లాడ్జిలో యువతీయువకుల ఆత్మహత్య

Man And Women Suicide In Lodge At Tenali Guntur District - Sakshi

యువతిది కంకిపాడు మండలం గొల్లగూడెంగా గుర్తింపు

కంకిపాడు పోలీస్‌స్టేషన్‌లో నాలుగు రోజుల కిందటే యువతి అదృశ్యం కేసు

యువకుడిది అమరావతి మండలం జూపూడి

సాక్షి, తెనాలి: రైల్వే స్టేషన్‌ రోడ్డులోని ఓ లాడ్జిలో యువతీ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. యువకుడిది  అమరావతి మండలం జూపూడి గ్రామం కాగా, యువతిది కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు సమీపంలో గొల్లగూడెం. పోలీసుల కథనం మేరకు.... జూపూడికి చెందిన ఏకుల సాగర్‌బాబు (25), గొల్లగూడెంకు చెందిన గాలంకి తేజస్వి (23) బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తెనాలి వచ్చారు. ఓవర్‌ బ్రిడ్జి వైపు నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే రోడ్డులోని ఓ లాడ్జికి వెళ్లి రూం తీసుకున్నారు. సాయంత్రం ఆరు గంటలవుతున్నా ఉలుకూ పలుకు లేకపోవడంతో, అనుమానం వచ్చి లాడ్జి సిబ్బంది తలుపు సందులో నుంచి గదిని పరిశీలించారు. మంచంపై తేజస్వి అచేతనంగా పడి ఉంది. అలానే గదిలో రక్తం కారి ఉండటాన్ని గమనించారు. అనుమానం వచ్చి లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారమిచ్చారు.

పోలీసులు వెళ్లి తలుపులు తెరచి చూడగా, తేజస్వి ఎడమ చేతి మణికట్టు వద్ద గాయమై మంచంపై మృతి చెంది ఉంది. సాగర్‌బాబు బాత్‌రూమ్‌లో మృతి చెంది పడి ఉన్నాడు. గదిని పరిశీలించిన పోలీసులు పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును కూల్‌డ్రింక్‌లో కలుపుకుని తాగడమే కాకుండా, తేజస్వి చేయి కోసుకుంది. త్రీ టౌన్‌ ఎస్‌ఐ చల్లా సురేష్‌ మతదేహాలను పరిశీలించారు. లభించిన ఓటరుకార్డు, లాడ్జి సిబ్బందికి ఇచ్చిన ఫొటో ఐడీ ఆధారంగా మృతులను గుర్తించారు. ఈ నెల 7వ తేదీన కంకిపాడు పోలీస్‌స్టేషన్‌లో తేజస్వి మిస్సింగ్‌ కేసు నమోదైనట్టు తెలిసింది. వీరిద్దరూ ప్రేమికులా, లేక బంధువులా అన్నది విచారణలో తెలియాల్సి ఉందని చెప్పారు. మృతుల కుటుంబాలకు సమాచారమిచ్చామని తెలిపారు. వారు వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. మృతులిద్దరూ విజయవాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని పేర్కొన్నారు. సాగర్‌బాబుకు వివాహమయి, ఇప్పటికే ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉండగా, ప్రస్తుతం అతని భార్య గర్భవతి అని సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top