గుట్టుగా గుట్కాదందా !

Illegal Gutka Mafia In Karimnagar - Sakshi

కరీంనగర్, ఆదిలాబాద్‌  ఉమ్మడి జిల్లాల్లో సరఫరా

బీదర్, మహారాష్ట్ర నుంచి సరఫరా

రామగుండం కమిషనరేట్‌లో ప్రధాన సూత్రధారులు

సాక్షి, కరీంనగర్‌ :జగిత్యాల జిల్లాలోని రాయికల్‌ మండల కేంద్రానికి చెందిన షంషొద్దీన్‌ గుట్కా ప్యాకెట్లు సరఫరా చేస్తున్నాడన్న పక్కా సమాచారంతో అక్టోబర్‌ 28న ఎస్సై ఆరోగ్యం ఆధ్వర్యంలో పోలీసులు ఇంటిపై దాడి చేశారు. రూ.64,645 విలువైన గుట్కా సంచులను పట్టుకున్నారు. గుట్కా విక్రేతల గురించి పక్కా సమాచారం అందితేనే వారిపై పోలీసులు దాడి చేసి పట్టుకోగలుగుతున్నారు.కేశవపట్నం మండలంలో గుట్కా దందా సాగిస్తున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన రమేష్, తిరుపతిలను కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ నెల 5న అరెస్టు చేశారు. రూ.1.50లక్షల విలువైన సరుకు స్వాధీనం చేసుకున్నారు.

మారుమూల పల్లెల్లోని ఏ కిరాణ దుకాణంలో అడిగినా.. పట్టణాల్లోని ఏ పాన్‌షాపులో సైగ చేసినా నిషేధిత గుట్కా ప్యాకెట్‌ క్షణాల్లో చేతిలో పడుతోంది. కాస్త తెలిసినవారైతే చాలు.. అసలు ధరకు రెట్టింపు ధరలతో గుట్కాలు విక్రయిస్తూ కొనుగోలుదారుల జేబులు, ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. రాష్ట్ర ఎల్లలు దాటి కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో గుట్కా మాఫియా దందా సాగిస్తున్న తీరు పోలీస్‌ వర్గాలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది సహకారం, రాజకీయ అండదండలతో ఈ దందా మూడు అంబార్లు(పొగాకు ప్యాకెట్‌), ఆరు గుట్కాలతో అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. రామగుండం కమిషనరేట్‌ పరిధిలో గుట్కా కింగ్‌లుగా పేరుపడ్డ ఇద్దరు వ్యక్తులు కేంద్రంగా ఈ దందా కరీంనగర్, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలకు ఏజెంట్ల రూపంలో విస్తరించింది. ఎక్కడ గుట్కా నిల్వలు కనుగొన్నా... వాటికి సంబంధించిన మూలాలు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోనే కనిపిస్తుండడం గమనార్హం. ఈ అక్రమ దందా ద్వారా గుట్కా కింగ్‌లుగా పేరున్న వ్యక్తులు కోట్లకు పడగలెత్తారు. వీరిలో ఒకరు ఇటీవలే జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకొని ఏకంగా అధికార పార్టీ జెడ్పీటీసీగా గెలిచి సత్తా చాటాడు.  

రామగుండం కమిషనరేట్‌ ‘గుట్కాకింగ్‌’లే...
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎక్కడ చూసినా యథేచ్ఛగానే గుట్కా ప్యాకెట్లు లభ్యమవుతున్నాయి. రాష్ట్రంలో గుట్కా, ఖైనీ, అంబర్‌(పొగాకు) వంటి ప్యాకేజ్డ్‌ పొగాకుతో కూడిన పాన్‌మసాలాల విక్రయాలపై నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని ఆసరాగా చేసుకున్న గుట్కాకింగ్‌లు అక్రమ వ్యాపారం ద్వారా రూ.కోట్లు గడిస్తున్నారు. రామగుండం కమిషనరేట్‌లోని గోదావరిఖని, పెద్దపల్లి, మంథని, మంచిర్యాల జిల్లాలోని జన్నారం, మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాల్లో అక్రమంగా స్థావరాలను ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తున్నారు. గోదావరిఖనిలో ‘కింగ్‌’గా పిలవబడే వ్యక్తితోపాటు అతని సోదరుడు ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరు ప్రాంతాల వారీగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని కేశవపట్నం నుంచి ధర్మారం దాకా దందా సాగిస్తున్నారు. పోలీసులతో కూడా మంచి సంబంధాలే నిర్వహిస్తారనే పేరుంది. ఇక మంచిర్యాల జిల్లా జన్నారం కేంద్రంగా సాగుతున్న దందా జగిత్యాల, మానకొండూరు, కరీంనగర్, కాల్వ శ్రీరాంపూర్‌ మొదలుకొని మంచిర్యాల జిల్లాలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. గత మూడేళ్లుగా నిరాటంకంగా సాగుతున్న ఈ దందాతో సదరు గుట్కా అక్రమ రవాణాదారుడు రాజకీయంగా ఎదిగిపోయాడు.

ఇటీవల జరిగిన జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలోని ఓ మండలం నుంచి అధికార పార్టీ జెడ్పీటీసీగా కూడా ఎన్నికయ్యాడు. అన్నీ అనుకూలిస్తే ఎమ్మెల్యే కావాలనేది అతని కోరిక. జెడ్పీటీసీ కాకముందు అతనిని అరెస్టు చేస్తే కనీసం ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఫోన్‌లు చేసే పరిస్థితి. ఇప్పుడు ప్రజాప్రతినిధి కావడంతో అతని అనుచరులు, సోదరుడి ద్వారా దందా నడిపిస్తున్నాడని సమాచారం. కరీంనగర్‌ గంజిలో శ్రీనివాస్‌ అనే ఓ గుట్కా వ్యాపారి గతంలో పెద్ద ఎత్తున దందా సాగించాడు. రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల సరుకు తీసుకొచ్చి కరీంనగర్‌ జిల్లాలో విక్రయించేవాడు. అతడిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసిన తరువాత దందా నుంచి వైదొలిగి, వరంగల్‌ వెళ్లిపోయినట్లు సమాచారం. శ్రీనివాస్‌ దగ్గర శిష్యరికం చేసినవాళ్లే ఇప్పుడు కరీంనగర్‌ గుట్కా రాకెట్‌ను సాగిస్తున్నారు. 

బీదర్‌ నుంచే ఎందుకంటే..
జిల్లాకు పొగాకు పొట్లాలు(అంబార్‌), గుట్కా ప్రధానంగా కర్నాటక, తెలంగాణ సరిహద్దుల్లోని బీదర్‌ నుంచే సరఫరా సాగుతున్నట్లు తెలుస్తోంది. కర్నాటకలో పొగాకు వినియోగంపై నిషేధం లేదు. ఈ మార్గంలో చెక్‌పోస్టులు పెద్దగా లేకపోవడం, రాష్ట్ర సరిహద్దుకు సమీపంలోనే ఉండడంతో రవాణా సులువు కావడంతో అక్కడి నుంచే ఎక్కువగా సరఫరా అవుతోంది. ఇతర ప్రాంతాల్లో లభ్యమయ్యే ధర కంటే బీదర్‌లో తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో అక్రమార్కులకు ఇక్కడి నుంచి తీసుకువస్తే మరింత ఎక్కువ గిట్టుబాటవుతోంది. అక్కడ బస్తాల చొప్పున అంబార్, గుట్కా ప్యాకెట్లను తీసుకొచ్చి ఉమ్మడి జిల్లాలోని రహస్య స్థావరాల్లో నిల్వ చేస్తున్నారు. అనుమానం రాకుండా ఇళ్లలోనే బస్తాలను భద్రపర్చి తక్కువ మొత్తంలో ఆటోలు, కార్లు, బైక్‌ల్లో జిల్లాలోని నలుమూలలకు సరఫరా చేస్తున్నారు. 200 గుట్కా ప్యాకెట్ల చొప్పున ఉండే ఒక్కో బస్తాకు రూ.12వేల నుంచి రూ.15 వేలకు బీదర్‌లో కొనుగోలు చేసి రైళ్లు, కార్ల ద్వారా జిల్లాకు తీసుకొచ్చాక ఒక్కో బస్తాను రూ.20 నుంచి రూ.25 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం.

కార్లలో పదుల సంఖ్యలో సంచులను తరలిస్తూ రోజుకు రూ.లక్షల్లో ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. సులువుగా పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తూ అందులోంచి కొంత మొత్తాన్ని స్థానికంగా పోలీసులు, క్షేత్రస్థాయి సిబ్బందికి సమర్పించడంతోనే వారు మామూలుగా తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పక్కా సమాచారం అందితేనే దాడులు నిర్వహించి అక్రమ వ్యాపారులను పోలీసులు పట్టుకుంటున్నారు. కొందరిని కేసులు నమోదు చేయకుండానే విడిచిపెడుతుండడంతో వారు దందా కొనసాగిస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో పట్టుపడిన అక్రమార్కులకు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో జిల్లాలో గుట్కా దందా జోరుగా సాగుతోంది. 

తెలిసినా గప్‌చుప్‌
జిల్లాలో గత కొద్దికాలంగా సాగుతున్న గుట్కా వ్యాపారంపై పోలీస్, విజిలెన్స్‌ అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన ఉంటోంది. ఉన్నతాధికారులకు విషయాన్ని పొక్కనీయకుండా గుట్కా మాఫియా వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారు. రామగుండం, కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌లు, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల పరిధిలోని పలు మండలాల్లో నడుస్తున్న గుట్కా దందాలో కిందిస్థాయి సిబ్బంది సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. సిరిసిల్ల జిల్లాకు మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌ జిల్లా మీదుగా అక్రమంగా రవాణా జరుగుతోంది. 

స్థానికంగా కార్లు, ఆటోలు, బైకుల ద్వారా
పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు, ఎవరికీ అనుమానం రాకుండా గుట్కా దందా సాగించేందుకు అక్రమార్కులు సరికొత్త వ్యూహాలను అమలుచేస్తున్నారు. ప్యాసెంజర్‌ ఆటోలు, కార్లలో గుట్కా సంచులను తరలిస్తున్నారు. జిల్లాలోని మండలాలు, గ్రామాలకు పంపిణీ చేసేందుకు బైక్‌లను వినియోగిస్తున్నా రు. పట్టపగలే ఈ దందా సాగుతున్నా నిఘా మాత్రం కరువైంది. జిల్లాకు ప్రధానంగా మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దుల నుంచే గుట్కా సరఫరా జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీదర్‌ కేంద్రంగా ఎక్కువ పొగాకు, గుట్కా ప్యాకెట్లు జిల్లాకు వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల జిల్లాల నుంచి జిల్లాకు గుట్కా చేరుకుంటోంది. అక్కడి నుంచి కార్లు, ఆటోలు, బైక్‌లు, అశోక్‌ లైలాండ్, అప్పి ఆటోల్లో పట్టపగలే ఎల్లలు దాటిస్తున్నారు.

కేసులు నమోదు చేస్తున్నాం.. 
జిల్లాలోని అక్రమ వ్యాపారాలపై పోలీసు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నిరంతరం దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేస్తున్నారు. అక్రమ వ్యాపారాలపై ఎవరైనా సమాచారం అందిస్తే వెంటనే పట్టుకుంటాం. చెప్పినవారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.
– రాహుల్‌ హెగ్డే,  ఎస్పీ, రాజన్న సిరిసిల్ల జిల్లా

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top