గ్రామ పంచాయతీ ఉద్యోగుల ప్రమోషన్లలో అక్రమాలు

Irregularities In Village Panchayat Employment Promotions - Sakshi

పదోన్నతి కోసం రూ. 20 వేల నుంచి రూ. 30 వేలు వసూళ్లు

చేతులు మారిన లక్షల రూపాయలు

దురాజ్‌పల్లి (సూర్యాపేట) :  లంచాలు అడగని రోజులు రావాలి.. అక్రమాలకు అడ్డుకట్ట పడాలి.. అధికారుల తీరు మారాలి వంటి మాటాలు నీటి మూటలుగానే మిగులుతున్నాయి. రోజులు మారుతున్న అక్రమాలు ఆగడంలేదు. తాజాగా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అంటెండర్లుగా పని చేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో జరిగిన ప్రమోషన్ల ప్రక్రియలో ఉమ్మడి జిల్లా ఉద్యోగులతో పాటు సూర్యాపేట జిల్లా ఉద్యోగులు చేతి వాటం చూపినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక్కొక్క ఉద్యోగి నుంచి అందినకాడికి పైసలు గుంజుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 రూ.20వేల నుంచి రూ.30 వేలు వసూలు

 పంచాయతీ కార్యాలయాలలో  2002 సం వత్సరం  నుంచి 2008  సంవత్సరం వరకు అటెండర్‌గా  ఉద్యోగంలో చేరి విధులు నిర్వహిస్తున్న వారికి అర్హత మేరకు     రాష్ట్ర వ్యాప్తంగా  బిల్‌ కలెక్టర్లుగా  ప్రమోషన్లు కల్పించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 27 మంది అంటెండర్లకు బిల్‌ కలెక్టర్‌గా ప్రమోషన్‌ లభించింది.

సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 21 మందికి నల్గొండ జిల్లాలో న లుగురు, యాదాద్రి జిల్లాలో ఇద్దరు అటెండర్లకు బిల్‌ కలెక్టర్లుగా ప్రమోషన్‌ ఇచ్చారు. అయితే ఉమ్మడి గ్రామ పంచాయతీ  జిల్లా అధికారులు ప్రమోషన్‌ కల్పించేందుకు ఒక్కోక్క ఉద్యోగి నుంచి రూ. 20 వేలు వసూళ్లు చేసినట్లు సమాచారం.

సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా..

సూర్యాపేట  జిల్లాలో అత్యధికం అటెండర్లకు బిల్‌ కలెక్టర్‌గా ప్రమోషన్లు రావడంతో ఇక్కడి జిల్లా గ్రామ పంచాయతీ ఉద్యోగుల పంట పడింది. ప్రమోషన్‌ ఆడర్‌లు ఇవ్వడానికి జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి నుంచి జిల్లా అధికారి వరకు అందరి చేతులు తడిపితే తప్ప ప్రమోషన్‌ ఆడర్‌ చేతికి రాలేదని అంటున్నారు.

ఒక్కోక్క ఉద్యోగి నుంచి రూ. 20 నుంచి రూ. 30 వేలు వసూళ్లు చేసినట్లు బహిరంగంగానే చర్చించికుంటున్నారు.  ముఖ్యంగా జిల్లా గ్రామ పంచాయతీ కార్యాలయంలో పని చేస్తున్న ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి ఉద్యోగి పావులు కదిపినట్లు సమాచారం. ప్రమోషన్లు వస్తుడంటంతో ఉద్యోగులు కూడా విషయాన్ని బయటకు పొక్కకుండా చూస్తురని పలువురు ఆరోపిస్తున్నారు.

కిందిస్థాయి ఉద్యోగి నుంచి..

జిల్లాలో గ్రామ పంచాయతీ అటెండర్‌లతో పాటు గ్రేడ్‌ 2 స్థాయి కార్యదర్శులకు గ్రేడ్‌ 1 కార్యదర్శులుగా ప్రమోషన్‌ కల్పించారు. అదే విధంగా జిల్లాలో పని చేస్తున్న ఈఓపీఆర్‌డీలకు ఎంపీడీఓలుగా ప్రమోషన్లు లభించాయి. వీరి ప్రమోషన్ల ప్రక్రియ  కమిషనరేట్‌ పరిధిలో జరిగిన జిల్లా గ్రామ పంచాయతీ ఉద్యోగుల చేతులు  తడిచినట్లు తెలుస్తోంది. పైలు పైస్థాయికి  కదలడానికి క్రింది స్థాయి ఉద్యోగుల నుంచి అధికారి వరకు అంద రికి కొంత సొమ్ము ముట్టచెప్పక  తప్పలేదని అంటున్నారు.

అక్రమాల విషయం నా దృష్టికి రాలేదు

గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న అటెండర్లకు ప్రమోషన్‌ ప్రక్రియ ఉమ్మడి జిల్లా పరిధిలో జరిగింది. ఉమ్మడి జిల్లా అధికారులు సీనియారిటీ, అర్హత ప్రకారం ప్రమోషన్లు కల్పించి జిల్లాకు నివేదిక అందించారు.  ప్రమోషన్‌ పొందిన వారికి ప్రమోషన్‌ ఆర్డర్‌ అందించాం. క్రింది స్థాయి ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లు నా దృష్టికి రాలేదు. 

 – రాంమోహన్‌రాజు, జిల్లా పంచాయతీ అధికారి 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top