విభజన తర్వాత పేలిన తొలి తూటా!

First bullet shot after state division - Sakshi

ఈ ఏడాది ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ఎన్‌కౌంటర్లలో మరణించిన మావోల సంఖ్య 53

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు 35

మావోయిస్టు ప్రభావిత జిల్లాలు 10

సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనానంతరం ఓ ఎమ్మెల్యేపై మావోయిస్టులు తొలితూటాను పేల్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల దారుణ వైఫల్యానికి ఈ ఘటన అద్దం పడుతోంది. సరిగ్గా 6 నెలల క్రితం మావోయిస్టుల కదలికలపై ‘సాక్షి’ ముందుగానే హెచ్చరించినా పరిస్థితులను గ్రహించటంలో ప్రభుత్వం విఫలం కావడంతోనే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. 2014లో వైఎస్సార్‌ సీపీ గుర్తుపై విశాఖ జిల్లా ఎస్టీ నియోజకవర్గమైన అరకు శాసనసభ్యుడిగా గెలుపొందిన కిడారి సర్వేశ్వరరావు అనంతరం పార్టీ ఫిరాయించి అధికార టీడీపీలో చేరడం తెలిసిందే. ఆయనకు విప్‌ పదవి ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం మావోయిస్టుల నుంచి కాపాడకోలేకపోయింది. 

దాడికి ఆర్కే వ్యూహ రచన
ఆంధ్ర ఒడిశా బోర్డర్‌ (ఏఓబీ) జోన్‌లోని మల్కన్‌గిరి, కోరాపుట్, బస్తర్‌(ఎంకేబీ) ఏరియాకు చెందిన మావోయిస్టు కీలక దళం ఈ ఆపరేషన్‌ నిర్వహించినట్లు సమాచారం. 65 మందికిపైగా మావోయిస్టు మిలటరీ ప్లాటూన్‌ థర్డ్‌ సీఆర్‌సీ (సెంట్రల్‌ రివల్యూషనరీ కంపెనీ) సభ్యులు ఇందులో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు చెబుతున్నారు. ఒడిశాలో సాకేత్‌ పేరుతో షెల్టర్‌ పొందుతున్న అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే వ్యూహ రచనతోనే ఈ దాడి జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. 

రెండో గిరిజన ఎమ్మెల్యే..
మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన వారిలో ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు  ఉండటం గమనార్హం. 17 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో రాగ్యానాయక్‌ హత్యకు గురికాగా ఇప్పుడు కిడారిని మావోయిస్టులు హతమార్చారు. 

ఉమ్మడి ఏపీలో ప్రజాప్రతినిధుల హత్యలు, కిడ్నాప్‌లు..
1990 వరంగల్‌లో మాజీ మంత్రి హయగ్రీవాచారిని మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. 
1991 మలక్‌పేట్‌ ఎమ్మెల్యే సుధీర్‌ కుమార్‌ కిడ్నాప్‌. మావోయిస్టు నేత నెమలూరి భాస్కర్‌రావు విడుదలకు డిమాండ్‌.
1993 పెనుగొండ ఎమ్మెల్యే చెన్నారెడ్డి హత్య, మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే రంగదాసును హత్య చేశారు. 
1995 నెల్లూరు జిల్లాకు చెందిన మాగుంట సుబ్బరామిరెడ్డిని దారుణంగా చంపారు. 
1999 మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు,ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌ ఎమ్మెల్యే పురుషోత్తంరావు హత్య.
2000 మార్చి 7న అప్పటి మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని మందుపాతర అమర్చి చంపేశారు. 
2001 డిసెంబర్‌ 30న దేవరకొండ ఎమ్మెల్యే రాగ్యానాయక్‌ను కాల్చి చంపారు. అప్పటి కొల్లాపూర్‌ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి జూపల్లి కృష్ణారావుపై నక్సలైట్లు దాడిచేయగా గన్‌మెన్‌తో పాటు ఇద్దరు కార్యకర్తలు చనిపోయారు. 
2003 అక్టోబర్‌ 24న తిరుపతి అలిపిరిలో చంద్రబాబుపై క్లే్లమోర్‌ మైన్స్‌ పేల్చి దాడికి పాల్పడ్డారు.  
2005 ఆగస్టు 15న మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డిపై కాల్పులు జరిపి చంపారు. 
2007 సెప్టెంబర్‌ 17న మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిపై మావోయిస్టు పార్టీ ల్యాండ్‌మైన్లతో దాడిచేసింది. జనార్దన్‌రెడ్డి, ఆయన సతీమణి రాజ్యలక్ష్మి తృటిలో తప్పించుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top