పానీపూరి బండి వద్ద వివాదం

Knife Attack On Brothers in PSR Nellore - Sakshi

అన్నదమ్ములపై కత్తులతో దుండగుల దాడి

ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ

నిందితుల కోసం గాలింపు  

నెల్లూరు(క్రైమ్‌): పానీపూరి తినే క్రమంలో వివాదం నెలకొని దుండగులు కత్తులతో అన్నదములపై  దాడిచేసి పరారైన ఘటన నెల్లూరులోని బీవీనగర్‌ సెంటర్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీ సుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజ స్తాన్‌ రాష్ట్రం కరోలి జిల్లా రూమ్‌తాకాపూరు మండలం మాసరోపూరు గ్రామానికి చెందిన సంతోష్‌కుమార్, జండేర్‌ అలియాస్‌ బబ్లూలు అన్నదమ్ములు. వారు పదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వలస వచ్చారు. ఆర్టీఓ కార్యాలయం సమీప అనగుంట కాలనీలో ఇళ్లు అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. మార్బుల్స్‌ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొద్దిరోజులుగా అన్నదమ్ములిద్దరూ మనుమసిద్ధినగర్‌లో పనిచేస్తున్నారు.

మాటామాటా పెరిగి..
శుక్రవారం రాత్రి ఇద్దరూ పనులు ముగించుకుని బీవీనగర్‌ మైన్స్‌ కార్యాలయం సమీపంలో పానిపూరి తింటుండగా ఇద్దరు వ్యక్తులు కేటీర్‌ (కరిజ్మా) బైక్‌పై పానీపూరి తీనేందుకు బండి వద్దకు వచ్చారు. అక్కడ బైక్‌పై వచ్చిన వ్యక్తులు పానీపూరి తినేక్రమంలో అన్నదమ్ములపై నీళ్లుపడ్డాయి. చూసుకుని తినండి అని వారు ఇద్దరు వ్యక్తులకు సూచించారు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగింది. ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా తమ బైక్‌లో ఉన్న కత్తులు తీసి అన్నదమ్ముల వీపులపై విచక్షణారహితంగా దాడిచేసి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంతో సంతోష్‌కుమార్, జండేర్‌లు అక్కడే కూలబడిపోయారు. స్థానికులు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది శ్రీను ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.

విభిన్న కోణాల్లో దర్యాప్తు
సమాచారం అందుకున్న నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్‌ నరసింహారావులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను, పానీపూరి బండి యజమానిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. వారు ఖచ్చితమైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు వెళ్లి మాట్లాడారు. వారి ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్‌ నరసింహారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఘటనపై పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిందితులకు, బాధితులకు గతంలో ఏవైనా గొడవలున్నాయా? లేదా అనుకోకుండా ఈ ఘటన జరిగిందా?, అలా జరిగి ఉంటే నిందితులు బైక్‌లో కత్తులెందుకు పెట్టుకుని తిరుగుతున్నారు. వారెవరు? తదితర  వివరాల సేకరణలో పోలీసులు నిమగ్నమయ్యారు. సీసీపుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
కాగా ఘటన జరగకముందు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి బీవీనగర్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. గురువారం రాత్రి ఆ ప్రాంతంలో చైన్‌స్నాచింగ్‌ జరిగింది. ఆ బాధితురాలిని ఎస్పీ విచారించినట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top