దొంగలు బాబోయ్‌ దొంగలు | Sakshi
Sakshi News home page

దొంగలు బాబోయ్‌ దొంగలు

Published Sat, Jun 2 2018 2:05 PM

Growing Robberies In Parvathipuram - Sakshi

పార్వతీపురం : మున్సిపాలిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా దొంగలు చెలరేగిపోతున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లతో పాటు ఊరికి దూరంగా నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లను టార్గెట్‌ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఉదయం వేళ పట్టణం వ్యాప్తంగా కలియదిరుగుతూ ఎక్కడ తాళాలు వేసి ఇళ్లు ఉన్నాయో, ఊరికి దూరంగా ఎక్కడ ఇళ్లు ఉన్నా యో గుర్తించి రాత్రి సమయంలో పథకం ప్రకారం చోరీలకు పాల్పడుతున్నారు.

ఇటీవల పార్వతీపురం పురపాలకసంఘ పరిధిలోని వైకేఎం కాలనీలో ఒకే రోజు ఏడిళ్లలో దొంగతనాలకు పాల్పడడం సంచలనం రేపింది. అలాగే ఆ సంఘటన జరిగిన రెండోరోజే మళ్లీ నర్సిపురం పంచాయతీ ఓలేటి ఫారం వద్ద తలుపులు వేసి ఉన్న ఇంటిలో చోరీ జరిగింది. రెండురోజుల కిందట 15వ వార్డు అగురవీధిలో పట్టపగలు ఉదయం 8 గంటలకే ఇంటి లో చోరీ జరిగింది. ఇలా వరుస చోరీలతో పట్టణ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఒకపక్క పార్థి గ్యాంగ్‌ తిరుగుతున్నట్లు వాట్సాప్‌లో విస్తృత ప్రచారం జరుగుతున్న సమయంలో ఇలాంటి దొంగతనాలు జరగడం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. 

చుక్కలు చూపిస్తున్న దొంగలు...

వరుస దొంగతనాలతో దొంగలు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. నిఘా విభాగం ఎంతో అభివద్ధి చెందిన రోజుల్లో కూడా దొంగలు పోలీసుల చేతికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. రాత్రి, పగలు పోలీసులు పహారా కాస్తున్నా వారి కళ్లు గప్పి మరీ దొంగలు తమ చేతికి పనిచెబుతున్నారు. పోలీసులకు ఎటువంటి ఆనవాళ్లు దొరకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలా ఒకదాని వెంట ఒకటి వరుసగా జరుగుతున్న దొంగతనాలతో పోలీసులకు చెమటలు పడుతున్నాయి.

ఇటీవల ఒకేరోజు వైకేఎం కాలనీలో ఏడు ఇళ్లలో దొంగతనాలు జరగడంతోనే ఆ ప్రభావం పట్టణ ఎస్సై ఎం. రాజేష్‌పై పడిందని.. అందులో భాగంగానే ఆయన ఇక్కడ నుంచి బదిలీ చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

సమాచారం ఇవ్వాలి

దూర ప్రాంతాలకు వెళ్లేవారు ముందస్తుగా సమీపంలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సమీపంలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి వీధుల్లో అనుమానాస్పదంగా తిరిగే వారిని గుర్తిస్తాం. దీంతో వెంటనే సిబ్బంది ఆయా ప్రాంతాలకు క్షణాల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. ఇంటిలో లేనప్పుడు విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉంచకూడదు.

– ఎం. దీపికాపాటిల్, పార్వతీపురం ఏఎస్పీ 

 కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

ప్రస్తుతం సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతున్న తరుణంలో బహుళ అంతస్తులు, గ్రూప్‌ హౌస్‌ల్లో ఉన్నవారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. కెమేరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరస్తులను సులువుగా పట్టుకోవచ్చు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇస్తే ఇంటిపై నిఘా పెడతాం. – జి.రాంబాబు, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ .


 

Advertisement
Advertisement