‘చోరీ’ సెర్చ్‌!

Hak I App For Stolen Vehicles And Mobile Database - Sakshi

చోరీ వాహనాలు, సెల్‌ఫోన్ల డేటాబేస్‌ ఏర్పాటు

సెకండ్‌ హ్యాండ్స్‌ ఖరీదు చేసే ముందు తనిఖీ కోసమే..  

మలక్‌పేట ప్రాంతానికి చెందిన ప్రతాప్‌ ఆన్‌లైన్‌లో ఈ–కామర్స్‌ సైట్‌ ద్వారా సెకండ్‌ హ్యాండ్‌ సెల్‌ఫోన్‌ కొన్నాడు. కూకట్‌పల్లి నివాసి శ్రీకాంత్‌ సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌ నుంచి ఓ ద్విచక్ర వాహనం ఖరీదు చేశాడు. ఈ రెండూ చోరీ సొత్తులే కావడంతో కొన్ని రోజుల తర్వాత వీరి వద్దకు వచ్చిన పోలీసులు రికవరీ చేసుకువెళ్లారు. అవి చోరీ వస్తువులని తెలియక కొన్నామని మొత్తుకున్నా ఫలితం లేదు. దీంతో అటు ఖరీదు చేయడానికి వెచ్చించిన డబ్బు, ఇటు వస్తువు రెండూ నష్టపోవాల్సి వచ్చింది. సెకండ్‌ హ్యాండ్‌లో ఏదైనా సెల్‌ఫోన్, వాహనం ఖరీదు చేసే ముందు అవి ఎక్కడైనా చోరీకి గురైనవా? కాదా? అని తెలుసుకోవడానికి ఎలాంటి అవకాశం లేని కారణంగానే ఇలా జరిగింది. ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతో నగర పోలీసు విభాగం ఓ సెర్చ్‌ ఆప్షన్‌ అందుబాటులోకి తెచ్చింది. పోలీసు అధికారిక యాప్‌ ‘హాక్‌–ఐ’లో  ఈమేరకు ‘థెఫ్ట్‌/లాస్ట్‌ ఆర్టికల్‌ సెర్చ్‌’ పేరుతో లింక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కొత్త వస్తువుల క్రమవిక్రయాలు ఏ స్థాయిలో జరుగుతాయో... సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌ సైతం దాదాపు అదే స్థాయిలో ఉంటోంది. తరచు వాహనం/సెల్‌ఫోన్‌ మోడల్స్‌ను మార్చడం కొందరికి హాబీ కావడంతో పాటు కొత్తవి కొనుగోలు చేసుకునే స్థోమత లేని వాళ్ళూ సెకండ్‌ హ్యాండ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో సికింద్రాబాద్, కోఠి, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్, రామ్‌కోఠి, కింగ్‌కోఠి తదితర ప్రాంతాల్లో సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్లు వెలిశాయి. ఇక్కడకు అనునిత్యం అనేక మంది వచ్చి తాము వినియోగిస్తున్న సెల్‌ఫోన్‌/వాహనం అమ్మేయడమో, సెకండ్‌ హ్యాండ్‌కు ఖరీదు చేసుకుని వెళ్ళడమో జరుగుతోంది. దీన్ని చోరులు తమకు అనువుగా మార్చుకుంటున్నారు. సిటీలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనం చేసిన వాహనాలు/సెల్‌ఫోన్లను తీసువచ్చి ఇక్కడ అమ్మేస్తున్నారు. ఇలాంటి చోరీ సొత్తును ఖరీదు చేస్తున్న వినియోగదారులు రికవరీల సందర్భంలో నిండా మునుగుతున్నారు. 

యాప్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు...
ఇలాంటి వ్యవహారాలను పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు విభాగం చోరీ అయిన సెల్‌ఫోన్‌/వాహనాల వివరాలతో పాటు గుర్తుతెలియని వాహనాల జాబితాను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఈ వివరాలు ఏదో ఓ చోట ఉండే ప్రయోజనం శూన్యమని, డేటాబేస్‌ రూపంలో సెర్చ్‌ ఆప్షన్‌తో ఆన్‌లైన్‌ ఏర్పాటు చేసింది. పోలీసు అధికారిక యాప్‌ ‘హాక్‌–ఐ’ ద్వారా ‘థెఫ్ట్‌/లాస్ట్‌ ఆర్టికల్‌ సెర్చ్‌’ పేరుతో ఇది ఏర్పాటైంది. నగరంలోని వివిధ పోలీసుస్టేషన్లలో ఫిర్యాదుల రూపంలో, పోలీసు యాప్‌ ‘లాస్ట్‌ రిపోర్ట్‌’ ద్వారా తమ దృష్టికి వచ్చిన వాహనం/సెల్‌ఫోన్‌ చోరీలు, పోగొట్టుకోవడాలకు సంబంధించిన రిపోర్టుల్ని క్రోడీకరిస్తున్నారు. వీటిని వాహనాలకు సంబంధించిన ఇంజిన్, ఛాసిస్, రిజిస్ట్రేషన్‌ నెంబర్లతో పాటు సెల్‌ఫోన్‌కు సంబంధించి ఐఎంఈఐ నెంబర్లతో ఈ సెర్చ్‌ విభాగంలో ఏర్పాటు చేశారు. 

ఖరీదు చేసే ముందు సెర్చ్‌...
మరోపక్క వాహనాలు/సెల్‌ఫోన్ల పోగొట్టుకున్న వారు సైతం ఈ ‘థెఫ్ట్‌/లాస్ట్‌ ఆర్టికల్‌ సెర్చ్‌’ ద్వారా వాటి వివరాలను డేటాబేస్‌లో పొందుపరచవచ్చు. ఫిర్యాదు చేసినా, ఇలా పొందుపరిచినా తక్షణం ఆ వివరాలు అప్‌డేట్‌ అవుతాయి. ఈ డేటాబేస్‌ హాక్‌–ఐ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం సెకండ్‌ హ్యాండ్‌ వ్యాపారులు తమ వద్దకు ఆయా వస్తువుల్ని  అమ్మడానికి వచ్చే వారి నుంచి వీలైనంత వరకు గుర్తింపుకార్డు ప్రతులు, సెల్‌ఫోన్‌ నెంబర్లని తీసుకుంటున్నారు. నేరగాళ్ళు తెలివిగా వ్యవహరిస్తూ ఇవీ నకిలీవి, తాత్కాలికమైనవి ఇస్తుండటంతో ఆనక ఆయా వస్తువులు చోరీ సొత్తని తెలిసినా వ్యాపారులు, ఖరీదు చేసిన వారు ఏమీ చేయలేక మిన్నకుండిపోవాల్సి వస్తోంది. అయితే ఈ యాప్‌లోని లింకును వినియోగించుకోవడం ద్వారా ఏదైనా సెకండ్‌ హ్యాండ్‌ వాహనం/సెల్‌ఫోన్‌ ఎవరైనా అమ్మడానికి వచ్చినప్పుడు దాని వివరాలు సెర్చ్‌ చేసి చోరీ సొత్తా? కాదా? అన్నది తెలుసుకోవచ్చు. వినియోగదారులు సైతం సెకండ్‌ హ్యాండ్‌వి కొనేప్పుడు ఈ సెర్చ్‌ ద్వారా సరిచూసుకుని ఖరీదు చేసే అవకాశం ఏర్పడింది. 

రానున్న రోజుల్లో దేశ వ్యాప్త లింకేజ్‌...
ప్రస్తుతం ‘థెఫ్ట్‌/లాస్ట్‌ ఆర్టికల్‌ సెర్చ్‌’ లింకులో నగరంలోని చోరీ వాహనాలు/సెల్‌ఫోన్లకు సంబంధించిన వివరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లకు చెందిన వివరాలు పొందుపరచనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ అండ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్స్‌ (సీసీటీఎన్‌ఎస్‌) ప్రాజెక్టు పూర్తయి, లింకేజీ వస్తే దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న పోలీసుస్టేషన్లలోని వివరాలు అందుబాటులోకి వస్తాయి. దీంతో ఓ ప్రాంతం/రాష్ట్రంలో చోరీ చేసి మరో చోట విక్రయించే వారికీ చెక్‌ చెప్పడానికి అవకాశం లభిస్తుంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top