పనిచేసే సంస్ధకు రూ 38 కోట్లు టోకరా..

Goldman Sachs Excutive Arrested For Cheating - Sakshi

బెంగళూర్‌ : ఆన్‌లైన్‌ గేమ్‌లో ఎదురైన నష్టాలను పూడ్చేందుకు తాను పనిచేస్తున్న కంపెనీకి రూ 38 కోట్లు టోకరా వేసిన గోల్డ్‌మాన్‌ శాక్స్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గోల్డ్‌మాన్‌ శాక్స్‌ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ అశ్వని ఝంఝన్‌వాలాను కంపెనీని మోసగించిన ఆరోపణలపై అరెస్ట్‌ చేశామని డిప్యూటీ కమిషనర్‌ ఎంఎన్‌ అనుచేత్‌ వెల్లడించారు. కంపెనీ లీగల్‌ హెడ్‌ అభిషేక​ పర్షీరా ఫిర్యాదుపై అశ్వనితో పాటు ఆయన అనుచరుడిని అరెస్ట్‌ చేశామని తెలిపారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన కింది ఉద్యోగులు గౌరవ్‌ మిశ్రా, అభిషేక్‌ యాదవ్‌, సుజిత్‌ అప్పయ్యల సహకారంతో అశ్వని కంపెనీ డబ్బును స్వాహా చేశాడు. శిక్షణ పేరుతో వారి ఆఫీస్‌ సిస్టమ్స్‌లో అశ్వని లాగిన్‌ అయ్యేవాడని, వారిని మంచినీళ్లు తీసుకురమ్మని, ఇతర పనులను అప్పగించి నిధుల దోపిడీకి పాల్పడేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఇండస్ర్టియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు అక్రమంగా రూ 38 కోట్ల సంస్థ నిధులను బదిలీ చేశాడని ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచారు. గతంలో అవకతవకలకు పాల్పడి కంపెనీ నుంచి తొలగించబడిన ఉద్యోగి వేదాంత్‌ కూడా అశ్వనికి నిధుల మళ్లింపులో సహకరించాడని పోలీసులు చెప్పారు. ఈనెల 6న ఇంటర్నల్‌ ఆడిట్‌లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. అశ్వని ఝంఝన్‌వాలా ఆన్‌లైన్‌ పోకర్‌ గేమ్‌లో రూ 49 లక్షలు పోగొట్టుకున్నాడని, రూ 25 లక్షల రుణంతో పాటు పలువురి వద్ద వ్యక్తిగత రుణాలు తీసుకున్నాడని కంపెనీ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top