ఆడపిల్లలు లేనందున చిన్నారి కిడ్నాప్‌.. | Sakshi
Sakshi News home page

చిన్నారి కిడ్నాప్‌ కథ సుఖాంతం

Published Sat, Aug 17 2019 7:57 AM

Girl Child Kidnap Case Reveals in Hyderabad - Sakshi

రాంగోపాల్‌పేట్‌: ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. పరిచయస్తుడని పాపను చూసుకోమని అప్పగించి వెళ్లితే ఆమెను ఎత్తుకెళ్లిన విషయం విదితమే. శుక్రవారం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి పాపను రక్షించారు. రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో సైఫాబాద్‌ ఇన్‌చార్జి ఏసీపీ ముత్యంరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ టీసీహెచ్‌ బాబుతో కలిసి వివరాలు వెల్లడించారు. యాప్రాల్‌ భాగ్యనగర్‌కాలనీకి చెందిన రాజు,   హజీరా దంపతులు ఈ నెల11న తమ కుమర్తె ఫాతిమాను తీసుకుని నీలోఫర్‌ ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. సాయంత్రం తిరిగి వెళుతుండగా బాలానగర్‌ బస్టాప్‌ సమీపంలో రాజుకు పరియస్తుడైన షేక్‌ సలీం కనిపించాడు. అందరూ కలిసి ప్యారడైజ్‌ ప్రాంతంలోని బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూమ్‌ నిద్రకు ఉపక్రమించారు. ఉదయం బక్రీద్‌ నేపథ్యంలో యాచించేందుకు మసీదు వద్దకు వెళ్లారు. అనంతరం పాపకు పాలు తెచ్చేందుకు ఫాతిమను సలీంకు అప్పగించి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి సలీం పాపతో సహా పరారయ్యాడు.  

పట్టించిన సీసీ కెమెరాలు...
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. 20 ప్రత్యేక బృంధాలను ఏర్పాటు చేశారు. వందకు పైగా సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడు కిషన్‌బాగ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనంతరం వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.  

ఆడబిడ్డను పెంచుకోవాలనే
నిందితుడు సలీంకు ముగ్గురు కుమారులు ఉన్నారు. తనకు ఆడపిల్లలు అంటే ఇష్టమని పెంచుకోవాలనే తీసుకుని వెళ్లినట్లు తెలిపాడు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమావేశంలో అదనపు ఇన్‌స్పెక్టర్‌ గడ్డం కాశీ, డీఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement