అక్క ప్రేమను ఒప్పుకున్నారు.. కానీ చెల్లి ప్రేమను | Lovers Commited Suicide In Adilabad | Sakshi
Sakshi News home page

అక్క ప్రేమను ఒప్పుకున్నారు.. కానీ చెల్లి ప్రేమను

Sep 22 2019 11:51 AM | Updated on Dec 17 2019 4:32 PM

Lovers Commited Suicide In Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ప్రేమ జంట పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జూలూరుపాడు మండలం అన్నారుపాడు గ్రామంలో శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుగులోత్‌ శ్రీను, లక్ష్మి దంపతుల రెండో కుమారుడు గోపి (24) అలియాస్‌ పండు, అదే గ్రామానికి చెందిన లావుడ్యా లక్ష్మణ్, మోతీ దంపతుల మూడో కుమార్తె లావుడ్యా సింధు (22) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గుగులోత్‌ గోపి ఇంటర్‌ మొదటి సంవత్సరం వరకు చదివి మధ్యలో చదువు ఆపేసి, డ్రైవింగ్‌ నేర్చుకొని ఆటో, ట్రాక్టర్‌ నడపడంతోపాటు వ్యవసాయ పనులు కూడా చేస్తూ ఉంటాడు.

లావుడ్యా సింధు 9వ తరగతి వరకు చదువుకొని ఇంటి వద్దనే ఉంటూ తల్లిదండ్రులతో కలిసి పొలం పనులకు వెళ్తోంది. గోపి, సింధులు వరుసకు బావ, మరదలు అవుతారు. వారిద్దరిది ఒకే గ్రామం, ఒకే బజారు కావడంతోపాటు గోపి వాళ్ల అన్న గోపాల్, సింధు అక్క అరుణ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీంతో వీరద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. గోపి, సింధుల ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల వారికి తెలిసింది. ఒకే ఇంటికి రెండో అమ్మాయిని ఇచ్చేందుకు సింధు కుటుంబ సభ్యులు, ఒకే ఇంటికి చెందిన అమ్మాయిని కోడలుగా చేసుకునేందుకు గోపి కుటుంబ సభ్యులు నిరాకరించారు.

కానీ, ఇరుకుటుంబాలు తర్జనభర్జన పడి కొంతకాలం తర్వాత ఇద్దరికీ పెళ్లి చేయాలని అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గోపి ట్రాక్టర్‌తో మట్టి తోలాడు. సింధు కుటుంబ సభ్యులందరితో శుక్రవారం రాత్రి కలిసి భోజనం చేసింది. ఈ క్రమంలో తమకు పెళ్లి చేస్తారో లేదోననే అనుమానంతో అదే రాత్రి గోపి, సింధు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో గోపి తన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి ఇద్దరం కలిసి పురుగు మందు తాగినట్లు తెలిపాడు.

దీంతో ఇరు కుటుంబాల వారు, స్థానికులు కలిసి గ్రామంలోను, పంట పొలాల్లోను రాత్రంతా వెతికినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం గోపి అన్న గోపాల్‌కు అన్నారుపాడు–పడమటనర్సాపురం గ్రామాల మధ్య లైన్‌ సరిహద్దు వద్ద ఓ రైతు మిరపతోటలో ఇద్దరు వ్యక్తులు పడిపోయి ఉండటాన్ని గమనించి దగ్గరకు వెళ్లి చూడగా వారు గోపి, సింధుగా గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలం వద్ద గోపి, సింధు కలిసి చనిపోవడాన్ని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అన్నారుపాడు గ్రామానికి వచ్చి గోపి, సింధు మృతదేహాలను పరిశీలించారు. ట్రైనీ ఎస్సై రాజేశ్‌కుమార్‌ వివరాలు నమోదు చేశారు. సింధు తండ్రి లావుడ్యా లక్ష్మణ్, గోపి తండ్రి గుగులోత్‌ శ్రీను వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు హెడ్‌ కానిస్టేబుల్‌ శివాజీగణేశ్‌ కేసు నమోదు చేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement