కుప్పకూలిన హోర్డింగ్‌.. నలుగురి మృతి

Four Killed As Hoarding Falls On Vehicles in Pune - Sakshi

పుణే : సిగ్నల్‌ వద్ద ఆగిఉన్న వాహనాలపై ఆకస్మికంగా ఓ  భారీ హోర్డింగ్‌ కుప్పకూలడంతో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ దారుణ ఘటన శుక్రవారం పుణే రైల్వే స్టేషన్‌ సమీపంలో షాహిర్ అమర్ షేక్ చౌక్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అప్పుడే తన భార్య అస్థికలను కలిపి వస్తున్న ఓ 40 ఏళ్ల వ్యక్తి మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో హోర్డింగ్‌ను తొలగిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు డిప్యూటీ కమిషనర్ బి.సింగ్ తెలిపారు. మృతి చెందిన వారిని కసర్ (70), షామ్ రావ్ ధోట్రె (48), శివాజీ పర్‌దేశీ (40), జావేద్ ఖాన్(40)లుగా గుర్తించారు. 

ఈ ప్రమాదంలో మరణించిన పరదేశీ భార్య గురువారం మృతి చెందింది. శుక్రవారం ఆమె అస్థికలను కలిపేందుకు పరదేశీ, ఆయన కుమారుడు, కుమార్తె, తల్లి కలిసి వెళ్లారు. అనంతరం తిరిగి ఇంటికి వస్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన తమ ఆటోపై హోర్డింగ్ కుప్పకూలింది. ఈ ఘటనలో శివాజీ పరదేశీ అక్కడికక్కడే మృతి చెందారు. రోజు తేడాలో భార్యభార్తలు ఇద్దరూ మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాదం నిండుకుంది. ఆటోలో ఉన్న మిగతా ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఈ ఘటనలో ఐదు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఓ కారు ధ్వంసమైనట్టు అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పారు. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారి తెలిపారు. మధ్యాహ్నసమయంలో అంతగా ట్రాఫిక్‌ ఉండదని భావించి హోర్డింగ్‌ను తొలిగించే పనులు చేపట్టారని, ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటే మరిన్ని భద్రతా చర్యలు చేపట్టేవారని స్థానిక నివాసి ఒకరు మీడియాకు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top