నోట్లో బీరు పోసి.. ప్రమాదంగా చిత్రీకరించు!

Hyderabad Police Collects Key Points In Chigurupati Jayaram Murder Case - Sakshi

జయరామ్‌ హత్యకేసులో రాకేష్‌కు పోలీసు అధికారుల సలహా 

హత్య తర్వాత కారులో శవంతోనే నల్లకుంట ఠాణాకు రాకేష్‌ 

ఇన్‌స్పెక్టర్, ఏసీపీలతో ఫోన్‌లో మాట్లాడిన నిందితుడు 

వారి సూచనలతో డ్రంకెన్‌ డ్రైవ్‌ ప్రమాదంగా చిత్రీకరించాలని నిర్ణయం 

క్రైమ్‌ సీన్‌ ఏపీకి మారిస్తే మంచిదన్న సలహాతో విజయవాడ వైపు పయనం 

రాకేష్, శ్రీనివాస్‌ తొలి రోజు విచారణలో వెలుగులోకి కీలకాంశాలు 

శిఖాచౌదరి పాత్రపైనా ఆరా.. ఆమెనూ విచారించిన అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌: ‘‘శవం నోట్లో మద్యం పోసి, ప్రమాదంగా చిత్రీకరించు. ఈ క్రైమ్‌ సీన్‌ ఆంధ్రప్రదేశ్‌కు మారిస్తే మంచిది. కారులో శవాన్ని తీసుకుని ఒక్కడివే వెళ్లు. టోల్‌గేట్ల వద్ద, మద్యం కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు’’– కోస్టల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ చిగురుపాటి జయరామ్‌ హత్య కేసు నిందితుడు రాకేష్‌రెడ్డికి పోలీసు అధికారులు ఇచ్చిన సూచనలివి. జయరామ్‌ గతనెల 31న జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10లోని రాకేష్‌ ఇంట్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాకేష్‌తోపాటు మరో నిందితుడు శ్రీనివాస్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు మూడు రోజులపాటు కస్టడీలోకి తీసుకున్నారు. తొలిరోజు బుధవారం వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్, దర్యాప్తు అధికారిగా కె.శ్రీనివాసరావు జరిపిన విచారణలో పలు కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. జయరామ్‌ను హత్య చేసిన తర్వాత కొన్ని గంటల పాటు శవాన్ని కారులో వేసుకుని నగరంలోనే సంచరించినట్లు వెల్లడైంది. 

పథకం ప్రకారం రప్పించి... 
గతంలో జయరామ్‌పై కేసు నమోదు కావడంతో ఆయన కొన్నాళ్లు జైల్లో ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత ఆర్థిక అవసరాల నిమిత్తం తన మేనకోడలు శిఖా చౌదరికి సన్నిహితుడైన రాకేష్‌ నుంచి మూడు దఫాల్లో రూ.4.17 కోట్లు అప్పుగా తీసుకున్నారు. వడ్డీతో కలిపి మొత్తం రూ.6 కోట్లు గతేడాది అక్టోబర్‌లో ఇవ్వాల్సి ఉండగా జయరామ్‌ స్పందించలేదు. ఈ నేపథ్యంలో గతనెల 29న జయరామ్‌ నగరానికి వచ్చినట్టు తెలియడంతో ఫోన్‌ ద్వారా ఆయన్ను సంప్రదించేందుకు రాకేష్‌ ప్రయత్నించి విఫలమయ్యాడు. ఉద్దేశపూర్వకంగానే జయరామ్‌ తనను పట్టించుకోవట్లేదని భావించి, ఆయన్ను ట్రాప్‌ చేయడానికి ఓ కొత్త సిమ్‌కార్డు తీసుకుని వీణ పేరుతో చాటింగ్‌ చేశాడు. తర్వాత పథకం ప్రకారం గతనెల 30న జయరామ్‌ను ఒంటరిగా తన ఇంటికి రప్పించి నిర్బంధించాడు.

ఆ మరుసటి రోజు వరకు అక్కడే ఉంచాడు. 31న మధ్యాహ్నం డబ్బు విషయంలో జరిగిన గొడవ నేపథ్యంలో రాకేష్‌ దాడి చేయడంతో జయరామ్‌ ప్రాణాలు కోల్పోయారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వాచ్‌మన్‌ శ్రీనివాస్‌ సహకారంతో శవాన్ని కారులో ఎక్కించుకుని సాయంత్రం వరకు నగరంలోని అనేక ప్రాంతాల్లో తిరిగాడు. తన స్నేహితుడైన ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులును కలవడానికి నల్లకుంట ఠాణాకు వెళ్లిన రాకేష్‌.. శవం ఉన్న కారుతో అక్కడే దాదాపు 40 నిమిషాలు వేచి చూశాడు. ఆ సమయంలో ఇన్‌స్పెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌లో ఆయనతోపాటు ఏసీపీ మల్లారెడ్డిని సంప్రదించాడు. వీరిద్దరూ ఇచ్చిన సలహా మేరకు ఈ హత్యను డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ నేపథ్యంలో జరిగిన ప్రమాదంగా చిత్రీకరించాలని పథకం వేశాడు. ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌ ఇచ్చిన సలహాల మేరకు జయరామ్‌ శవం నోట్లో, వస్త్రాల పైనా మద్యం పోయడంతో పాటు ఆయన కారులో, చేతుల్లో మద్యం సీసాలు ఉంచాలని నిర్ణయించుకున్నాడు.

అప్పటికే తాను విజయవాడ వస్తున్నట్లు జయరామ్‌ తన ఉద్యోగులకు సమాచారం ఇచ్చాడన్న సంగతి తెలుసుకున్న రాకేష్‌.. అదే విషయాన్ని ఈ ఖాకీలకు చెప్పాడు. దీంతో క్రైమ్‌ సీన్‌ను ఏపీకి మారిస్తే మంచిదని వారు సలహా ఇవ్వడంతో మృతదేహం ఉన్న కారును తీసుకుని విజయవాడ వైపు బయలుదేరాడు. మద్యం ఖరీదు చేయడానికి, కారుతో సహా శవాన్ని వదిలేయడానికి అనువైన ప్రదేశాన్ని వెతుక్కుంటూ నందిగామ వరకు వెళ్లాడు. 31వ తేదీ రాత్రి 10.30 గంటల ప్రాంతంలో నందిగామ పాతబస్టాండ్‌ వద్ద ఉన్న విజయబార్‌కు వెళ్లి మద్యం బాటిళ్లు కావాలని కోరాడు. వారు మద్యం ఇవ్వడానికి నిరాకరించడంతో బీరు సీసాలు కొనుగోలు చేసుకుని తిరిగి కారులో బయలుదేరాడు. ఐతవరం వద్దకు చేరుకున్న తర్వాత వాహనాన్ని రోడ్డు పక్కగా ఆపి, వెనుక సీట్లో ఉన్న మృతదేహాన్ని డ్రైవింగ్‌ సీటులోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో శవం నోట్లో, వస్త్రాలపై బీరు పోసి.. జయరామ్‌ చేతిలో బీరు సీసా పెట్టాడు. అనంతరం కారును రోడ్డు మార్జిన్‌ కంటే కిందికి తీసుకెళ్లి వదిలేశాడు. అక్కడ నుంచి బస్సులో తిరిగి హైదరాబాద్‌ వచ్చేశాడు.  

ఆ డబ్బుపై పోలీసుల ఆరా... 
ఈ కేసులో మరో అనుమానితురాలిగా ఉన్న జయరామ్‌ మేనకోడలు శిఖా చౌదరికీ నోటీసులు జారీ చేసిన పోలీసులు బుధవారం ఆమెను బంజారాహిల్స్‌ ఏసీపీ కార్యాలయానికి పిలిపించారు. మహిళా పోలీసుల సహకారంతో ఇద్దరు నిందితులతో కలిపి ఆమెను విచారించారు. దర్యాప్తు అధికారులు ప్రధానంగా రూ.4.17 కోట్ల విషయాన్ని కూపీ లాగుతున్నారు. ఆ నగదు ఎవరిది? ఎక్కడ నుంచి తీసుకొచ్చారు తదితర అంశాలు ఆరా తీస్తున్నారు. భారీ మొత్తం కావడంతో దీనిపై ఆదాయపుపన్ను శాఖ అధికారులకూ సమాచారం ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగే ఈ హత్యలో శిఖా చౌదరి పాత్ర ఏమైనా ఉందా? అనే అంశాన్నీ ఆరా తీస్తున్నారు. రాకేష్‌ వెల్లడించిన అంశాలు, కాల్‌ డేటాలో లభించిన ఆధారాలను పరిగణలోకి తీసుకుంటున్న పోలీసులు ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు, ఏసీపీ మల్లారెడ్డిలకూ నోటీసులు జారీ చేసి విచారించాలని నిర్ణయించారు. హత్య తర్వాత ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులుతో 13 సార్లు, ఏసీపీ మల్లారెడ్డితో 29 సార్లు సంభాషించినట్లు రాకేష్‌ కాల్‌ రికార్డుల ద్వారా వెల్లడైంది. గురు, శుక్రవారాల్లోనూ రాకేష్, శ్రీనివాస్‌లు తమ కస్టడీలో ఉండనుండటంతో ఆ సమయంలోనే ఇద్దరు ఖాకీలను విచారించాలని యోచిస్తున్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top