టెర్రర్‌.. ట్రాన్స్‌ఫర్‌! | Jammu and Kashmir Police reached the Jagtial district for interrogation | Sakshi
Sakshi News home page

టెర్రర్‌.. ట్రాన్స్‌ఫర్‌!

Mar 4 2020 2:07 AM | Updated on Mar 4 2020 4:34 AM

Jammu and Kashmir Police reached the Jagtial district for interrogation - Sakshi

పోలీసుల అదుపులో ఉన్న సరికెల లింగన్న

సాక్షి, జగిత్యాల: టెర్రరిస్టు లింకులపై విచారణలో భాగంగా జమ్మూకశ్మీర్‌ పోలీసులు జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు రావడం స్థానికంగా కలకలం రేపింది. మల్లాపూర్‌ మండలం కుస్తాపూర్‌ గ్రామానికి చెందిన సరికెల లింగన్నను రెండు రోజులుగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జమ్మూ జిల్లాలోని అర్నియా పట్టణంలో ఉన్న ఆర్మీ బేస్‌ క్యాంపులో కూలీగా పనిచేసే రాకేశ్‌కుమార్‌పై ఆర్మీ అంతర్గత సమాచారాన్ని ఉగ్రవాదులకు చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో జనవరి 5న కేసు నమోదైంది.

రాకేశ్‌ను జమ్మూ పోలీసులు అదే నెల 20న అదుపులోకి తీసుకుని విచారించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం కుస్తాపూర్‌కు చెందిన సరికెల లింగన్న బ్యాంకు ఖాతా నుంచి రాకేశ్‌కుమార్‌ ఖాతాకు ఫిబ్ర వరి 13న రూ.ఐదు వేలు, 25న రూ.4 వేల చొప్పున రెండు సార్లు నగదు జమ అయినట్లు గుర్తించారు. విచారణ నిమిత్తం సోమవారం ఉదయం జిల్లాకు చేరుకున్న జమ్మూ పోలీసుల బృందం లింగన్నను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. లింగన్న బావ శ్రీనివాస్‌ది మల్లాపూర్‌ మండలం మొగిలిపేట శ్రీనివాస్‌ పదేళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నాడు. అక్కడ తనకు తెలిసిన ఓ పాక్‌ మిత్రుడు డబ్బు అవసరమని కోరితే శ్రీనివాస్‌ విన్నపం మేరకు లింగన్న తేజ్‌ యాప్‌ ద్వారా రెండుసార్లు డబ్బులు పంపినట్లు లింగన్న కుటుంబ సభ్యులు చెబుతున్నారు.  

హానీట్రాప్‌ కలకలం
జమ్మూ జిల్లాలోని అర్నియా ఆర్మీ క్యాంపు సమీపంలోని పావల్‌కు చెందిన రాకేశ్‌కుమార్‌ ఆర్మీ శిబిరంలోనే కూలీ పనులు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అనితజెట్టి అనే మహిళ రాకేశ్‌కుమార్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం అయినట్లు తెలుస్తోంది. తనకు తాను జర్నలిస్టుగా పరిచయం చేసుకున్న అనితజెట్టి వృత్తిరీత్యా ఆర్మీకి సంబంధించిన సమాచారం తనకు ఇవ్వాలని కోరడంతోపాటు డబ్బు ఆశ చూపినట్లు సమాచారం. ఆమె ట్రాప్‌లో పడ్డ రాకేశ్‌కుమార్‌.. ఆర్మీక్యాంపు ప్రాంతంలో ఉన్న ఎత్తయిన ప్రాంతాలు, వాటర్‌ ట్యాంకులు, రైల్వేలైన్లు, రోడ్లు తదితర కీలక సమాచారం, ఫొటోలను ఫేస్‌బుక్‌ ద్వారా అనితజెట్టికి పంపడంతోపాటు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  

విచారణ సాగుతోంది: ఎస్‌ఐ 
ఆర్మీ క్యాంపు సమాచారం ఇతరులకు చేరవేసినందుకు జనవరి 5న రాకేశ్‌కుమార్‌పై జమ్మూలోని అర్నియాలో కేసు నమోదైంది. రాకేశ్‌కుమార్‌ బ్యాంకు ఖాతాకు మల్లాపూర్‌ మండలం కుస్తాపూర్‌కు చెందిన లింగన్న ఖాతా నుంచి రెండుసార్లు నగదు జమైనట్లు తేలడంతో జమ్మూ పోలీసులు విచారణ చేపడుతున్నారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.    
–రవీందర్, ఎస్సై, మల్లాపూర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement