స్నేహితుడిగా నటిస్తూ సొత్తు చోరీ

Jewellery Robbery In Friend Home - Sakshi

గుంటూరు ఈస్ట్‌: స్నేహితుడిగా నటిస్తూ సొత్తు చోరీ చేసిన వ్యక్తిని సంఘటన జరిగిన 48 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్‌ డీఎస్పీ కండే శ్రీనివాసులు, లాలాపేట ఎస్‌హెచ్‌వో మురళీకృష్ణ ఆదివారం లాలాపేట పోలీస్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పాత గుంటూరు రెడ్ల బజారుకు చెందిన షేక్‌ రకీబుర్‌ రెహ్మాన్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ శానిటరీ  విభాగంలో కాంట్రాక్టు కార్మికుడుగా పని చేస్తుంటాడు. అడ్డదారిలో సంపాదించాలని పథకం వేశాడు .

లాలాపేట శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఉద్యోగి అయిన పీసపాటి శ్రీనివాసాచార్యులుని బైక్‌ మెకానిక్‌ షాపులో పరిచయం చేసుకున్నాడు. స్నేహంగా మెలుగుతూ ఆయన ఇంటికి వెళ్లేవాడు. ఇటీవల శ్రీనివాసాచార్యులు భార్య మృతి చెందినప్పుడు ఆత్మీయుడిలా అన్ని పనుల్లో అండగా నిలబడ్డాడు. ఈనెల 6న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో  యాత్రలకు వెళ్లాడు. ఈ సమయంలో రెహ్మాన్‌ తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి రూ. 30వేలు, బీరువాలోని 3.5 సవర్ల బంగారు నాంతాడు చోరీ చేశాడు. శ్రీనివాసాచార్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చోరీ జరిగిన రోజు శ్రీనివాసాచార్యులు ఇంటి సమీపంలో తిరుగాడిన విషయాన్ని నిర్ధారించుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీ జరిగిన 48 గంటల్లో అరెస్టు చేసి నగదుతో పాటు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

వేసవిలో ప్రత్యేక నిఘా
వేసవి ప్రారంభమైన నేపథ్యంలో చోరీలు నివారించేందుకు ప్రత్యేక నిఘా పెడుతున్నామని డీఎస్పీ కండే శ్రీనివాసులు తెలిపారు. ఊరు వెళ్లే సమయంలో నగలు, బంగారాన్ని బ్యాంకు లాకర్లలో పెట్టుకుని వెళ్లాలని సూచించారు. ఇంటికి ఆధునికమైన, బలమైన తాళాలు, గెడలు ఉపయోగించాలని తెలిపారు. లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ను వినియోగించుకోవాలని కోరారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top