
యశవంతపుర : వారికి దేవుడంటే భయం. అందుకే ఆలయంలోని గర్భగుడిలోకి అడుగు పెట్టరు. కేవలం హుండీల్లోని సొమ్ము మాత్రమే చోరీ చేస్తారు. ఆలయాల్లోని హుండీలను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల దొంగల ముఠా పోలీసులకు పట్టుబడింది. మైసూరుకు చెందిన కబ్బాళు అలియాస్ చంద్రు, కుమార అలియాస్ బజాక్, మంజు, విజయకుమార్ అలియాస్ జోగి, బసవ అలియాస్ హరిశ్, పిచ్చగున్న అనే నిందితులను అమృతహళ్లి పోలీసులు శుక్రవారం ఆరెస్ట్ చేశారు.వీరినుంచి రూ.3 లక్షల విలువైన నగలు, రూ.4.50 లక్షల నగదు, మూడు బైకులు, లగేజీ ఆటో స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సిటీకీ సమీపంలో టెంట్ వేసుకోని రాత్రి సమయాల్లో ఆలయాల్లోకి చొరబడి హుండీలను ధ్వంసం చేసి చోరీలకు పాల్పడేవారు. ఇదే క్రమంలో ఈ ఏడాది ఎప్రిల్ 18న అమృతహళ్లి మారెమ్మ ఆలయంలో హుండీని చోర చేశారు. నిందితులు దేవనహళ్లిలో మూడు చోట్ల, చిక్కమగళూరులో రెండు చోట్ల, దావణగెరెలో ఒక చోట చోరీలకు పాల్పడ్డారు. నిందితులు గర్భగుడిలోకి చొరబడకుండా కేవలం హుండీల్లోని సొమ్ము మాత్రమే చోరీ చేసేవారని పోలీసులు తెలిపారు.