మాటలతో మాయ చేస్తాడు

Harish Arrest in Cheating Case With Software Jobs Hyderabad - Sakshi

చదివింది ఏడో తరగతి విప్రోలో టీం లీడర్‌గా బిల్డప్‌

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల పేరుతో టోకరా నిందితుడి అరెస్టు

రాంగోపాల్‌పేట్‌: అతను చదివింది ఏడో తరగతి.. విప్రోలో టీం లీడర్‌గా పని చేస్తున్నట్లు బిల్డప్‌. సూటు, బూటు, వేష భాషలతో కనికట్టు చేస్తాడు. వీఐపీలతో సెల్ఫీలు దిగి అందరితో పరిచయాలున్నాయంటూ నమ్మిస్తాడు...తన పలుకుబడితో సాప్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని గోపాలపురం పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లా, వావిలాలపల్లికి చెందిన రిషిరెడ్డి అలియాస్‌ హరీష్‌ 7వ తరగతితో చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. తండ్రి హెచ్‌ఎంగా పనిచేస్తూ కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. తల్లి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తోంది.

జల్సాలకు అలవాటు పడిన హరీష్‌ 2016లోనే ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. అప్పటి నుంచి పలువురు ప్రముఖులు, మంత్రులు, వీఐపీలతో ఫొటోలు దిగుతూ వాటిని చూపి అమాయకులను మోసం చేసేవాడు. తాను విప్రో కంపెనీలో టీం లీడర్‌గా పనిచేస్తున్నానని ప్రచారం చేసుకునే అతను విప్రోతో పాటు ఇతర సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో పెద్ద జీతంతో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి వారి నుంచి రూ.లక్షలు వసూలు చేసేవాడు. ఆ డబ్బుతో విల్లాలు, స్టార్‌ హోటళ్లలో బస చేస్తూ విలాసవంతమైన జీవితం గడిపేవాడు.

గత కొన్నేళ్లుగా కరీంనగర్, నిజామాబాద్, ఎల్లారెడ్డి, గోదావరిఖని ప్రాంతాల్లో దాదాపు 50 మందిని ఇదే తరహాలో మోసం చేశాడు. ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఆరుగురు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యా యి. గత జూలైలో హైదరాబాద్‌కు మకాం మార్చిన హరీష్‌ సికింద్రాబాద్‌ రెజిమెంటల్‌బజార్‌లోని గణేష్‌ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. తన మాటల మాయాజాలంతో అక్కడున్న వారిని మచ్చిక చేసుకున్నాడు. హోటల్‌ నిర్వాహకుడు సురేష్‌తో పరిచయం పెంచుకున్న అతను అతని బంధువులకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ విప్రో కంపెనీకి తీసుకెళ్లాడు. వారిని కింద ఉంచి పైన ఉండే కార్యాలయంలోకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి తిరిగి వచ్చి ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. అనంతరం నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ అంటగట్టి వారి నుంచి రూ.4లక్షలు తీసుకున్నాడు.

బయటికి వెళ్లి వస్తానని వారి బైక్‌ తీసుకుని వెళ్లిన అతను చెప్పి అక్కడినుంచి పరారయ్యాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు కంపెనీకి వెళ్లి విచారించగా ఆ పేరుతో ఎవరూ పనిచేయడం లేదని చెప్పారు. అతడు ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ కూడా నకిలీదని తేల్చారు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడి కోసం గాలిం పు చేపట్టారు. బుధవారం బాధితుల సమాచారం మేరకు ట్యాంక్‌బండ్‌ నిందితుడు హరీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అతడి నుంచి బైక్, 3తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top