
ఇండోర్: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు భయ్యూ మహారాజ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. మంగళవారం ఇండోర్‌లోని తన నివాసంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని ఇండోర్ డీఐజీ హెచ్‌సీ మిశ్రా తెలిపారు. ఇంట్లోని ఒక గదిలో తలుపులు గడియ పెట్టి భయ్యూ మహారాజ్ ఆత్మహత్య చేసుకున్నారని, తలుపులు బద్దలుగొట్టి బయటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారని చెప్పారు.
భయ్యూ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు. ఆయన గదిలో ఓ నోట్‌ను స్వాధీనం చేసుకున్నామని, అందులో తీవ్రమైన ఒత్తిడిని తాను ఎదుర్కొంటున్నానని, కుటుంబ బాధ్యతలను ఎవరైనా తీసుకోవాలని కోరారు. నోట్‌లోని దస్తూరీ మహారాజ్‌దే అని ఆయన కుటుంబ సభ్యులు నిర్ధా రించారు.. పోస్టుమార్టం కోసం భౌతికకాయాన్ని ఎంవై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మంత్రి హోదాను తిరస్కరించి..
ఏప్రిల్‌లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కల్పించిన సహాయ మంత్రి హోదాను రెండు నెలల క్రితం భయ్యూ తిరస్కరించడం తెల్సిందే. యోగులకు ఆ పదవితో ఎటువంటి ఉపయోగం లేదని పేర్కొంటూ దానిని తీసుకునేందుకు నిరాకరించారు. 50 ఏళ్ల భయ్యూ అసలు పేరు ఉదయ్‌సింగ్ దేశ్‌ముఖ్. మధ్యప్రదేశ్‌లోని సుజల్‌పూర్‌లో వ్యవసాయ కుటుంబంలో 1968లో జన్మించారు. ఆయన మొదటి భార్య మాధవి 2015 నవంబర్‌లో మరణించారు. గత ఏడాది డాక్టర్ ఆయుషి శర్మను పెళ్లాడారు.
మొదటి భార్య ద్వారా ఆయనకు ఒక కుమార్తె ఉన్నారు. సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో భయ్యూ మహారాజ్‌కు వేల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. రాజకీయ నాయకులు, సినీ నటులతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భాగవత్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ థాక్రే తదితరులతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. 2011లో అన్నా హజారే లోక్‌పాల్ కోసం ఢిల్లీలో దీక్ష చేసిన సమయంలో ఆందోళనకారులతో చర్చల కోసం మహారాజ్‌పైనే యూపీఏ ఆధారపడింది.
సీబీఐ విచారణ జరిపించాలి: కాంగ్రెస్
భయ్యూ మహారాజ్ ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం తరపున పనిచేయాలని తీవ్ర ఒత్తిడి తీసుకురావడం వల్లే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఇటీవల తనతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తరపున పనిచేయాలని తాను తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు చెప్పారని కాంగ్రెస్ మీడియా విభాగం చీఫ్ మనక్ అగర్వాల్ చెప్పారు.