బతుకులు బూడిద

Fire Accident Occurred Due To Short Circuit In Rajam Town - Sakshi

రెప్పపాటు కాలంలో మొత్తం జరిగిపోయింది. కళ్ల ముందే కష్టార్జితం బూడిదపాలైంది. ప్రమాదాన్ని నివారించేలోగానే అంతా ఆవిరై చివరకు కట్టుబట్టలే మిగిలాయి. ఈ ఎస్సీ కాలనీలో నివసిస్తున్న వారంతా ఉపాధి కూలీలు. తమ ఇళ్లు మంటలపాలయ్యాయని తెలుసుకొని పరుగు పరుగున వచ్చిన వారికి మొండిగోడలు దర్శనమివ్వడంతో కుప్పకూలిపోయారు. కొందరి ఆర్తనాదాలు మిన్నంటగా.. మరికొందరు సొమ్మసిల్లిపోయారు. సాయం చేసేందుకు ముందుకు వచ్చిన గ్రామస్తులు బాధితులను ఓదార్చడమే తప్ప జరిగిన నష్టాన్ని నివారించలేని పరిస్థితి.. ఇవీ రాజాం మండలంలోని పొగిరి గ్రామంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో కనిపించిన దృశ్యాలు. 

సాక్షి, రాజాం(శ్రీకాకుళం) : వారంతా నిరు పేదలు.. కాయకష్టం చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టి బతుకులు ఈడుస్తున్నవారు.. కూలికి వెళ్తేనే గానీ పూట గడవని దుస్థితి. వచ్చిన కాస్తో కూస్తో కూలీ డబ్బులను ఇళ్లలోనే దాచుకుని అవసరానికి వినియోగించుకునే అల్పజీవులే వీరంతా. సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో వీరంతా కట్టుబట్టలతో రోడ్డునపడ్డారు. పొగిరి గ్రామంలోని ఎస్సీ కాలనీలో జె.గౌరి ఇంటి సమీపంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దగ్గర్లోని విద్యుత్‌ తీగలు షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో  మంటలు చెలరేగి ఉంటాయని గ్రామస్తులు భావిస్తున్నారు.

ఆ సమయంలో ఈ కాలనీలో నివాసముంటున్నవారంతా ఉపాధి పనులకు వెళ్లిపోయారు. దీంతో మంటలు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వ్యాపించేవరకూ ప్రమాదాన్ని ఎవరూ పసిగట్టలేకపోయారు. అగ్నికి వాయువు తోడు కావడంతో మంటలు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వ్యాపించాయి. గ్రామంలో ఎస్సీ కాలనీలో అగ్ని ప్రమాద విషయాన్ని ఉపాధి పనుల్లో ఉన్న బాధితులు తెలుసుకుని తమ ఇళ్లకు చేరుకునే సమయానికే మొత్తం నష్టం జరిగిపోయింది.

అప్పటికే ఈ పూరిళ్లలో ఉన్న వంట గ్యాస్‌ బండలకు అగ్ని అంటుకొని అవి పేలడంతో మంటల వ్యాప్తి అధికమైంది. మంటలను అదుపు చేసేందుకు వెళ్లిన యువకులు, గ్రామస్తులు సైతం గ్యాస్‌ బండల పేలుళ్లను తట్టుకోలేక, ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయలేక భయబ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. ఈలోగా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి చొప్పున రెండు వీధుల్లో మంటలు వ్యాపించి మొత్తం 31 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.

భారీగా నష్టం...
ఈ ప్రమాదంలో బాధితులకు భారీ నష్టమే మిగిలింది. ఇళ్లల్లోని మొత్తం వస్తు సామగ్రి అగ్నికి ఆహుతయ్యింది. ఈ ప్రమాదంలో పూరిళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. చౌడువాడ వెంకటరమణకు చెందిన రూ.40 వేలు నగదు మొత్తం కాలిపోయింది. 11 ఇళ్లలో బీరువాలు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. నాలుగు ఇళ్ల నుంచి గ్యాస్‌ బండలు పెద్ద శబ్దం చేస్తూ పేలాయి. పన్నెండు కుటుంబాలకు చెందిన టీవీలు పూర్తిగా కాలిపోయాయి.

విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికేట్లు మొత్తం బూడిదయ్యాయి. పాపారావుకు చెందిన సౌండ్‌ సిస్టమ్‌ మొత్తం కాలిపోవడంతో ముద్దముద్దలుగా దర్శనమిస్తోంది. పలువురు బాధితులకు చెందిన ఎల్‌ఐసీ బాండ్లు, బ్యాంకు పాసు పుస్తకాలు, ఆధార్‌ కార్డులు, కరెంటు మీటర్లు, బంగారు అభరణాలు వంటివి మొత్తం బూడిదయ్యాయి. వీటిని చూసి బాధితుల ఆర్తనాదాలు ఆకాశాన్నంటాయి. కొంతమంది బాధితులు ఈ ప్రమాదాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపడిపోయారు.

ప్రమాదం జరిగే సమయానికి వేరే ప్రాంతాల్లో ఉన్న బాధితులు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని ఇంటికి చేరుకోగానే మొండిగోడలు చూసి లబోదిబోమంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా విలపిస్తూ చెట్టుకొకరు.. పుట్టకొకరుగా రోడ్డున పడ్డారు. ఈ ప్రమాదంలో రూ.9 లక్షల మేర ఆస్తినష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈమేరకు రెవెన్యూ అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. బాధితులకు తక్షణ సాయం నిమిత్తం ఒక్కో కుటుంబానికి 10 కిలోల బియ్యాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. 

యువత సేవా కార్యక్రమాలు
ప్రమాద స్థలం వద్దకు గ్రామానికి చెందిన యువకులు చేరుకుని తొలుత మంటలను అదుపుచేసేందుకు సాహసించారు. కాలిపోతున్న ఇళ్ల నుంచి గ్యాస్‌ బండలు పేలడంతో ప్రమాద తీవ్రత అధికం కావడంతో ప్రజలను అప్రమత్తం చేసి ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా సేవలు అందించారు. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు పొగిరి లెనిన్, జడ్డు జగదీష్, కామోదులు శ్రీరంగనాయుడు, శనపతిరాము తదితరులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని బాధితులకు సాయం అందించారు. బాధితులుకు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటుచేశారు. రాజాం టౌన్‌ సీఐ సోమశేఖర్‌తోపాటు తహశీల్దార్‌ పి.వేణుగోపాలరావు, ఆర్‌ఐ శివకృష్ణ తదితరులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని బాధితుల వద్ద వివరాలు సేకరించారు. తక్షణ నష్టపరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

బాధితులకు రెడ్‌క్రాస్‌ సాయం
అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న రాజాం రెడ్‌క్రాస్‌ ప్రతినిధి కొత్తా సాయిప్రశాంత్‌కుమార్‌ జిల్లా రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్‌మోహన్‌రావుకు సమాచారం అందించారు. వెంటనే ఆయన అక్కడి నుంచి ప్రతి కుటుంబానికి ఒక వంటసామగ్రి కిట్‌తోపాటు దోమల తెర, దుప్పట్లు తీసుకొచ్చి పొగిరిలో 31 అగ్నిప్రమాద కుటుంబాలకు అందించారు. గ్రామ పెద్ద పొగిరి లెనిన్‌ చేతుల మీదుగా వీటిని బాధితులకు అందజేశారు. 

బాధితులను అన్నివిధాలా ఆదుకుంటాం
అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు చెప్పారు. విజయవాడలో అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఆయన అగ్ని ప్రమాద ఘటనపై స్పందించా రు. విజయవాడ నుంచి రాజాం మండలంలోని అధికారులకు ఫోన్‌ చేసి బాధితులకు సహాయం అందించాలని ఆదేశించారు. స్థానిక నాయకుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని బాధితులతో మాట్లాడారు. తక్షణ ప్రభుత్వం సాయం అందించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top