లంకె బిందెలున్నాయంటూ లక్షలు గుంజాడు!

Man Arrest In Fraud Case kurnool - Sakshi

కర్నూలు, ఆదోని: పట్టణంలోని బుడ్డేకల్లు వీధికి చెందిన సామెల్‌ కనికట్టు విద్య ప్రదర్శించడంలో సిద్ద హస్తుడు. ఓ ఇంటి స్థలంలో రూ.కోట్ల విలువైన లంకె బిందెలున్నట్లు తన కనికట్టు విద్య ద్వారా ఓ వ్యక్తిని నమ్మించి రూ.23 లక్షలు గుంజాడు. మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు. వివరాలను  స్థానిక త్రీ టౌన్‌ సీఐ భాస్కర్, ఎస్‌ఐ రహంతుల్లా విలేకరులకు వెల్లడించారు. మండల పరిధిలోని చాగి గ్రామానికి చెందిన భాస్కర్‌ పట్టణంలోని ఎమ్మిగనూరు రోడ్డులో నివాసం ఉంటూ ఇటీవల బళ్లారిలో ఇంటి స్థలం కొనుగోలు చేశాడు. బెంగళూరుకు చెందిన ఓ స్వామిని పిలిపించి స్థలం వాస్తు చూపగా నిధి నిక్షిప్తమై ఉందని చెప్పాడు.

నిధిని వెలికి తీయాలని భాస్కర్‌ కోరగా స్వామి ఒప్పుకోకపోవడంతో పాటు ఇల్లు కట్టుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చాడు. ఆశ చావని భాస్కర్‌ తన స్నేహితుడు క్యాబ్‌ డ్రైవర్‌ దేవిరెడ్డి సాయంతో సామెల్‌ను సంప్రదించారు. అతన్ని బళ్లారికి తీసుకెళ్లగా స్థలంలో అంజనం వేసి లంకె బిందెల్లో నిధి ఉన్నట్లు భాస్కర్‌కు చూపించి, ఆశలను రెట్టింపు చేశాడు. నిధి విలువ రూ. కోట్లలో ఉందని, వెలికి తీసేందుకు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చవుతోందని సామెల్‌ చెప్పడంతో అందుకు అంగీకరించిన భాస్కర్‌ నాలుగు విడతల్లో రూ.23లక్షలు సమర్పించుకున్నాడు. నాలుగు సార్లు స్థలంలో క్షుద్ర పూజలు నిర్వహించి, అంజనం వేసినట్లు కనికట్టు విద్యలు ప్రదర్శించిన చివరి సారిగా ఓ రాగి బిందెను వెలికి తీశాడు. సామెల్‌ చెప్పనట్లు ఇంటికి తీసుకు వెళ్లి ప్రత్యేక పూజల తరువాత బిందె మూతను తీయగా అందులో బొగ్గులు మాత్రమే ఉండడంతో మోసపోయినట్లు గుర్తించి త్రీ టౌన్‌ పోలీసులను న్యాయం కోసం ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సామెల్‌పై ఐపీసీ 420 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సీఐ చెప్పారు. సామెల్‌ బాధితులు జిల్లాలో ఎవరైనా ఉంటే వెంటనే తమను సంప్రదించాలని ఆయన సూచించారు. సామెల్‌ను అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశామన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top