చిర్రావూరు.. కన్నీటి ఏరు

Four Studets Died In Krishna River - Sakshi

కృష్ణానదిలో పడి నలుగురు విద్యార్థుల మృత్యువాత   

టీడీపీ నేతల తవ్వకాలతో ఏర్పడిన అగాధాలు

లోతు తెలియక మునిగిన చిన్నారులు            

మృతులంతా చిర్రావూరు వాసులే..

ఊరు.. ఊరంతా కన్నీటి ఉప్పెనైంది. బుధవారం తూరుపు దిక్కు తొలి పొద్దు పొడుపుతో తెల్లారిన       చిర్రావూరు.. సాయంకాలం వేళ పగిలిన గుండెల విషాదాన్ని మోసుకుంటూ పడమటి దిక్కున వాలిపోయింది. తాడేపల్లి మండలం చిర్రావూరుకు చెందిన నలుగురు విద్యార్థుల ప్రాణాలను గుండిమెడ వద్ద కృష్ణానదిలో తవ్విన మృత్యు అగాధం మింగేసింది. ఉదయాన్నే.. అమ్మా ఆడుకుంటామంటూ వెళ్లిన బిడ్డల ఆకలిని తమ పేగుల్లో నింపుకొని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు.. గుండె పగిలే విషాదం గుమ్మం వద్దే ఎదురొచ్చింది. కృష్ణమ్మ ఒడ్డున కన్నీటి ఒత్తులతో మిణుకు మిణుకుమంటున్న వారి ఆశ.. ఆయువు తీరిన దేహాలను చూసి అక్కడే ఆవిరైపోయింది. నవ్వుల గలగలలతో తన చెంతకు చేరిన విద్యార్థులను చూసి మురిసిన కృష్ణమ్మ.. మునిగిపోతున్న బిడ్డల ప్రాణాలను కాపాడలేక బాధాతప్త సెలయేరై కదిలిపోయింది. నలుగురు బిడ్డల మృత్యు ఘోష నలుదిక్కులా ప్రతిధ్వనిస్తుండగా చలించిన ప్రతి హృదయం గుండెలు బాదుకుంటూ వెక్కివెక్కి ఏడ్చింది.  

తాడేపల్లిరూరల్‌: ఇసుక క్వారీ గుంతలు నలుగురు విద్యార్థులను కబళించాయి. అందులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. మృతి చెందిన నలుగురు చిర్రావూరుకు చెందిన వారే. దీంతో గ్రామమంతా శోక సముద్రంలో మునిగిపోయింది. సంఘటన తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో నదీ తీరానికి చేరుకుని గల్లంతైన వారి కోసం అక్కడే పడిగాపులు కాశారు. ఉదయం 8 గంటల సమయంలో సంఘటన జరగ్గా, మధ్యాహ్నం ఒంటి గంటకు, అనంతరం మరో మూడు గంటల తేడాతో నాలుగు మృతదేహాల్ని సహాయక బృందాలు బయటకు తీశాయి. తాడేపల్లి మండల పరిధిలోని గుండిమెడ గ్రామ పరిధి ఇసుక క్వారీ గుంతల వద్ద బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వరద నీరు రావడంతో  తాడికోరు శివ (15) స్నేహితులతో కలసి కృష్ణానదికి వెళ్లాలని అనుకున్నాడు. బాబాయి తాడికోరు సురేష్‌కు విషయం చెప్పాడు. అతడు తన గూడ్స్‌ ఆటో తీసుకుని బయలుదేరాడు. ఇంటి పక్కనే నివాసం ఉండే నీలం క్రాంతి (15), నీలం శశివర్ధన్‌ (9), మలమంటి దినేష్‌ (10), హర్షిత, శివపార్వతి, పవన్‌సాయి కూడా ఆటో ఎక్కారు. సురేష్‌ కృష్ణానది తీరానికి రాగానే బహిర్భూమికి వెళ్తూ ఆటోలో నుంచి ఎవరిని  దిగవద్దని హెచ్చరించాడు.

నది మధ్యలో రోడ్డులా కనిపించడంతో నీలం క్రాంతి, నీలం శశివర్ధన్,  మలమంటిæ దినేష్, తాటికోరు శివ అక్కడకు వెళ్లారు. రోడ్డు మధ్యలో కొంత భాగంలో నీళ్లు ప్రవహించడంతో అది దాటి అవతల ఒడ్డుకు వెళదామని నీలం క్రాంతి దిగగా, నీటి ఒరవడికి కొట్టుకుపోసాగాడు. అది చూసిన శశివర్దన్‌ పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతను కూడా జారిపోయాడు. వారిద్దర్నీ రక్షిద్దామని శివ, దినేష్‌లు ప్రయత్నించగా వారు కూడా నీటిలో కొట్టుకుపోయారు. ఇది గమనించిన సురేష్‌ పెద్దగా కేకలు వేస్తూ పారుతున్న నీటి వద్దకు వెళ్లినా వారిని రక్షించలేకపోయాడు. వెంటనే బంధువులకు సమాచారం అందించగా.. అందరూ కృష్ణానది వద్దకు పరుగులు పెట్టారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న గ్రామస్తులు కొంత మంది గుంతల్లో దిగి కాపాడాలని ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఈలోగా అక్కడకు చేరుకున్న పోలీసులు రాష్ట్ర విపత్తు నివారణ దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) సిబ్బందికి సమాచారం ఇచ్చి సంఘటన స్థలానికి పిలిపించారు. వారు మర బోట్లు, రోప్‌ల సాయంతో రెండు గంటలపాటు ముమ్మరంగా గాలించగా తొలుత నీలం క్రాంతి, మరో ఇరవై నిమిషాల వ్యవధిలో నీలం శశివర్ధన్‌ మృతదేహాలు దొరికాయి.

గ్రామస్తుల సాయం
ఇక ఎంత గాలించినా మిగిలిన ఇద్దరి ఆచూకీ తెలియకపోవడంతో సంఘటన జరిగిన క్వారీ గుంతల వద్ద గ్రామస్తులు ఇసుక బస్తాలను వేశారు. పొక్లెయిన్‌ సహాయంతో మట్టిని పోసి నీటి ప్రవాహం సాగకుండా అడ్డుకట్ట కట్టారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు కూడా రంగంలోకి దిగాయి. మధ్యాహ్నం 3.50 గంటలకు దినేష్, శివ మృతదేహాలను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు బయటకు తీసుకొచ్చాయి.

గుండెలు పగిలేలా రోదించిన తల్లిదండ్రులు
తమ కొడుకుల మృతదేహాలను చూసి శివ తల్లి లక్ష్మి, క్రాంతి కుమార్, శశివర్దన్‌ల తల్లి శేషకుమారి, దినేష్‌ తల్లి నాగలక్ష్మిలు స్పృహ తప్పి అక్కడే కుప్పకూలిపోయారు. గుంటూరు పార్లమెంట్‌ సభ్యుడు గల్లా జయదేవ్, అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావు పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. స్థానిక ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మి, వైఎస్సార్‌ సీపీ స్థానిక సంస్థల కన్వీనర్‌ దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడేపల్లి, మంగళగిరి మండల పార్టీ కన్వీనర్లు పాటిబండ్ల కృష్ణమూర్తి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి, యువజన నాయకులు మున్నంగి వివేకానందరెడ్డి, చిర్రావూరు పార్టీ కన్వీనర్‌ మేకల సాంబశివరావు, యువజన నాయకులు బాజీ గంగాధర్‌ తదితరులు బాధిత కుటుంబాలను పరామర్శించారు.

ఎమ్మెల్యే ఆర్కే పరామర్శ
నలుగురు విద్యార్థులు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వివిధ శాఖల అధికారులతో ఫోన్‌లో సంప్రదించి, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని కోరారు.  

మంగళగిరి టౌన్‌ : కృష్ణా నదిలో దిగి ప్రమాదవశాత్తు మునిగి చనిపోయిన చిన్నారుల కుటుంబసభ్యుల్ని బుధవారం రాష్ట్రమంత్రి నక్కా ఆనందబాబు మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో పరామర్శించి ఓదార్చారు.  ప్రభుత్వం తరఫున సాయంపై ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

ఈ పాపం ఎవరిది ?
తాడేపల్లి రూరల్‌: ముక్కుపచ్చలారని నాలుగు నిండు ప్రాణాలు... ముగ్గురు తల్లులకు కడుపుకోత... శోకసముద్రంలో యావత్తు గ్రామం... బలి తీసుకుంది అక్రమ ఇసుక క్వారీ గుంతలు... ఈ పాపం ఎవరిది? ఆ తల్లుల కడుపుకోతకు బాధ్యులెవరు? అధికారపార్టీ నేతలా? లేక వారికి వత్తాసు పలుకుతున్న అధికారులా? నిజాలు నిగ్గు తేలాల్సి ఉంది. గుండిమెడ గ్రామ పరిధిలోని ఇసుక క్వారీ వద్ద బుధవారం పరవళ్లు తొక్కే కృష్ణమ్మను చూసేందుకు వెళ్లిన నలుగురు విద్యార్థులు ఇసుక క్వారీ గుంతల్లో పడి మృతి చెందారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, గ్రామస్తులు, స్థానిక మత్స్యకారులు 7 గంటల పాటు వెదికి మృతదేహాల్ని వెదికితీశారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఉండటంతో శోకసముద్రంలో మునిగిపోయింది. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. తాడిచెట్టు లోతు ఉన్న ఆ గుంతల్లో  ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు మృతదేహాల్ని వెదికేందుకు అష్టకష్టాలు పడ్డాయి. గల్లంతైన వారిలో ఒకరైన నీలం క్రాంతికుమార్‌ మృతదేహాన్ని 12:55 గంటలకు బయటకు తీశారు. పెద్ద కొడుకు మృతదేహాన్ని చూడగానే తండ్రి రమేష్‌ హత్తుకొని గుండెలు పగిలేలా దుఃఖించారు. తల్లి శేషకుమారి కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెకు అక్కడే ఉన్న వైద్య బృందం సేవలందించింది. ఈలోగా రెండో కొడుకు శశివర్ధన్‌ మృతదేహాన్ని 1.45గంటలకు బయటకు తీశారు. తల్లి చూడకుండానే అక్కడనుంచి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించడంతో ఆమె బాధ అంతా ఇంతా కాదు.

మరబోట్లతో వెతుకలాట
క్వారీలో అనుమతుల ప్రకారం 3 అడుగులు మేర ఇసుకను తీయాలి. అయితే, క్వారీని నడుపుతున్న టీటీపీ నేతలు 30 అడుగుల వరకు తీయడంతో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది మృతదేహాల్ని వెదకడం తమ వల్ల కాదని చేతులెత్తేశారు. మరబోట్లను తెప్పించినా ఫలితం లేకపోయింది. చివరకు కృష్ణానది ఎగువ ప్రాంతంలో మృతదేహాలను వెలికితీసే కృష్ణ అనే మత్స్యకార యువకుణ్ణి తీసుకువచ్చి వెదికించారు. మొదట మలమంటి దినేష్‌ మృతదేహం లభించింది. తల్లితండ్రులు విగతజీవిగా మారిన తమ కొడుకును చూసుకుని భోరున విలపించారు. ‘ఎక్కడికీ వెళ్లనివాడివి ఈరోజు బయటకు ఎందుకొచ్చావురా నాన్నా’ అంటూ కొడుకును హత్తుకొని రోదించారు. ‘నా కొడుకు చచ్చిపోలేదు.. ఇంకా బతికే ఉన్నాడు.. ఆసుపత్రికి తీసుకువెళ్లండంటూ అక్కడున్న వారిని కాళ్లావేళ్లా బతిమిలాడడంతో ప్రతి ఒక్కరూ కంట తడి పెట్టారు. అనంతరం 3:55 గంటలకు తాడికోరు శివ మృతదేహాన్ని గజ ఈతగాడు కృష్ణ బయటకు తీసుకువచ్చాడు.

కొడుకు మృతదేహాన్ని చూసి తల్లి రోదనలు మిన్నంటాయి. కొడుకు నురగలు కక్కుతుండడంతో ‘బతికే ఉన్నాడు...వైద్యం చేయించ’డంటూ పోలీసులను బ్రతిమిలాడింది. ఆమె బాధను చూడలేక ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నీటిలో మునిగినప్పుడు కాపాడేందుకు చేసే ప్రక్రియనంతా చేశారు. అయినప్పటికీ తన కొడుకు బతికే ఉన్నాడని ఆ తల్లి రోదన మిన్నంటడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చనిపోయాడని నిర్ధారించిన తర్వాత ఆమె ఆసుపత్రి వద్దే కుప్పకూలింది. ఇంతమంది తల్లులకు గర్భకోశాన్ని మిగిల్చిన టీడీపీ నేతలు ఆర్చుకొని, తీర్చుకొని అక్కడకు వచ్చారు. పైపైన హడావుడి చేసి, కపట సానుభూతి చూపించారు తప్పా ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఒక పొక్లెయిన్‌ను కూడా పిలిపించలేదు. గ్రామస్తులు, పోలీసులు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. గ్రామస్తులు చేయిచేయి కలిపి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. వారు కట్ట వేసిన గంట తర్వాత పొక్లెయిన్‌ వచ్చి పైపైన సరిచేసి వెనుదిరిగి వెళ్లింది. అధికార పార్టీ నేతలు కృష్ణమ్మకు తూట్లు పొడిచి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కూడా కనీసం కనికరం లేకుండా వ్యవహరించడంపై  గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top