సరదాగా కాల్చేస్తుండ్రు!

Increasing Gun Culture - Sakshi

కలకలం రేపుతున్న కాల్పుల ఘటనలు

యథేచ్ఛగా నాటు తుపాకులు వాడుతున్న బడాబాబులు

మూగజీవాలపై కాల్పులు జరుపుతూ పైశాచికానందం

రెడ్‌ క్రాస్‌ సొసైటీ చొరవతో గతంలో కేసు నమోదు

ఇప్పటికీ చార్జిషీట్‌ వేయని పోలీసులు

వేటగాళ్ల బుల్లెట్లకు ఇటీవల కాడెద్దు మృతి

బడాబాబుల కాల్పుల సరదా మూగజీవుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. పూడూరు మండల పరిధిలోని ఫాంహౌస్‌ల సమీపంలో చోటు చేసుకున్న రెండు సంఘటనలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో నాటు తుపాకీతో కుక్కలను కాల్చి.. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వేటగాళ్లు..అప్పట్లో సంచలనం సృష్టించారు.

గత శనివారం మళ్లీ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఎన్కెపల్లి శివారులో కాడెద్దుపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతిచెందింది. సంపన్న వర్గాలకు చెందిన వారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుండటంతో పోలీసులు, అధికారులు అటువైపు తొంగి చూడటం లేదు. రక్తం మరిగిన పులుల్లా గన్‌ కల్చర్‌కు అలవాటుపడిన దుండగులు మనుషులపై ఎక్కుపెట్టే రోజు రాకముందే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

పరిగి : అసాంఘిక కార్యకలాపాలు, కాల్పుల సంఘటనలు జరిగిన సమయంలో హల్‌చల్‌ చేస్తున్న పోలీసులు ఆ తర్వాత మిన్నకుండిపోతున్నారు. ప్రధాన కేసులన్నీ ఇలాగే  నీరుగారుతుండటం.. వీరి పని తీరుపై విమర్శలకు తావిస్తోంది. ఈ కేసులన్నింటిలో బడాబాబులు, ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధుల హస్తం ఉంటుండటంతో పోలీసుల విచారణ సైతం ఎక్కడో ఒక చోట ఆగిపోతోందనే ఆరోపణలున్నాయి.

సరదా కోసం  కొందరు బడాబాబులు గన్‌తో కుక్కలు, ఎద్దులను వేటాడి చంపుతున్న ఘటనలు చోటుచేసుకోవడం స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పరిగి నియోజకవర్గ పరిధిలోని పూడూరు మండల పరిసరాలు దీనికి వేదికవుతున్నాయి. కాల్పల ఘటనలే కాకుండా అసాంఘిక కార్యకలాపాలు, నేరస్తులు తలదాచుకోవటం తదితర కార్యకలాపాలకు ఈ ప్రాంతం అడ్డాగా మా రిందని ప్రజలు చెబుతున్నారు.

ఇది తమను ప్ర మాదంలో పడేస్తోందని ఆవేదన వ్యక్తంచేసు ్తన్నా రు. ఏడాది క్రితం తుపాకీతో కుక్కలను వేటాడి.. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన సంఘటన జరిగి ఏడాదిన్నర కావస్తుండగా.. సరిగ్గా ఇలాంటి సంఘటనే మళ్లీ జరగడం కలకలం రేపుతోంది. తాజాగా ఎద్దును గన్‌తో కాల్చి చంపి కళేబరాన్ని మాయం చేసిన ఉదంతం హాట్‌ టాపిక్‌గా మారింది.

గతంలో కుక్కల వేట..

 కొందరు బడా బాబులు తమ సరాదా కోసం అటుగా వెళ్లే పెంపుడు కుక్కలను గన్‌తో వేటాడి చంపారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ఈ విషయం రెడ్‌క్రాస్‌ సొసైటీ దృష్టికి వెళ్లడంతో.. కేంద్ర మంత్రి మేనకాగాంధీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందో వివరాలు సేకరించాలని ఆమె సొసైటీ ప్రతినిధులకు సూచించారు.

పోలీసుల సహకారంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సంఘటన జరిగింది పూడూరు మండల పరిధిలోని మన్నెగూడ సమీపంలోని ఓ ప్రైవేటు ఫాంహౌస్‌లో అని ప్రా థమి కంగా గుర్తించారు. అనంతరం చన్గొముల్‌ పోలీసులను ఆశ్రయించటంతో వారు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత చేవెళ్ల డీఎస్పీ శృతకీర్తి రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులతో కలిసి సంఘటన స్థలాన్ని సందర్శించారు. కానీ ఇప్పటి వరకూ దీనిపై చార్జిషీట్‌ వేయలేదు.

తాజాగా ఎద్దుపై కాల్పులు.... 

తాజాగా గన్‌తో ఎద్దుపై కాల్పులు జరిపి చంపిన ఘటన స్థానికంగా మరో సారి సంచలనం రేపింది. పూడూరు మండల పరిధిలోని ఎన్కెపల్లి శివారులో ఎద్దుపై తుపాకితో కాల్పులు జరపగా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అయితే ఈ విషయమై ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బాధిత రైతు ముందుగా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. కాల్పులకు పాల్పడిన వ్యక్తులు ఎద్దును కొనిస్తామని చెప్పడంతో అతను మిన్నకుండిపోయినట్లు తెలుస్తోంది. దీంతో మృతిచెందిన ఎద్దును వెంటనే అక్కడ నుంచి మాయం చేశారు.

స్థానికుల్లో ఆందోళన... 

కాల్పుల ఘటనలకు పాల్పడింది బడాబాబులు, పలుకుబడి, ఆర్థికంగా బాగా ఉన్న వారు కావటంతో కేసు ముందుకు సాగటంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పై నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగానే ఈ కేసు దర్యాప్తులో పురోగతి కనిపించటంలేదని సమాచారం. ఏది ఏమైనా.. గన్‌ కల్చర్‌ మంచిది కాదని.. ప్రభుత్వం, పోలీసులు ఈ సంఘటనను కుక్కలు, పశువులపై వేటగానే చూడకుండా తీవ్రంగా పరిగణించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. వీరిని ఉపేక్షిస్తే మున్ముందు మరిన్ని దుర్ఘటనలు చోటుచేసుకునే ప్రమాదముందని   పేర్కొంటున్నారు.

ఫిర్యాదు అందలేదు 

ఇటీవల ఎద్దుపై తుపాకీతో కాల్పులు జరిపి చంపేశారనే విషయంపై మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా కేసు నమోదు చేసి విచారణ చేస్తాం. గతంలో గన్‌తో కుక్కలను వేటాడిన కేసుకు సంబంధించి పురోగతి సాధించాం. త్వరలోనే దీనిపై చార్జిషీటు వేస్తాం.   

– శ్రీనివాస్, డీఎస్పీ, పరిగి 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top