చెట్టును ఢీకొన్న స్కార్పియో; ఐదుగురి దుర్మరణం

Five People Killed In Chhattisgarh Road Accident - Sakshi

మృతుల్లో ఒకే కుటుంబం వారు నలుగురు  

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

సాక్షి, నెల్లిమర్ల: పర్యాటక ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం మిగిలింది. నెల్లిమర్లలోని మిమ్స్‌ మెడికల్‌ కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సునీత కుటుంబం విహార యాత్ర కోసం ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌కు రెండు రోజుల క్రితం వెళ్లారు. డాక్టర్‌ సునీత, భర్త లక్ష్మణరావు, వారి కుమార్తె శ్రేయ, కుమారుడు, సునీత సోదరుడు రమేష్, విశాఖపట్నానికి చెందిన తిరుమల రావు కుటుంబసభ్యులు మరో ముగ్గురు విశాఖపట్నం నుంచి విశాఖ – కిరండూల్‌ రైలులో జగదల్‌ పూర్‌ వెళ్లారు. అక్కడ పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు స్థానికంగా  ఓ కారును బక్‌ చేసుకున్నారు. ఆ కారులో వెళ్లి చిత్రకోట జలాశయాన్ని సందర్శించి ఆహ్లాదంగా గడిపారు. అలాగే దంతెవాడలోని దంతేశ్వరి ఆలయానికి వెళ్లి దంతేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు.

తిరుగు ప్రయాణానికి జగదల్‌ పూర్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చేందుకు  సోమవారం అదే కారులో అందరూ బయల్దేరారు. అయితే కారు డ్రైవర్‌ పూర్తి మద్యం మత్తులో ఉండడంతో మార్గమధ్యలో ఓ చెట్టును ఢీకొట్టాడు. దీంతో కారు మొత్తం నుజ్జునుజ్జు కాగా సంఘటనా స్థలంలో లక్ష్మణారావు, కుమార్తె శ్రేయ ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను జగదల్‌ పూర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రమేష్, తిరుమలరావు మృతి చెందారు. మరో ఇద్దరు క్షతగాత్రులు డాక్టర్‌ సునీత, తిరుమలరావు కుటుంబానికి చెందిన ఓ మహిళ తీవ్రంగా గాయపడడంతో విశాఖపట్నం తరలిస్తుండగా డాక్టర్‌ సునీత మృతిచెందారు. స్కార్పియో డ్రైవర్‌ పవన్‌ నెట్టం జగదల్‌పూర్‌ కళాశాల ఆస్పత్రిలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు.  

శోకసంద్రంలో మిమ్స్‌ సిబ్బంది.. 
డాక్టర్‌ వెనకోట సునీత మిమ్స్‌లో అనాటమీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈమె మృతితో మిమ్స్‌ సిబ్బందితో పాటు యాజమాన్యం శోకసంద్రంలో మునిగిపోయారు. మిమ్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ అల్లూరి మూర్తిరాజు, ట్రస్టీలు సత్యనారాయణరాజు, డాక్టర్‌ ప్రవీణ్‌వర్మ, రామకృష్ణరాజు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మీకుమార్, తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top