పోలీస్‌ స్టేషన్‌లో వ్యక్తి మృతి?  | Man Dead In police Station At Kurnool | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌లో వ్యక్తి మృతి? 

Aug 16 2019 10:31 AM | Updated on Aug 16 2019 10:32 AM

Man Dead In police Station At Kurnool - Sakshi

మృతిచెందిన బాలకృష్ణ

సాక్షి, జూపాడుబంగ్లా, చిత్తూరు: స్థానిక పోలీసుస్టేషన్‌లో గురువారం.. తూడిచెర్ల గ్రామానికి చెందిన బాలకృష్ణ(44) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య సుభద్రమ్మ బంధువులతో కలిసి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. పోలీసులు కొట్టడంతో తన భర్త మృతి చెందారని ఆరోపించారు. ఇదిలా ఉండగా..ఫిట్స్‌ రావడంతోనే బాలకృష్ణ మృతి చెందాడని, తాము కొట్టలేదని పోలీసులు వివరణ ఇచ్చారు. తూడిచెర్ల గ్రామంలో బాలకృష్ణ గతంలో బెల్టుదుకాణం నిర్వహించేవాడు. మూడు రోజుల క్రితం గ్రామానికి వెళ్లిన పోలీసులు అతని దుకాణంలో సోదాలు చేయగా రెండు మద్యం సీసాలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకొని బుధవారం పోలీసుస్టేషన్‌కు రమ్మని చెప్పారు.

అతను మర్నాడు పోలీసుస్టేషన్‌కు రాగా ఎస్‌ఐ తిరుపాలు లేకపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలీసుస్టేషన్‌ వద్ద ఉండి ఇంటికి వెళ్లాడు. పోలీసుల సూచన మేరకు గురువారం పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాలకృష్ణను ఎస్‌ఐ తిరుపాలు ప్రశ్నిస్తుండగానే ఫిట్స్‌ వచ్చి అక్కడే కుప్పకూలి పోయాడు. చికిత్స నిమిత్తం స్థానిక ప్రథమ చికిత్స కేంద్రానికి..అక్కడి నుంచి నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలకృష్ణ మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు.

విషయం తెలుసుకొన్న మృతుని భార్య సుభద్రమ్మ బంధువులతో పోలీసుస్టేషన్‌కు చేరుకొని తన భర్త మృతికి కారణమైన ఎస్‌ఐ తిరుపాలుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్టేషన్‌ ఎదుట కేజీరోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన భర్త బాలకృష్ణ మద్యం సీసాలు అమ్ముతున్నాడని స్టేషన్‌కు పిలిపించి పోలీసులు కొట్టి చంపారని ఆరోపిస్తూ కన్నీరు మున్నీరుగా విలపించారు. తన భర్త మృతికి కారణమైన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అనంతరం గ్రామపెద్దలు కల్పించుకొని వారితో మాట్లాడి శాంతింపజేశారు. మృతుడి బంధువులకు రూ.4.50లక్షల ఆర్థిక సహాయం అందజేసేలా ఒప్పందం కుదరటంతో మృతుడి భార్య, బంధువులు శాంతించారు.

ఫిట్స్‌ వచ్చి కిందపడినట్లు పిర్యాదు.. 
తన భర్త బాలకృష్ణకు ఫిట్స్‌ రావటంతో బైక్‌పై నుంచి కిందపడి మృతి చెందాడని సుభద్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుబ్రమణ్యం తెలిపారు. ఇదిలా ఉండగా జూపాడుబంగ్లా పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆత్మకూరు సీఐ శివనారాయణస్వామి, నందికొట్కూరు రూరల్‌ సీఐ సుబ్రమణ్యం, ఎస్‌ఐలు రాజ్‌కుమార్, గోపినాథ్, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement