బ్యాంకు అప్రయిజరే అసలు దొంగ | Man And His Relatives Hostage Fake Gold And Takes Rs 18 Lakhs Loan At Bank In Anantapur | Sakshi
Sakshi News home page

బ్యాంకు అప్రయిజరే అసలు దొంగ

Oct 12 2019 9:12 AM | Updated on Oct 12 2019 9:12 AM

Man And His Relatives Hostage Fake Gold And Takes Rs 18 Lakhs Loan At Bank In Anantapur - Sakshi

నిందితుల అరెస్టు చూపుతున్న సీఐ రామచంద్రారెడ్డి

సాక్షి, చంద్రగిరి(చిత్తూరు) : బ్యాంకు అప్రయిజర్‌ నకిలీ నగలు తనఖా పెట్టి రూ.18 లక్షలు కాజేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అప్రయిజర్‌తో పాటు అతనికి సహకరించిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ రామచంద్రారెడ్డి శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. తిరుపతి రూరల్‌ మండలం కాలూరుకు చెందిన శివకుమార్‌ ఆచారి ఆరేళ్లుగా చంద్రగిరిలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఏడీబీ)లో బంగారు నగల రుణాలకు సంబంధించి అప్రయిజర్‌గా పనిచేస్తున్నాడు. అతను బ్యాంకు అధికారులతో చాలా నమ్మకంగా ఉండేవాడు. దీంతో అధికారులు అతనితో అంతే చనువుగా ఉండేవారు. ఈ క్రమంలో శివకుమార్‌ ఆచారి చేసిన అప్పులు తీర్చలేక బ్యాంకును మోసం చేయాలని భావించాడు. బ్యాంకులో ఖాతాలు ఉన్న తన బంధుమిత్రులతో కలిసి పథకం రచించాడు. ఖాతాదారులు తనఖా పెట్టే నగలను తనే తనిఖీ చేస్తాడు కాబట్టి  బంధువులతో నకిలీ నగలను ఇచ్చి బ్యాంకుకు పంపించాడు.

ఒకేసారి అందరూ వస్తే అనుమానం వస్తుందని తెలుసుకుని, కొన్ని రోజులకు ఒక్కొక్కరిని పంపిస్తూ సుమారు వెయ్యి గ్రాముల నకిలీ బంగారాన్ని తనఖా పెట్టించి రూ.18 లక్షలను రుణంగా పొందాడు. కొద్ది రోజులుగా తనిఖీ చేసిన బ్యాంకు మేనేజర్‌ నారాయణ నకిలీ బంగారాన్ని గుర్తించాడు. నెల రోజుల క్రితం శివకుమార్‌ ఆచారి చేసిన మోసాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ రామచంద్రారెడ్డి విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో శివకుమార్‌ ఆచారికి సహకారం అందించిన సతీష్, మంజునాథ ఆచారి, శివప్రసాద్, సరస్వతమ్మ, నాగరాజు ఆచారి, దేవరాజును శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సీఐ రామచంద్రారెడ్డి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతోనే శివకుమార్‌ ఆచారి ఈ మోసానికి పాల్పడినట్లు తెలిపారు. అనంతరం నిందితులను తిరుపతి కోర్టుకు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement