ఇంటి దొంగను ‘ఈశ్వరుడే’ పట్టుకున్నాడు!

House Thief Arrested In Markapuram - Sakshi

దేవుని పటం వెనుక దాచిన సొత్తు అపహరణ

బంగారం దొంగతనం కేసులో ఇరువురు ముద్దాయిల అరెస్ట్‌

దొంగతనం పురమాయించింది కుటుంబ సభ్యులే అని విచారణలో వెల్లడి 

వివరాలు వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనేది సామెత. అయితే.. ఇంటివారే దొంగలను ఉపయోగించి దేవుని పటం వెనుక ఉంచిన సొత్తును అపహరించారు. కానీ చివరకు పోలీసులు దొంగలను పట్టుకోవడంతో అసలు బండారం 
బయటపడింది.
 

సాక్షి, మార్కాపురం: పట్టణంలోని పేరంబజార్‌లో ఈ ఏడాది అక్టోబర్‌ 25న గుర్తు తెలియని వ్యక్తులు గృహంలోకి ప్రవేశించి 21 తులాల బంగారం దొంగతనం చేసిన కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు. బుధవారం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. అక్టోబర్‌ 25న ఉదయం 3.30 నుంచి 5 గంటల మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి దేవుడి గదిలో అయ్యప్ప స్వామి పటం వెనుక ఉన్న బంగారు బ్రాస్‌లెట్లు 3, చైన్‌ 1, గాజులు 4, చెవి కమ్మలు 1జత, నల్లపూసల దండలు 2, బంగారు ఉంగరాలు 2 కలిపి మొత్తం 21 తులాల బంగారాన్ని దొంగిలించినట్లు గొట్టెముక్కల శ్రీదేవి అనే మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో  సీఐ కేవీ రాఘవేంద్ర, పట్టణ ఎస్సై కిశోర్‌బాబులు తమ సిబ్బందితో దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్‌ ద్వారా దొంగతనం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఫిర్యాది కుటుంబ సభ్యులను, చుట్టు పక్కల వారిని విచారణ చేసి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఇందులో భాగంగా నిందితులైన విజయవాడకు చెందిన ఓగిరాల సాయి రాజే‹Ù, గుంటూరు జిల్లా వెల్లటూరుకు చెందిన కూరాళ్ల శశాంక్‌లను అరెస్ట్‌ చేశారు. బుధవారం ఉదయం 11గంటల సమయంలో సీఐ రాఘవేంద్ర, ఎస్సై కిశోర్‌బాబులు సిబ్బందితో కలిసి మార్కెట్‌ యార్డు వద్ద సంచరిస్తుండటంతో అదుపులోకి తీసుకున్నారు. 

డామిట్‌.. కథ అడ్డం తిరిగింది.. 
నిందితులను విచారించగా అక్టోబర్‌ 25న అర్ధరాత్రి మార్కాపురం వచ్చామని, ఫిర్యాది కుటుంబ సభ్యుల్లో ఒకరు బంగారు ఆభరణాలను దొంగిలించి వారికి ఇచ్చి దాచి ఉంచాలని చెప్పినట్లు తెలిపారు. బంగారు ఆభరణాలను అమ్ముకుందామని తిరుగుతున్నట్లు వారు తెలిపారన్నారు. దొంగతనం కేసులో ఫిర్యాది కుటుంబ సభ్యులు ఉండటంతో పాటు పరిసర ప్రాంతాల వారిని విచారణ చేయటంతో దొంగతనం కేసు పలు మలుపులకు దారితీసిందని డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ రాఘవేంద్ర, ఎస్సై కిశోర్‌బాబు, సిబ్బందిని ఆయన అభినందించారు. 

కచ్చితమైన సమాచారం ఇవ్వాలి  
మార్కాపురం డివిజన్‌లో ఎలాంటి దొంగతనాలు జరిగినా కచ్చితమైన సమాచారాన్ని పోలీసులకు ఫిర్యాదులో ఇవ్వాలని  డీఎస్పీ తెలిపారు. దొంగతనం సమయంలో పోయిన వస్తువులతో పాటు మరి కొన్ని వస్తువులను జత చేసి ఫిర్యాదు ఇవ్వటం సరికాదన్నారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు గమనిస్తుండాలన్నారు. తప్పుడు కేసులను పోలీసుల దృష్టికి తెచ్చి విలువైన సమయాన్ని వృథా చేయవద్దని పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top