జల్సా కోసం వెళ్లి శవమయ్యాడు

Hyderabad Young Man Died In Goa - Sakshi

గోవాలో నగర యువకుడి మృతి

అధిక మోతాదులో డ్రగ్స్‌ తీసుకున్నందునే

ఎండీఎంఏ సేవించాడన్న మృతుడి సోదరుడు

సిటీలోని సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు రానున్న నమూనాలు

సాక్షి, సిటీబ్యూరో: జల్సా చేసేందుకు సిటీ నుంచి గోవా వెళ్లిన ఓ యువకుడు శవమయ్యాడు. అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును అక్కడి అంజున పోలీసులు ఛేదించారు. డ్రగ్స్‌ అధిక మోతాదులో తీసుకోవడంతోనే మరణం సంభవించినట్లు తేల్చారు. పోస్టుమార్టం నివేదికతో పాటు అతడి సోదరుడు సైతం ఇదే విషయాన్ని ఖరారు చేశాడు. మృతుడి శరీరం నుంచి సేకరించిన నమూనాలను తదుపరి పరీక్షల నిమిత్తం నగరంలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి (సీఎఫ్‌ఎస్‌ఎల్‌) పంపాలని గోవా పోలీసులు నిర్ణయించారు. అనివార్య కారణాల నేపథ్యంలో మృతుడి పేరు, వివరాలను అక్కడి పోలీసులు పూర్తి గోప్యంగా ఉంచారు. నగరానికి చెందిన ఓ 24 ఏళ్ల యువకుడు తన సోదరుడు, స్నేహితుడితో కలిసి శనివారం గోవా వెళ్లాడు. అర్ధరాత్రి వేళ అక్కడికి చేరుకున్న వీరు అంజున ప్రాంతంలోని ఓ హోటల్‌లో బస చేశారు. ఆదివారం మధ్యాహ్నం ముగ్గురూ కలిసి అక్కడ ఓ ప్రముఖ క్లబ్‌కు వెళ్లారు. మధ్యాహ్న 1.30 గంటల వరకు క్లబ్‌లోనే ఉన్న వీరు ఆపై హోటల్‌ రూమ్‌కు వెళ్లిపోయారు.

మరో గంట తర్వాత మళ్లీ అదే క్లబ్‌కు వచ్చారు. కొద్దిసేపటికే అస్వస్థతకు గురైన 24 ఏళ్ల యువకుడు హఠాత్తుగా స్ఫృహతప్పి కిందపడిపోయాడు. దీనిని గుర్తించిన అతడి సోదరుడు, స్నేహితుడు హుటాహుటిన గోవా మెడికల్‌ కాలేజ్‌ (జీఎంసీ) ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి వరకు అతడిని బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీనిపై స మాచారం అందుకున్న అంజున పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మరణం తీరుతెన్నులను బట్టి డ్రగ్స్‌ ప్రభావమే అని భావించినా... తొలుత దీనికి సంబంధించి వారికి ఎలాంటి ఆధారాలు లభించలేదు.

క్లబ్‌ మేనేజర్‌తో పాటు యువకుడి సోదరుడు, స్నేహితులనూ విచారించినా, సీసీ కెమెరా ఫుటేజ్‌లు పరిశీలించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మృతదేహానికి జీఎంసీ ఆస్పత్రిలోనే సోమవారం పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే మెదడులోకి నీరు భారీగా చేరడంతోనే (సెరిబ్రల్‌ ఎడేమా) మరణం సంభవించినట్లు తేల్చారు. దీంతో పోలీసులు మృతుడి సోదరుడిని మంగళవారం మరోసారి లోతుగా విచారించారు. తన సోదరుడు ఎక్స్‌టసీగా పిలిచే ఎండీఎంఏ డ్రగ్‌ను ఎక్కువగా సేవించినట్లు తెలిపాడు. మిగిలిన డ్రగ్‌ కోసం వీరు బస చేసిన హోటల్‌ గదిలోనూ పోలీసులు సోదాలు చేశారు. మృతుడి శరీరం నుంచి సేకరించిన విస్రా నమూనాలను తదుపరి పరీక్షల నిమిత్తం గోవా పోలీసులు నగరంలోని సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపాలని నిర్ణయించారు. ఆ యువకుడిని డ్రగ్‌ ఎక్కడ నుంచి వచ్చిందనే కోణంలో అంజున పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top