కోడి పందేలు నిషేధం

hen fights ban in ananthapur district - Sakshi

అన్ని సబ్‌ డివిజన్లలో 30 పోలీసు యాక్ట్‌ అమలు

అనంతపురం సెంట్రల్‌: జిల్లాలో ఎక్కడా కోడి పందేలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. కోడిపందేలు కట్టడి చేసేందుకు రెవెన్యూశాఖ, జంతు సంక్షేమబోర్డు సిబ్బందితో కలిసి సమన్వయంగా పనిచేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో నిఘా ఉంచాలని, సర్పంచులు, గ్రామ పెద్దల సహకారంతో సమావేశాలు నిర్వహించి చైతన్యవంతులను చేయాలని కోరారు. గతంలో కేసులున్న వారిని ముందస్తుగా బైండోవర్‌ చేయాలని ఆదేశించారు. మూగ జీవాలను హింసిస్తే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్‌డివిజన్ల పరిధిలో 30 పోలీసుయాక్టు అమలుచేయాలని ఆదేశించారు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి వెల్లకుండా కుటుంబసభ్యులతో కలిసి సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

అనుమతి తప్పనిసరి
జిల్లా కేంద్రంలో మూన్నెళ్లపాటు 30 పోలీసుయాక్టు అ మల్లో ఉంటుందని డీఎస్పీ వెంకట్రావ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అనంతపురం సబ్‌డివిజన్‌ ప్రాంతాల్లో కూడా అమలవుతుందన్నారు. ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహించరాదని సూచించారు. ప్రధాన కూడళ్లలో అంతరాయం ఏర్పడి ప్రజలకు అసౌకర్యం కల్పించేలా దిష్టిబొమ్మలు దహనం చేయరాదని ఆదేశించారు. –డీఎస్పీ వెంకట్రావ్‌ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top