ఐదు గంటల్లోనే ఆ మహిళను గుర్తించాం! | Sakshi
Sakshi News home page

ఐదు గంటల్లోనే కిడ్నాప్‌ చేసిన మహిళను గుర్తించాం

Published Wed, Jul 4 2018 4:29 PM

Hyderabad City Police Commissioner Held Meeting Regarding Kidnap Case - Sakshi

హైదరాబాద్‌ : సుల్తాన్‌ బజార్‌ ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 2వ తేదీన 12 గంటల సమయంలో శిశువును కిడ్నాప్‌ చేశారని,  ఐదు గంటల్లోనే కిడ్నాప్‌ చేసిన మహిళను గుర్తించామని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు. శిశువు కిడ్నాప్‌నకు సంబంధించి బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. గతంలో ఈ మహిళ రెండు సార్లు ఇలానే చేసిందని తెలిపారు. కిడ్నాప్‌ జరిగిన విషయం తెలిసిన వెంటనే ఈస్ట్‌ జోన్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారని వివరించారు.

ఈ కిడ్నాప్‌ కేసును సీసీ కెమెరాల ద్వారా తేలికగా చేధించగలిగామని  చెప్పారు. కిడ్నాప్‌ చేసిన మహిళ శిశువును బీదర్‌ తీసుకువెళ్లడంతో బీదర్‌ పోలీసుల సహకారం తీసుకోవాల్సి వచ్చిందని, అలాగే మీడియా సహకారంతో కూడా ఒక రకంగా ఈ కేసును చేధించగలిగామని తెలిపారు. ఐదు గంటల్లో బీదర్‌కి టీం వెళ్లిందని, అక్కడ ఫోటోగ్రఫీ ద్వారా కిడ్నాప్‌ చేసిన మహిళను గుర్తించామని వివరించారు. అక్కడ ద్విచక్రవాహనంలో కిడ్నాపర్‌ వెళ్లినట్లు గుర్తించామని చెప్పారు.
 

ఈ సంచలన కేసులో పని చేసిన మా పోలీసు టీంలకు అభినందనలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆసుపత్రి సూపరిండెంట్‌ను కోరామన్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ చేతనను అభినందిస్తున్నట్లు చెప్పారు. పాప పేరు చేతనగా నామకరణం చేస్తున్నట్లు శిశువు తల్లి చెప్పిందని వెల్లడించారు. కూతుర్ని తన చెంతకు చేర్చిన పోలీసులందరికీ కూడా ఆమె ధన్యవాదాలు తెలియజేసినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి బీదర్‌లో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు.

Advertisement
Advertisement