
ప్రతీకాత్మక చిత్రం
అల్గునూర్ (మానకొండూర్): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ వద్ద ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్ – కరీంనగర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తోపాటు 20 మంది గాయపడ్డారు. ఎల్‌ఎండీ ఎస్సై నరేశ్‌రెడ్డి కథనం ప్రకారం.. మెట్‌పల్లి డిపోకు చెందిన బస్సు శనివారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి మెట్‌పల్లికి బయల్దేరింది. బస్సులో డ్రైవర్, కండక్టర్, 21 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు రాత్రి 2 గంటలకు నుస్తులాపూర్ వద్దకు చేరుకుంది. ఈ సమయంలో ఐరన్ కడ్డీల లోడ్‌తో ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేసేందుకు బస్సు డ్రైవర్ నర్సయ్య ప్రయత్నించాడు.
అయితే లారీ కన్నా ఎక్కువ పొడవు ఉన్న ఇనుప కడ్డీలు బస్సు డ్రైవర్ ఉన్న భాగంలోనికి చొచ్చుకెళ్లాయి. దీంతో బస్సు అదుపు తప్పి వేగంగా లారీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో డ్రైవర్‌తోపాటు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎల్‌ఎండీ ఎస్సై నరేశ్‌రెడ్డి సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.