జెస్నా కోసం ఇడుక్కీ అడవుల్లో..

Kerala Police Launched Massive Manhunt In Idukki Forest For Missing Student Jesna - Sakshi

తిరువనంతపురం : ఈ ఏడాది మార్చి 22న అదృశ్యమైన కాలేజీ విద్యార్థిని జెస్నా మారియా జేమ్స్‌ ఆచూకీ కోసం కేరళ పోలీసులు ఇడుక్కి అడవుల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జెస్నా ఆచూకీ ఇంతవరకూ తెలియకపోవడంతో సోషల్‌ మీడియా వేదికగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం దర్యాప్తు వేగవంతం చేయాలని పోలీసులని ఆదేశించింది. కొట్టాయం ఎస్పీ హరిశంకర్‌ మాట్లాడుతూ.. జెస్నా కుటుంబం అభ్యర్థన మేరకు సుమారు 400 మంది అటవీ, పోలీసు అధికారులు కలిసి ఆమె కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

ఈ రోజు(మంగళవారం) ఉదయం నుంచి జెస్నా ఆచూకీ కోసం పది బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయన్నారు. ఎరుమలి, ముందక్కాయం, కుట్టికానమ్‌ అటవీ ప్రాంతాల్లో ఆమె కోసం వెదుకుతున్నట్లు వెల్లడించారు. కాగా, గత నెల 28వ తేదీన తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు, పడవేరి జాతీయ రహదారి సమీపంలోని అటవీ ప్రాంతంలో సజీవ దహనమైన స్థితిలో యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

మృతురాలి వయస్సు, శరీరపు కొలతలను బట్టి ఆమె జెస్నా అయి ఉండొచ్చని పోలీసులు భావించారు. ఈ మేరకు కాంచీపురం జిల్లా పోలీసు కమిషనర్‌ సంతోష్‌ అదమని కేరళ పోలీసులకు సమాచారం ఇచ్చారు. జెస్నా అదృశ్యమై 50 రోజులు దాటినా ఇంతవరకు ఆచూకీ లేని పరిస్థితుల్లో, ఆమె ఆచూకీ తెలిపిన వారికి రూ. 2 లక్షలు బహుమానాన్ని కేరళ పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top