ముంబై నుంచి మేక కాళ్లు..

Food Adulteration in Krishna - Sakshi

నిత్యావసర సరుకుల నుంచి తినే పదార్థాల వరకూ సర్వం కల్తీ

నిల్వ తినుబండారాల అమ్మకాలు .. రోగాల బారిన పడుతున్న ప్రజలు

కానరాని అధికారుల దాడులు

జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో అడుగడుగునా కల్తీలు రాజ్యమేలుతున్నాయి. ఉప్పు, పప్పు, చింతపండు, నూనె, కారం.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని నిత్యావసర సరుకులూ కల్తీలమయమైపోయాయి. చేసేది లేక వినియోగదారులు కల్తీ సరుకులనే కొనుగోలు చేస్తున్నారు. కల్తీలను నియంత్రించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

కృష్ణాజిల్లా, మచిలీపట్నం టౌన్‌ : పట్టణంలోని పలు దుకాణాల్లో కల్తీ మోసాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఉప్పు, పప్పు వంటి నిత్యావసర సరుకులను విక్రయించే పచారీ దుకాణాల నుంచి నిల్వ తినుబండారాలను స్వీట్‌ షాప్‌లు, బేకరీలు, రెస్టారెంట్లు, మెస్‌లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న టిఫిన్‌ సెంటర్‌లు, హోటళ్లు, బిర్యానీ పాయింట్‌లు, మాంసం దుకాణాలు.. ఇలా అన్ని దుకాణాల్లోనూ కల్తీతో పాటు నిల్వ పదార్థాలను వినియోగదారులకు అంటగడుతున్నారు.

బియ్యం కల్తీ..
బీపీటీ రకం బియ్యం కావాలని అడిగితే కిలో రూ.40 నుంచి రూ.50 వరకూ ఉన్న ఇతర రకాలను అంటగడుతున్నారు. తీరా వండితే రేషన్‌ బియ్యం మాదిరిగా ఉంటుండటంతో వినియోగదారులు బిత్తరపోతున్నారు. హోటళ్లకు వెళితే నిల్వ చట్నీలు, పాచిపోయిన, నిల్వ పిండితోనే తినుబండారాలు తయారీ చేసి విక్రయిస్తున్న ఘటనలు పలుచోట్ల చోటు చేసుకుంటున్నాయి. రహదారుల మార్జిన్‌లు, మురుగు డ్రెయిన్‌ల వెంబడి టిఫిన్‌ బండ్లు ఇబ్బడి ముబ్బడిగా దర్శనమిస్తున్నాయి. చిన్న పునుగుల నుంచి అట్టు, ఇడ్లీ.. వంటి అల్పాహారాలను విక్రయిస్తున్నారు. అయితే వీటి నాణ్యత ప్రశ్నార్థకం. కల్తీ నూనెలతో ఈ వంటకాలు జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

కానరాని ఫుడ్‌ కంట్రోల్‌ శాఖ సిబ్బంది
తినుబండారాల నాణ్యతను గతంలో మున్సిపాల్టీ పరిధిలో పని చేసే ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్లు పర్యవేక్షించేవారు. అయితే ఈ పోస్టులను ప్రభుత్వం రద్దు చేయటంతో తనిఖీలు చేయటం లేదు. సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతోనే పట్టణంలో ఒక్క దాడి కూడా చేసిన దాఖలాలు లేవు. దీంతో వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారింది. ఇక మాంసం దుకాణాల వద్ద కూడా డీప్‌ ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన మాంసం, చనిపోయిన జీవాలను కోసి విక్రయిస్తున్నా పట్టించుకునే నాధుడే లేడు. మున్సిపల్‌ కబేళాలో వైద్యుడి పర్యవేక్షణలో జీవాలను కోయాల్సి ఉన్నా అది అమలు కావడం లేదు. దీంతో జీవాలను ఇళ్ల వద్దే కోసి విక్రయాలు జరుపుతున్నారు.

ముంబై నుంచి మేక కాళ్లు..
ముంబై నుంచి ప్రతి వారం ఐస్‌లో నిల్వ ఉంచిన మేక తలలు, కాళ్లు రైలు ద్వారా ఇక్కడికి చేరుతున్నాయి. వాటిని మార్కెట్‌లో యథేచ్ఛగా విక్రయిస్తున్నా పట్టించుకునేవారే లేరు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కల్తీ వస్తువుల విక్రయాలపై దృష్టి సారించాలని పట్టణవాసులు కోరుతున్నారు.

నిల్వ పదార్థాలు తినకుండా ఉంటేనే మేలు..
నిల్వ ఉన్న పదార్థాలు తినకుండా ఉంటేనే ఆరోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చు. నిల్వ పదార్థాలు, కల్తీ సరుకులతో చేసినవి తింటే పలు అనారోగ్యాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా ఉదరకోశ వ్యాధులు సోకుతాయి. పేగుల్లో ఇన్‌ఫెక్షన్, అల్సర్‌లు, డయేరియా వంటి రోగాలు సోకటంతో పాటు నులిపురుగులు వృద్ధి చెందుతాయి.  కాగిన నిల్వ నూనెతో వండే పదార్థాలను తింటే క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.    – డాక్టర్‌ అల్లాడ శ్రీనివాసరావు, ఆర్‌ఎంఓ, జిల్లా ప్రభుత్వాస్పత్రి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top