ఇవ్వాల్సిన డబ్బులు అడిగినందుకు కిడ్నాప్‌ డ్రామా

Kidnap Drama In Guntur - Sakshi

రాజధానిలో కొత్తరకం దందా

గుంటూరు, తాడేపల్లిరూరల్‌: నవ్యాంధ్ర రాజధానిలో దళారులు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. రాజధాని ప్రాంతమైన తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఓ సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. సేకరించిన వివరాల ప్రకారం.. తాడేపల్లి పట్టణ పరిధిలోని క్రిస్టియన్‌పేటలో మహేష్‌ నివసిస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పిచ్చికందుల గ్రామానికి చెందిన కొత్తపల్లి శ్రీనివాసరావు కొన్నేళ్ల క్రితం విజయవాడ వచ్చి గ్రానైట్‌ వ్యాపారంలో స్థిరపడ్డాడు. రాజధాని ప్రాంతంలో 5 సెంట్ల స్థలం కావాలని కోరడంతో, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మహేష్‌ స్థలాన్ని చూపించారు. మహేష్‌ సర్వే నబరు 172/2లో ఉన్న తన 5 సెంట్ల భూమిని రూ.40లక్షలకు అమ్ముతున్నట్లు 2017 సెప్టెంబరు నెలలో రూ.5లక్షలు ఇచ్చి అగ్రిమెంటు రాయించుకున్నారు.

అదే నెలలో మరో రూ.6 లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించుకొని, చెల్లించాల్సిన మిగతా సొమ్ముకు చెక్కులు ఇచ్చారు. ఆ తర్వాత కొత్తపల్లి శ్రీనివాసరావు ఫోన్‌ తీయకపోవడంతో పలుసార్లు విజయవాడ షాపునకు వెళ్లినా సమాధానం చెప్పలేదని బాధితుడు మహేష్‌ తెలియజేశాడు. మంగళవారం తాడేపల్లి బైపాస్‌రోడ్డులో కొత్తపల్లి శ్రీనివాసరావు కనిపించడంతో అడ్డుకొని, పోలీస్‌స్టేషన్‌కు వెళ్దాం పద అని మాట్లాడగా కాళ్లూగడ్డాలు పట్టుకొని రాయపూడిలో పెద్ద మనుషుల దగ్గర మాట్లాడుకుందామని తీసుకెళ్లాడని, అనంతరం స్థలం కొనుగోలు చేసిన శ్రీనివాసరావు తన సహచరులకు ఫోన్‌ చేసి, మహేష్‌ కిడ్నాప్‌ చేశాడని తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించాడని మహేష్‌ తెలిపారు. పోలీసులు తనకు ఫోన్‌ చేశారని, వెంటనే శ్రీనివాసరావును పోలీస్‌స్టేషన్‌ దగ్గరకు తీసుకొచ్చానని, కిడ్నాప్‌ చేస్తే పెద్ద మనుషులతో కలిసి ఎందుకు మాట్లాడతామంటూ ప్రశ్నించినా, పోలీసులు చెప్పింది వినకుండా అతను చెప్పిన అందరినీ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top