మంటలు రేపిన మారణకాండ

Kidari Sarveswara Rao Activists Burnt Police Station In Dumbriguda - Sakshi

కిడారి, సివేరిలను కాల్చి చంపిన మావోలు

ఆగ్రహంతో రగిలిపోయిన అనుచరులు, స్థానికులు

పోలీస్‌స్టేషన్లపై దాడులు, ఔట్‌పోస్టు దగ్ధం

చివురుటాకులా వణికిన అరకులోయ

ఒక ప్రతీకారేచ్ఛ మారణకాండ సృష్టించింది.. ఆ మారణకాండకు నిరసనగా ఆగ్రహజ్వాల రగిలింది. అందాల అరకును అట్టుడికించింది.. మొత్తం మన్యాన్ని భయం గుప్పిట్లోకి నెట్టింది.నవ్యాంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా మావోయిస్టులు పంజా విసిరారు. అరకు టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కిడారి, అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోల తూటాలకు నేలకొరిగారు. స్థానికులు, నేతల అనుచరుల్లో అలజడిని, ఆగ్రహాన్ని రేపిన ఈ ఘటన.. అరకు, డుంబ్రిగుడ పోలీస్‌స్టేషన్లపై దాడికి, దహనానికి పురిగొల్పింది. అనూహ్యంగా జరిగిన మారణకాండ, దాడులు, విధ్వంసాలతో అరుకులోయ చివురుటాకులా వణికిపోయింది. ఈ మొత్తం ఘటనలో కిడారి, సివేరిల మృతదేహాలు నాలుగు గంటల పాటు సంఘటన స్థలంలోనూ.. మరో నాలుగు గంటలు వారి వాహనాల్లోనూ అనాథల్లా మిగిలిపోవడం స్థానికులను కలచివేసింది.

సాక్షి విశాఖపట్నం/పాడేరు రూరల్‌/అరుకులోయ:  విశాఖ మన్యం ఉలిక్కిపడింది. మావోయిస్టుల ఘాతుకంతో ఏవోబీ భీతిల్లింది. అధికారపార్టీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు, మాజీ ప్రజాప్రతినిధి సీవేరిసోమను కాల్చి చంపిన ఘటన ఏజెన్సీలో కలకలం రేపుతోంది. డుంబ్రిగుడ మండల కేంద్రానికి రెండు కిలోమీటర్లు దూరంలోని పోతంగి పంచాయతీ లివిటిపుట్టులో జరిగిన ఈ ఘటనతో ఏవోబీ ఉలిక్కిపడింది. ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను ఆదివారం మధ్యాహ్నం 12.20గంటల సమయంలో మావోయిస్టులు దారుణంగా కాల్చిచంపారు. వీరిద్దరినీ అతి దగ్గరగా కాల్చిచంపడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

డుంబ్రిగుడ మండలం లివిటి పుట్టు వద్ద మావోలు ఈ దాడికి పాల్పడ్డారు. అరకు నుంచి డుంబ్రిగుడ, గుంటసీమ రోడ్డు మీదుగా కండ్రుం పంచాయతీకి కార్యకర్తలు, అనుచరులు సహా మూడు వాహనాల్లో బయలు దేరిన కిడారివాహనాల్ని ముందుగానే మాటువేసిన40 మంది మహిళలు సహా 70 మంది సాయుధదళం కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల అడ్డగించి మార్గమధ్యంలోనే మట్టుబెట్టారు. ఉదయం 11 గంటలక వరకూ అరకులోనే ఉన్న కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమతో కలిసి లివిటి పుట్టు గ్రామానికి క్షేత్ర స్థాయి పరిశీలనకు బయలుదేరి వెళ్లారు. గ్రామ సమీపంలో మార్గమధ్యంలో వాహనాలపై ఒక్కసారిగా మావోలు అడ్డగించారు. ఎమ్మెల్యే గన్‌మెన్‌ల వద్ద నుంచి తుపాకీలు, సెల్‌ఫోన్లు లాక్కొని వారిని దూరంగా పంపించేశారు. అనంతరం  వారంతా చూస్తుండగానే చూస్తుండగానే ఎమ్మెల్యే కిడారిని, మాజీ ఎమ్మెల్యే సోమకు చేతులు కట్టికొద్ది దూరం ముందుకు తీసుకువెళ్ళి అరమ–గుంటసీమ జంక్షన్‌ వద్ద నిలిపివేశారు.  ఇటీవల చోటు చేసుకున్న పలు అంశాలపై ఎమ్మెల్యే కిడారితో కొద్ది సేపు చర్చించారు. గూడ క్వారీ పర్యావరణాన్ని దెబ్బదీస్తున్నందున మూసెయ్యాలని గతంలో పలు మార్లు హెచ్చరించినా ఎందుకు నడిపిస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భయంతో వణికిపోయిన కిడారి.. ఈ ఒక్కసారికీ క్షమించాలంటూ వేడుకున్నా.. మావోలు వినిపించుకోకుండా కాల్చిచంపారు. పక్కనే ఉన్న మాజీ ఎమ్మెల్యే సోమ ఈ దృశ్యాన్ని చూసి భీతావహుడై పారిపోయేందుకు ప్రయత్నించగా ఆయన్ని కూడా మట్టు బెట్టారు. అనంతరం గాల్లోకి కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి మావోయిస్టులు వెళ్లిపోయారు.

అట్టుడికిన అరకు
ఘటనతో  అభిమానులు, కుటుంబ సభ్యులు, అనుచరుల ఆగ్రహావేశాలతో రగిలిపోయారు. పెద్ద సంఖ్యలో పోలీస్‌ స్టేషన్లకు  తరలివచ్చారు.  పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘాతుకం అంటూ సీఐపై మండిపడ్డారు. మూడు రోజుల నుంచి మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు జరుగుతున్నా ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అరకు, డుంబ్రిగుడ పోలీస్‌ స్టేషన్లపై దాడికి తెగబడ్డారు. రాళ్లు రువ్వి, లోపల ఉన్న ఫర్నిచర్‌ మొత్తం ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలను పగులగొట్టడంతోపాటు లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర రికార్డులు, బయట ఉన్న మోటారు సైకిళ్లు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలను కూడా ధ్వంసం చేశారు. అనంతరం వాహనాలకు, స్టేషన్లకు నిప్పుపెట్టారు.  పోలీసులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. రాత్రి వరకు ఈ రెండు స్టేషన్లలోనూ మంటలు అదుపులోనికి రాలేదు. వాహనాలు దగ్ధమవుతూ పెద్ద ఎత్తున శబ్ధాలు రావడంతో జనం దూరంగా వెళ్లిపోయారు. పోలీసుల వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
మృతదేహాల తరలింపులోనూ కొద్దిసేపు  హైడ్రామా నడిచింది.   దీంతో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు, కిడారి, సోమ అభిమానులు, కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులయ్యారు.

అంతటా విషాదం
పాడేరు: అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు మావోయిస్టుల తూటాలకు బలవ్వడంతో మన్యమంతటా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఈ వార్త అంతటా దావానంలా వ్యాపించింది. వారి బంధువులు, అభిమానులు, వివిధ గిరిజన వర్గాలు, ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. కన్నీటి పర్యంతమయ్యారు. అనూహ్య మరణం పట్ల తీవ్ర దిగ్రాంతిని వ్యక్తం చేశారు. టీడీపీ వర్గాల్లో తీవ్ర ఆందోళన, అలజడి వ్యక్తమవుతోంది. పాడేరులోని సర్వేశ్వరరావు క్యాంపు కార్యాలయం వద్ద, సతీమణి పరమేశ్వరి స్వగ్రామమైన పట్టణంలోని గొందూరు కాలనీలో విషాదం చోటుచేసుకుంది. సర్వేశ్వరరావు క్యాంపు కార్యాలయం వద్ద ఆయన చిత్రపటం ఉంచి బంధువులు నివాళి అర్పించారు. పలువురు మహిళలు కంటతడి పెట్టుకున్నారు. కొందరు సంఘటన స్థలానికి తరలివెళ్లారు.  

కుగ్రామం నుంచి ప్రభుత్వ విప్‌ వరకు
పాడేరు: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుది ఓ కుగ్రామం.  పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ నడిమివాడలో నిరుపేద కుటుంబంలో పుట్టారు. జి.మాడుగుల మండలం కిల్లంకోటలో ఉండేవారు. చిన్నప్పుడే పెళ్లయింది. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యాపారం పట్ల మక్కువ చూపేవారు.1990లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అప్పటి  మంత్రి  కొణతాల రామకృష్ణకు మంచి నమ్మకస్తుడిగా ఉండేవారు. వైఎస్సార్‌ హయాంలో ఎమ్మెల్సీ పదవి వరించింది. రెండేళ్లపాటు పదవిలో కొనసాగారు. వైఎస్సార్‌ మరణం తరువాత వైఎస్సార్‌సీపీ అరకు సమన్వయకర్తగా వ్యవహరించి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2016 ఏప్రిల్‌ 28న టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ విప్‌గా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్నారు.

పోలీస్‌స్టేషన్లకు నిప్పు..
అరకులోయ: ఇదే సమయంలో రెండు మృతదేహాలు వాహనాల్లో ఈ స్టేషన్ల వద్దకు వచ్చేసరికి వారి అనుచరులు, అభిమానులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఒక్కసారిగా పక్కపక్కనే ఉన్న అరకు, డుంబ్రిగుడ పోలీస్‌ స్టేషన్లపై దాడికి తెగబడ్డారు. వీరంతా రాళ్లు రువ్వి, లోపల ఉన్న ఫర్నిచర్‌ మొత్తం ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలను పగులగొట్టడంతోపాటు లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర రికార్డులు, బయట ఉన్న మోటారు సైకిళ్లు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలను కూడా ధ్వంసం చేశారు.  రాత్రి వరకు ఈ రెండు స్టేషన్లలోనూ మంటలు అదుపులోనికి రాలేదు. వాహనాలు దగ్ధమవుతూ పెద్ద ఎత్తున శబ్ధాలు రావడంతో జనం దూరంగా వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఈ రెండు స్టేషన్లకు పక్కనే విద్యుత్‌ ట్రాన్స్‌పార్మర్‌లు ఉండడంతో ముందుస్తుగా ఎలాంటి ప్రమాదం జరగకుండా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగుతున్న విషయాన్ని తెలుసుకున్న కొందరు పోలీసులు వెనుక నుంచి వచ్చి ఒక భవనంలో ఉన్న ఏపీఎస్పీ బెటాలియన్‌కు చెందిన బ్యాగులు, తుపాకులను తీసుకుని బయటకు వచ్చారు. లేకుంటే తుపాకులు కూడా కాలిపోయే పరిస్థితి ఉండేది.

సీఆర్‌పీఎఫ్‌ ముట్టడిలో అరకు..
రూరల్‌ ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులు అంత అరకులోయలోని పరిస్థితిని సమీక్షించారు. దీంతో జిల్లాలోని అందుబాటులో ఉన్న సీఎర్పీఎఫ్‌   బలగాలను అరకులోయ ప్రాంతానికి హుటాహుటిన తరలించారు.  బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి.  అరకులోయలో పలు ప్రధాన జంక్షన్ల వద్ద సీఆర్‌పీఎఫ్‌ దళాలు పహరా కాస్తున్నాయి.

అరకులోయలోనే పోస్టుమార్టం
డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతదేహాల పోస్టుమార్టానికి అరకులోయ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఏర్పాట్లు చేస్తున్నారని కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అర్జున్‌ తెలిపారు. పోస్టుమార్టానికి మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తీసుకొస్తున్నారన్న సమాచారంతో మెయిన్‌ గేట్‌ నుంచి మార్చురీ వరకు అడుగడుగునా పోలీసులు మోహరించారు. మధ్యాహ్నాం 3 గంటలకే పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. వారితో పాటు సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ కె.ఎస్‌.ఎల్‌.జి.శాస్త్రి పోస్టుమార్టానికి ఏర్పాట్లు చేశారు.  అయితే మృతదేహాలను అక్కడి నుంచి తీసుకురానివ్వకుండా అభిమానులు, ప్రజలు అడ్డుకోవడంతో అరకులోయ ఏరియా ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహిస్తారని డాక్టర్‌ అర్జున్‌ ‘సాక్షి’కి తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top