అదనపు కట్నం ఇవ్వలేదని హతమార్చాడు!

Husband Killed Wife in Kurnool - Sakshi

ముదిగేడులో భార్యను చంపిన భర్త

నోటిలో శనగ మాత్ర వేసి.. చీరతో గొంతు బిగించి హత్య

బంగారం కోసం దొంగలు దుశ్చర్యకు పాల్పడ్డారని నమ్మించేందుకు ప్రయత్నం

పోలీసుల విచారణలో బయటపడ్డ భర్త నిజస్వరూపం

భర్త, అత్తమామలపై కేసు నమోదు

కర్నూలు, సంజామల: వ్యసనాలకు బానిసైన భర్త కట్నం కోసం కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ  ఘటన మండలంలోని ముదిగేడు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సోముల హర్షవర్ధన్‌రెడ్డి అలియాస్‌ సోముల కుళ్లాయిరెడ్డికి వైఎస్‌ఆర్‌ జిల్లా కమలాపురం మండలం నలింగాయపల్లి గ్రామానికి చెందిన సుబ్బిరెడ్డి కుమార్తె సువర్ణతో 2014 జూన్‌ నెల 22వ తేదీన వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.9 లక్షలు కట్నకానుకలు ఇచ్చారు. వీరికి కూతురు హర్షిత(4), కుమారుడు అన్విత్‌రెడ్డి(2)ఉన్నారు. అయితే పెళ్ళయిన ఏడాది నుంచే అదనపు కట్నం కోసం భార్యను వేధించ సాగాడు.  తనకు రూ.30 లక్షలు కట్నం ఇచ్చేవారని తరచూ వేధించేవాడు. ఈ విషయాన్ని సువర్ణ తల్లిదండ్రులకు చెప్పగా  ఒకసారి రూ.6 లక్షలు, మరోసారి రూ. 3 లక్షలు అదనపు కట్నం ఇచ్చారు. అయినా  సంతృప్తి చెందని హర్షవర్ధన్‌ రెడ్డి మళ్లీ అదనపు కట్నం కావాలని భార్యను  వేధించసాగాడు.

సంక్రాంతి పండుగకు ఇస్తామని అత్తమామలు సర్దిచెప్పారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. ఉదయం కూడా టిఫిన్‌ సరిగా చేయలేదని గొడవపెట్టుకున్నాడు. అయితే ముందే చంపాలని నిశ్చయించుకున్న భర్త భార్యను గట్టిగా అదిమిపట్టుకొని శనగల మాత్ర నోట్లో వేశాడు. బలవంతంగా శనగమాత్ర మింగించి నీరు తాగించాడు. అనంతరం చీరను గొంతుకు బిగించి చంపే ప్రయత్నం చేశాడు. భార్యను చంపేందుకు ఒడిగట్టిన భర్త ఆమె చావు బతుకుల్లో కొట్టుమిట్టాడడం చూసి దొంగలు బంగారం కోసం తన భార్యను చంపే ప్రయత్నం చేశారని నమ్మించే ప్రయత్నం చేశాడు. కోవెలకుంట్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సకు వెళ్ళగా పరిస్థితి విషమించిందని చెప్పడంతో అక్కడ నుంచి నంద్యాలకు తరలించే ప్రయత్నంలో మార్గమధ్యలో సువర్ణ మృతి చెందింది. విషయం తెలుసుకున్న కోవెలకుంట్ల సీఐ శ్రీనివాసరెడ్డి ముదిగేడు గ్రామానికి చేరుకొని విచారించాడు. భర్త తీరు పట్ల అనుమానం రావడంతో తనదైన శైలిలో విచారణ చేయడంతో భార్యను చంపేందుకు నోటిలో శనగమాత్రను మింగించి గొంతుకు చీరతో బిగించానని ఒప్పుకున్నాడు. మృతురాలి తండ్రి సుబ్బిరెడ్డి ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ అబ్దుల్‌ ఘనీ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top