నగరానికి జయరామ్‌ కేసు నిందితులు

Jayaram Murder Case accused to the city - Sakshi

పీటీ వారెంట్‌పై తీసుకువచ్చిన జూబ్లీహిల్స్‌ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: ఎక్స్‌ప్రెస్‌ టీవీ చైర్మన్, కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్‌ చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో నిందితులుగా ఉన్న రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలను జూబ్లీహిల్స్‌ పోలీసులు సోమవారం పీటీ వారెంట్‌పై నందిగామ నుంచి హైదరాబాద్‌ తీసుకువచ్చారు. జయరామ్‌ హత్య గత నెల 31న జూబ్లీహిల్స్‌లోని రాకేష్‌రెడ్డి ఇంట్లో జరిగింది. దీనికి సంబంధించి నందిగామ పోలీసులు రాకేష్‌తో పాటు వాచ్‌మన్‌ శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేశారు. పెనుగులాట, పిడిగుద్దులతో ఈ దారుణం జరిగిందని తేల్చారు. ఆపై గత గురువారం ఈ కేసు హైదరాబాద్‌కు బదిలీ కావడంతో జూబ్లీహిల్స్‌ ఠాణాలో రీ–రిజిస్టర్‌ చేశారు. నిందితుల్ని సైతం తమకు అప్పగించాలని కోరుతూ నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్‌ తీసుకుని నందిగామ వెళ్లిన బృందం రెండు రోజులు వేచి చూసింది.

ఎట్టకేలకు సోమవారం నందిగామ జైలులో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు నిందితుల్ని హైదరాబాద్‌ తీసుకువచ్చారు. వీరిని ఎల్బీ నగర్‌లోని న్యాయమూర్తి ఇంట్లో ఆయన ఎదుట హాజరుపరిచారు. 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. జయరామ్‌ హత్యలో శిఖా చౌదరితో పాటు ఇతరుల పాత్ర, పోలీసు అధికారులైన ఏసీపీ మల్లారెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసుల ప్రమేయాలు తెలియాలంటే నిందితుల్ని విచారించాల్సి ఉంది. దీంతో పాటు ఈ కేసులో బయటకు రాకుండా ఉండిపోయిన వివరాలను వెలుగులోకి తీసుకురావడానికి, జయరామ్‌ భార్య పద్మశ్రీ చేసిన ఆరోపణలపైన కూడా లోతైన విచారణ అవసరమని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారం రోజుల కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ మంగళవారం నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top