హత్యలకు దారితీస్తున్న వివాదాలు | Land Issues Murders In Warangal | Sakshi
Sakshi News home page

హత్యలకు దారితీస్తున్న వివాదాలు

Jul 15 2018 8:50 AM | Updated on Aug 17 2018 2:56 PM

Land Issues Murders In Warangal - Sakshi

క్రిష్టోఫర్‌ మృతదేహం(ఫైల్‌)

జనగామ అర్బన్‌: జనగామ జిల్లాలో వివాదాలు హత్యలకు దారితీస్తున్నాయి. దశాబ్దాలుగా రగులుతున్న భూ వివాదాలతో పాటు ఆర్థిక పరమైన లావాదేవీలు, అక్రమ సంబంధాలు పలువురి ప్రాణాల మీదకు వస్తున్నాయి. చిన్న తగాదాలే చిలికి చిలికి గాలివానలా తయారై హత్యలకు దారితీస్తున్నాయి. జనగామలో 38 ఏళ్ల క్రితం ఓ టీచర్‌ హత్యతో మొదలైన సంఘటనలు ప్రెస్టన్‌ పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్‌ దైదా క్రిష్టోఫర్‌ను అతి కిరాతకంగా హత్యచేసిన సంఘటన వరకు కొనసాగుతూనే ఉన్నాయి. భూ వివాదాలతో పాటు ఇతర కారణాలే హత్యల వరకు దారితీస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. హత్యచేసిన వారిలో కొందరు నేరుగా వచ్చి పోలీసులకు లొంగిపోతుండటంతో జిల్లాలో ఫ్యాక్షన్‌ కల్చర్‌ను మైమరిపిస్తోంది.  పగలు, ప్రతీకారాలతో రగిలిపోతూ అవకాశం కోసం ఎదురు చూస్తూ తిరిగి ప్రత్యర్థులను మట్టుపెట్టే విధంగా ప్రణాళికలను రూపొందించుకొని హత్యలు చేయడంతో కొన్ని  సందర్భాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగడంతో పాటు పోలీసు వ్యవస్థనే ప్రశ్నించే స్థితికి దారి తీస్తుందన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.

జిల్లాలో పగలు, ప్రతీకారంతో దాడి చేసి హత్యకు గురైన సంఘటనలో కొన్ని...
జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల గ్రామశివారు వడ్డెర కాలనీలో 2013 ఆగçస్టు 13న రియల్టర్‌ శివరాత్రి విజయ్‌ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. 
నెల్లుట్ల గ్రామశివారులోనే పందిగోటి మురళి 2016 డిసెంబర్‌ 26న హత్యకావించబడ్డాడు.
లింగాలఘనపురం మండలం జీడికల్‌ గ్రామంలో భూ వివాదంలో 2017 సెప్టెంబర్‌లో కొండబోయిన రాములు అనే వ్యక్తి హైదరాబాద్‌లో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సస్పెండ్‌ కానిస్టేబుల్‌పై  ప్రత్యుర్థులు 2018 జూన్‌ 16న దాడిచేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.


 బచ్చన్నపేట మండలంలో రెండు సంవత్సరాల క్రితం పల్లెపు సిద్ధయ్య అనే జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్‌ను కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని హత్య చేశారు. 
 2017 మేలో మండలంలోని దబ్బగుంటపల్లి గ్రామంలో పంతుల బాలమణి భర్త శ్రీనివాస్‌ను హత్య చేసింది. ఎనిమిది నెలల క్రితం పోచన్నపేటలో నర్సింగ త్రివేణి అనే వివాహితను భర్త హత్య చేశాడు. 
 స్టేషన్‌ఘన్‌పూర్‌ పరిధి చిల్పూరు మండలం పరిధి పల్లగుట్టకు చెందిన కొంతం భాగ్యలక్ష్మీని 2017 అక్టోబర్‌ 18న  భూ వివాదంలో గిట్టని వారు  సుఫారీ హత్యను చేయించారు. 
 స్టేషన్‌ఘన్‌పూర్‌ శివునిపల్లికి చెందిన రాయపురం ధర్మయ్యను  భార్య శాంతమ్మ 2018 ఏప్రిల్‌ 23న హత్యచేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంచలనం రెకెత్తిస్తున్న హత్యలు....
జనగామ జిల్లాలో వారం రోజుల వ్యవధిలోనే రెం డు హత్యలు చోటు చేసుకోవడం స్థానికంగా సంచలనాన్ని రేకెత్తిస్తోంది. వారం రోజుల క్రితం మండలంలోని చీటకోడూరులో మామ చేతిలో హత్యకు గురైన ఉదయ్‌ సంఘటన మరువక ముందే శుక్రవారం   దైదా క్రిష్టోఫర్‌ హత్యకు గురికావడం గమనార్హం. భూ వివాదాలు, కుటుంబ కలహాలే  హత్యలకు దారితీసి ఉంటాయని ప్రజలు చర్చిం చుకుంటున్నారు. జనగామ జిల్లాలోని ప్రెస్టన్‌ భూములకు సంబంధించి 1990 నుంచి 2007 వరకు ఐదుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఇందులో మాజీ నక్సలెట్స్‌తో పాటు రౌడీ షీటర్లు ఉండటం గమనార్హం. 

హత్య కేసు నమోదు
దారుణహత్యకు గురైన ప్రెస్టన్‌ పాఠశాల కరస్పాండెంట్‌ దైదా క్రిష్టోఫర్‌ హత్యకేసుకు సంబంధించి పోలీసులు శనివారం కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. క్రిష్టోఫర్‌ కుమారై ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదులో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు గ్రామానికి చెందిన ఉపేష్, తరిగొప్పుల గ్రామానికి చెందిన ఉప్పలయ్యతో పాటు జనగామకు చెందిన కె.యం. జాన్‌ పేర్లు ఉన్నాయన్నారు. బాధితుల ఫిర్యా దు మేరకు దర్యాప్తును ప్రారంభించామన్నారు.  ఇదిలా ఉండగా క్రిష్టోపర్‌ హత్యకు గురైన సంగతి తెలుసుకొని ఆస్పత్రికి చేరుకున్న బంధువుల రోదనలు మిన్నంటాయి.  కాగా  క్రిష్టోఫర్‌ను హత్య చేసిన వారు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అయితే నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారన్న విషయాన్ని మాత్రం అధికారులు ధ్రువీకరించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement