతం స్విచ్ఛాఫ్‌ కావడంతో కంగారుపడిన తల్లి షకీనా బేగం డబీర్‌పురలోని అల్లుడి ఇంటికి వచ్చి ఆరా తీసింది. వారు వచ్చిన విషయం తమకు తెలియదని చెప్పడంతో ఆదివారం ఆమె నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడం తో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. దీని ఆధారం గా పోలీసులు ఆమె ఆచూకీ కోరుతూ అన్ని ఠాణా లకు లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేశారు. మరోపక్క చెత్తకుప్పలో పడేసిన పార్శిల్‌ నుంచి దుర్వాసన వస్తుండటంతో సోమవారం తెల్లవారుజామున స్థానికులు డబీర్‌పుర పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి వెళ్లిన పోలీసు లు అందులో మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. లుక్‌ ఔట్‌ నోటీసులను బట్టి జబనాజ్‌ వివరాలు తెలుసుకున్న వారు ఆమె కుటుంబీకుల్ని రప్పించారు. వారు జబనాజ్‌గా గుర్తించారు. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో  పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆమె తల వెనుక భాగంలో తగిలిన బలమైన గాయమే మరణానికి కారణమని, గట్టి వస్తువుతో కొట్టినందునే గాయమైందని ఫోరెన్సిక్‌ వైద్యులు తేల్చారు. దీంతో డబీర్‌పురలోని ఇంటికి వెళ్లిన పోలీసులు దివాన్‌ ఖానాను పరిశీలించగా, అక్కడ ఎక్కడా రక్తపు మరకలు కనిపించలేదు.

సీసీ కెమెరాల ఆధారంగా ముందుకు వెళ్లిన అధికారులు పార్శిల్‌ తరలించిన ఆటోను గుర్తించారు. ఆ డ్రైవర్‌ను విచారించగా శనివారం సాయంత్రం హైదర్‌ దివాన్‌ ఖానా నుంచే దాన్ని తీసుకువచ్చి ఆటోలో పెట్టినట్లు వెల్లడించాడు. హైదర్‌ కుటుంబీకులు మాత్రం వారు ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు వెళ్లారు? అనేవి తాము గమనించలేదని తెలిపారు. హైదర్‌పై లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ జారీ చేసిన పోలీసులు అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు పంపడమేగాక, అతడి పాస్‌పోర్ట్‌ రద్దు చేయాల్సిందిగా రీజనల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి లేఖ రాశారు. దుబాయ్‌లో ఉన్న హైదర్‌ను పట్టుకుంటే తప్ప ఈ కేసులో పూర్తి వివరాలు వెలుగులోకి రావని అధికారులు చెబుతున్నారు. దీనికోసం కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖ సహకారం కోరుతూ లేఖ రాయనున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హైదర్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ నగరానికి రప్పించి అరెస్టు చేస్తామని డీసీపీ  తెలిపారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. హత్యకు కారణం ఏమిటి? హత్యాయుధం ఏమైంది? అనే వివరాలతో పాటు మరికొన్ని అంశాలు హైదర్‌ అరెస్టు తర్వాతే బయటపడతాయని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement