మహిత హత్య.. వెలుగులోకి వాస్తవాలు! | Sakshi
Sakshi News home page

సంచలనం రేపుతున్న హత్య.. వెలుగులోకి వాస్తవాలు!

Published Mon, Apr 29 2019 11:12 AM

Mahita Murder Case in West Godawari District - Sakshi

సాక్షి, యలమంచలి: ప్రేమ వ్యవహారం.. మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. తన ప్రేమను నిరాకరించిందనే ఆగ్రహంతో ఓ యువకుడు కత్తితో చేసిన అమానుష దాడిలో ఓ యువతి అక్కడికక్కడే చనిపోయిన ఘటన.. పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం రేపుతోంది. నక్కింటి చెరువువారికి చెందిన 19 ఏళ్ల యువతి పెనుమాల మహిత ఆదివారం తన బంధువుల గ్రామమైన యలమంచిలి మండలం కాజకు వచ్చింది. ఆమెతోపాటు ఉన్న కురేళ్ల మహేష్‌, అతని స్నేహితులు దాడికి దిగారు. కత్తిలో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో మహిత అక్కడిక్కడే చనిపోగా.. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు పారిపోయారు. ప్రధాన నిందితుడుగా భావిస్తున్న మహేష్‌ మాత్రం స్థానికులకు దొరికిపోయాడు. జనం తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయిన మహేష్‌ను పోలీసులు పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వెలుగులోకి వస్తున్న వాస్తవాలు..!
ఈ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో కీలక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కురెళ్ల మహేష్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల అందించిన సమాచారం ప్రకారం.. నిందితుడు  కృష్ణా జిల్లా ముదినేపల్లి సమీపంలోని దాకారం గ్రామానికి చెందిన వాడని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఓ ప్రొడక్షన్‌ యూనిట్‌లో పనిచేసేవాడు. పెనుమాల మహిత కాకినాడ శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్‌ చదివింది. ఇంటర్‌లో ఫెయిల్‌ కావడంతో రాజోలు ఆదిత్య కాలేజీలో ఇంటర్‌ మళ్లీ చదువుతోంది. ఆమె స్వగ్రామం భీమవరం మండలం బేతపూడి గ్రామం. తండ్రి భీమవరం ఆదిత్య కాలేజీ బస్సు డ్రైవర్‌. తల్లి ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లిందని తెలుస్తోంది. సినిమా షూటింగ్‌ నిమిత్తం మూడు నెలల క్రితం పాలకొల్లు వచ్చినప్పుడు తొలిసారిగా మహిత మహేష్‌కు పరిచయమైంది. దీంతో గత మూడు నెలలుగా ప్రేమ పేరుతో మహితను అతను వేధిస్తున్నాడు. అప్పటికే మహేష్‌కు మరొకరితో పెళ్లి  అయి.. విడాకుల వరకు వ్యవహారం వెళ్లింది. భార్యతో విభేదాల విషయమై ప్రస్తుతం కోర్టులో‌ కేసు  నడుస్తోంది. మహేష్ మొదటి పెళ్లి వ్యవహారం బయటపడటంతో అతన్ని మహిత  నిలదీసింది. అంతేకాకుండా అప్పటినుంచి అతనికి దూరంగా ఉంటుంది.

పక్కా పథకంతోనే హత్య..
ఈ క్రమంలో తన ప్రేమను అంగీకరించకపోతే.. మహితను చంపేయాలని మహేశ్‌ ముందస్తుగానే పక్కా ప్రణాళికను రచించినట్టు తెలుస్తోంది. అందులోభాగంగానే మాంసం నరికే కత్తిని తన బ్యాగులో పెట్టుకొని.. హైదరాబాద్ నుంచి మరో ఇద్దరి స్నేహితులతో కలిసి యలమంచిలి మండలం కాజ గొప్పు గ్రామంలోని మహిత ఉంటున్న మేనమామ ఇంటికి చేరుకున్నాడు. ఆదివారం సాయంత్రం మాట్లాడాలని మేనమామ ఇంటి నుంచి మహితను అతను బయటకి పిలిపించాడు.  బయటకి వచ్చిన తర్వాత కిలోమీటర్ దూరం వరకు ఆమెతో మాట్లాడుతూ వెళ్లాడు. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని మహితపై అతను ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు, మహిత నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో దారుణంగా నరికి చంపేశాడు. మహిత మెడపై, తల వెనుక భాగంలో కత్తివేట్లు పడ్డాయి. మహిత అక్కడికక్కడే చనిపోవడంతో అతని ఇద్దరు స్నేహితులు పరారయ్యారు. చేతిలో కత్తితో ఉన్న మహేష్‌ను గుర్తించిన స్థానికులు పట్టుకొని చితకబాదారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో అన్ని కోణాలలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని, పరారైనమరో ఇద్దరు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.


 

Advertisement
Advertisement