విందు కోసం వెళుతూ..

HCU student Ananya killed in an accident on ORR - Sakshi

     విద్యార్థిని ప్రాణాలు బలిగొన్న అతివేగం 

     శంషాబాద్‌ సమీపంలో కారు బోల్తా 

     డివైడర్‌ దాటి 50 మీటర్లు పల్టీలు కొట్టిన వాహనం 

     హైదరాబాద్‌ వర్సిటీ విద్యార్థిని కన్నుమూత 

     మృతురాలు ఢిల్లీ వాసి.. మరో ఇద్దరికి గాయాలు 

శంషాబాద్‌ రూరల్‌(రాజేంద్రనగర్‌): అతి వేగం ఓ విద్యార్థిని ప్రాణాలు బలితీసుకుంది. స్నేహితుడి పుట్టినరోజు కావడంతో కేక్‌ కట్‌ చేసి విందు కోసం వెళుతుండగా.. కారు అదుపు తప్పింది. డివైడర్‌ను దాటి 50  మీటర్ల వరకూ పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న ఓ యువతి మృత్యువాత పడగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్‌ మండలం బుర్జుగడ్డ తండా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే కారులో మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో ప్రమాదానికి అతివేగంతోపాటు తాగి నడపడం కూడా కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఢిల్లీకి చెందిన అనన్య గోయల్‌(21) హైదరాబాద్‌ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈమెకు నేపాల్‌ వాసి నిఖిత స్నేహితురాలు. ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో ఎంబీఏ చదివేటప్పటి నుంచి వీరిద్దరూ ఒకే రూమ్‌లో ఉండేవారు. జోధ్‌పూర్‌ వాసి జతిన్‌ పవార్‌ వీరితో కలసి ఎంబీఏ చదివాడు. ప్రస్తుతం నిఖిత హైదరాబాద్‌లోనే ఉద్యోగాన్వేషణలో ఉంది. జతిన్‌ కొండాపూర్‌లోని కేపీఎంజీ కంపెనీలో ఇన్‌కంట్యాక్స్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. 

డివైడర్‌పై నుంచి పల్టీలు కొట్టి.. 
సోమవారం జతిన్‌ పుట్టిన రోజు కావడంతో కొండాపూర్‌లో స్నేహితులతో కలసి కేక్‌ కట్‌ చేశారు. అక్కడికి అనన్య, నిఖిత వెళ్లారు. కేక్‌ కటింగ్‌ అనంతరం విందు కోసం బయలుదేరారు. జతిన్‌ వీరిద్దరితో కలసి కారులో కొం డాపూర్‌ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు మీదుగా వచ్చి పెద్ద గోల్కొండ వద్ద జంక్షన్‌ నుంచి కిందకు దిగారు. అక్కడి నుంచి పీ–వన్‌ రోడ్డు మార్గంలో పాల్మాకుల వైపు వెళ్తున్నారు. బుర్జుగడ్డ తండా సమీపంలోకి రాగానే మూల మలుపు వద్ద కారు అదుపుతప్పింది. రోడ్డు డివైడర్‌పై నుంచి పల్టీలు కొడుతూ కుడి వైపు ఉన్న రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు వెనుక సీట్లో కూర్చున్న అనన్య తలకు బలమైన గాయాలవ్వగా.. నిఖిత, జతిన్‌ గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ముగ్గురిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అనన్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనన్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

ప్రాణాలు కాపాడిన సీటు బెల్టు 
కారు డివైడర్‌పై నుంచి 50 మీటర్ల దూరం వరకు వెళ్లి రోడ్డు అవతలి వైపు పడింది. ఈ సమయంలో జతిన్‌ డ్రైవింగ్‌ చేస్తుండగా.. నిఖిత ముందు సీట్లో కూర్చుంది. వీరిద్దరూ సీటు బెల్టు పెట్టుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెనక సీట్లో కూర్చున్న అనన్య సీటు బెల్టు ధరించకపోవడంతో కారు బోల్తా పడిన సమయంలో కింద పడి తలకు తీవ్ర గాయాలై మృతి చెందింది. కాగా, కారు నడుపుతున్న జతిన్‌ మద్యం సేవించినట్లు అనుమానిస్తున్నారు. కారులో ఖాళీ మద్యం సీసాలు బయటపడటంతో జతిన్‌ రక్త నమూనాలను సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

అయ్యో అనన్య.. ఎంత ఘోరం!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top