‘కోతముక్క’ జూదరులు అరెస్టు

Kothamukka Fraud Game Gang Arrest in Krishna - Sakshi

సాక్షి, అమరావతిబ్యూరో : కోతముక్క పేకాటలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజలను మోసం చేసి రూ. లక్షలు దండుకోవడానికి సిద్ధమైన ఓ ముఠాను విజయవాడ నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నగర పోలీసు కమిషనర్‌ ద్వారకాతిరుమలరావు ఆదివారం రాత్రి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో లోన బయట(కోతముక్క) ఆటను ఆడేందుకు ఎక్కువ మంది మక్కువ చూపుతుండటాన్ని గుర్తించిన ఓ ముఠా ఆ ఆట కోసం ప్రత్యేకంగా రూపొందించిన చీటింగ్‌ యాప్‌ను ఢిల్లీ నుంచి కార్గో సర్వీస్‌ ద్వారా నగరానికి తరలించారు వారిని గన్నవరం ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రుకు చెందిన గుడివాడ నవీన్, ఏలూరుకు చెందిన యండ్ల అశోక్‌కుమార్, గుంటూరు జిల్లా కోనూరు గ్రామం విద్యానగర్‌కు చెందిన షేక్‌జానీ భాషా, అదే జిల్లాలో ఇస్లాంపేటకు చెందిన మహబుగోరి, విజయవాడ పటమటకు చెందిన మెరుపు సందీప్‌లు గత కొంతకాలంగా ఢిల్లీ నుంచి కోతముక్కకు సంబంధించిన యాప్‌ కిట్‌ను తెప్పించుకుంటున్నారన్నారు. దీని ద్వారా కోతముక్క ఆడే ఆటగాళ్లను మోసం చేస్తూ అక్రమ మార్గంలో డబ్బు సంపాదిస్తున్నారని చెప్పారు.

పక్కా నిఘా పెట్టి..
ముందుగానే స్కాన్‌ చేసిన ప్లేయింగ్‌ కార్డుల ద్వారా కోతముక్క ఆటలో ఏ కార్డు ఏవైపు పడుతుందో తెలుసుకుని పెద్ద మొత్తంలో జూదం కాస్తూ పేకాటరాయుళ్లను దోచుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సమాచారం తెలిసి చాలా రోజులుగా వారిపై నిఘా పెట్టి, ఆదివారం వారిని గన్నవరం ఎయిర్‌పోర్టు పరిసరాల్లో అరెస్టు చేశామని చెప్పారు. వారి వద్ద నుంచి రూ. 2.80 లక్షల విలువైన నాలుగు సీవీకే–458 చీటింగ్‌ యాప్‌ కిట్, రహస్య కెమెరాలు కలిగిన రెండు సెల్‌పోన్లు, మరో ఐదు సాధారణ సెల్‌ఫోన్లు, రెండు మొబైల్‌ స్కానింగ్‌ వ్యాచ్‌లు, నాలుగు మైక్రో ఇయర్‌ ఫోన్లు, 168 స్కాన్‌ ప్లేయింగ్‌ కార్డు ప్యాకెట్స్‌తోపాటు బ్యాటరీలు, రిమోట్‌లు, కేబుళ్లు తదితర వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇలాంటి పేకాట జూదరుల బారిన పడొద్దని సీపీ హెచ్చరించారు. సమావేశంలో టాస్క్‌పోర్స్‌ ఏసీపీ రాజీవ్‌కుమార్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top